జంతువులపై దయ చూపాలి.. మూగజీవాల పట్ల బాధ్యతారాహిత్యంగా ఉండొద్దు: ప్రధాని మోదీ

జంతువులపై దయ చూపాలి.. మూగజీవాల పట్ల బాధ్యతారాహిత్యంగా ఉండొద్దు: ప్రధాని మోదీ
  • వంతారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో ప్రధాని విహారం
  • పులి, సింహం పిల్లలతో సరదాగా గడిపిన దృశ్యాలు వైరల్

న్యూఢిల్లీ: జంతువులపై ప్రతి ఒక్కరూ దయ కలిగి ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. బాధ్యతారాహిత్యాన్ని వీడి మనతోపాటే భూమిపై నివసించే జంతువులను ప్రేమతో చూసుకోవాలని అన్నారు. గుజరాత్​లోని వన్యప్రాణుల రక్షణ, పునరావాసం, సంరక్షణ కేంద్రమైన ‘వంతారా’ను ప్రధాని మోదీ గత ఆదివారం ప్రారంభించారు. ఆయనకు రిలయన్స్​ ఇండస్ట్రీస్​ అధినేత ముకేశ్​ అంబానీ దంపతులు ఘన స్వాగతం పలికారు. 

ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను మంగళవారం ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. అక్కడ పునరావాసం పొందుతున్న జంతువులతో మోదీ సరదాగా గడిపారు. పులి, సింహం పిల్లలతో ఆడుకున్నారు. జిరాఫీ, సింహం పిల్లలకు ఆహారం పెట్టి ఆనందించారు. వన్యప్రాణుల హాస్పిటల్​ను, జంతువుల కోసం ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ, సిటీ స్కాన్‌‌లు, ఐసీయూలు మొదలైన వాటితో కూడిన పశువైద్య సౌకర్యాలను వీక్షించారు. 

అలాగే, వైల్డ్‌‌ లైఫ్ అనస్థీషియా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపీ, డెంటిస్ట్రీ, ఇంటర్నల్ మెడిసిన్ మొదలైన అనేక విభాగాలను కూడా పరిశీలించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్​ అవుతున్నాయి. కాగా, వంతారా సేవలను ప్రధాని మోదీ   ప్రశంసించారు.  గాయపడిన, ఇబ్బందుల్లో ఉన్న జంతువులను సంరక్షించే లక్ష్యంతో ‘వంతారా’ కేంద్రాన్ని రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్‌‌ లిమిటెడ్‌‌, రిలయన్స్‌‌ ఫౌండేషన్‌‌ డైరెక్టర్‌‌ అనంత్‌‌ అంబానీ ప్రారంభించారు. ఇది కృత్రిమ అడవి. గుజరాత్‌‌లోని జామ్‌‌నగర్‌‌ రిలయన్స్‌‌ రిఫైనరీ 
కాంప్లెక్స్‌‌లో 3 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది.

ప్రపంచమంతా భారత్​వైపే చూస్తున్నది

భారత్​ నాణ్యమైన వస్తువులను తయారుచేయగల నమ్మకమైన భాగస్వామిగా ప్రపంచమంతా చూస్తున్నదని ప్రధాని మోదీ అన్నారు. ఈ తరుణంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు భారత పరిశ్రమ పెద్ద ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. రెగ్యులేటరీ, ఇన్వెస్ట్​మెంట్, వ్యాపారాన్ని సులభతరం చేయడంలో సంస్కరణలపై మంగళవారం నిర్వహించిన పోస్ట్​ బడ్జెట్​ వెబినార్​లో మోదీ ప్రసంగించారు. 

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నదని, ఈ నేపథ్యంలో అధిక నాణ్యమైన ఉత్పత్తులు, నమ్మకమైన సప్లై చైన్​ గల విశ్వసనీయ భాగస్వామిగా భారత్​ అన్ని దేశాలకు ఆశాజనకంగా కనిపిస్తున్నదని తెలిపారు. గత పదేండ్లుగా కేంద్ర సర్కారు పరిశ్రమలతో కలిసి పనిచేస్తోందని, సంస్కరణలు, ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత, సమ్మిళిత వృద్ధికి నిబద్ధతను చాటిందని చెప్పారు.  నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్​ గ్రోత్​ ఇంజిన్​లా మారిందన్నారు. అత్యంత గడ్డు పరిస్థితుల్లోనూ దేశం ఆర్థికంగా తన సత్తాను చాటుతున్నదని, అందుకే భారత్​తో ప్రపంచ దేశాలు ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని అనుకుంటున్నాయని చెప్పారు.

 ప్రపంచవ్యాప్తంగా డిమాండ్​ ఉన్న వస్తువులను తయారుచేయాలని పారిశ్రామిక వేత్తలకు సూచించారు. రాష్ట్రాలన్నీ ఒకదానితో ఒకటి పోటీపడాలని, ప్రోగ్రెసివ్​ పాలసీలతో ముందుకొచ్చే రాష్ట్రాల్లో కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తాయని చెప్పారు.