యుద్ధానికి సిద్ధంగా ఉండండి : ఉత్తర కొరియా కిమ్ పిలుపు

ఉత్తరకొరియా.. యుద్ధానికి ఎప్పుడైనా సిద్ధం అంటూ ప్రకటిస్తూనే ఉంటుంది. అమెరికాతోపాటు దక్షిణ కొరియాతో.. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ కు ఉన్న వైరం కొత్తేమీ కాకపోయినా.. లేటెస్ట్ గా కిమ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రపంచ దేశాలను భయపెడుతున్నాయి. ఇటీవల అమెరికాతో కలిసి దక్షిణ కొరియా యుద్ధ విన్యాసాలు చేసింది. దీంతో కిమ్ సైతం అప్రమత్తం అయ్యారు. 

ఆర్మీ యూనివర్సిటీని సందర్శించిన సమయంలో.. అక్కడ ఉన్న సైన్యాధికారులు, సైన్యాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. యుద్ధానికి సిద్ధంగా ఉండాల్సిన సమయం వచ్చేసింది.. గతంలో ఎప్పుడూ లేనంతగా.. యుద్ధానికి సిద్ధంగా ఉండాలి.. ఆ సమయం వచ్చేసింది అంటూ పిలుపునిచ్చినట్లు ఉత్తరకొరియా టీవీల్లో వార్తలు వచ్చాయి. 

కిమ్ ఇలాంటి ప్రకటన చేయటం కొత్తకాకపోయినా.. ఇటీవల ఆయన చేస్తున్న యుద్ధ సన్నాహాలు మాత్రం భయపెడుతున్నాయి. ఇటీవలే హైపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణనులను పరీక్షించారు. రష్యాతో ఆయుధ, రాజకీయ సంబంధాలను మరింత మెరుగుపరుచుకున్నారు. సైనిక ప్రాజెక్టుల్లో భాగంగా ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యాకు సాయం చేస్తున్నారు. ఇలాంటి పరిణామాల క్రమంలోనే కిమ్ ఈ వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారాయి.

ఉత్తరకొరియాలోనే అతిపెద్ద ఆర్మీ యూనివర్సిటీ డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాను సందర్శించటం.. అక్కడ ఆర్మీ అధికారులు, సైన్యంతో యుద్ధానికి సిద్ధంగా ఉండాల్సిన సమయం వచ్చిందని చెప్పటం చూస్తుంటే.. కిమ్ ఏ క్షణమైనా దక్షిణ కొరియాతో యుద్ధానికి కాలుదువ్వే అవకాశాలు లేకపోలేదు అనేది ప్రచారం జరుగుతుంది. ఉక్రెయిన్ పై రష్యా ఎలా అయితే యుద్ధం చేస్తుందో.. అదే రష్యా సాయంతో.. దక్షిణ కొరియాతో యుద్ధానికి తెగబడతారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదిఏమైనా కిమ్ చేసిన ఈ వ్యాఖ్యలను రెగ్యులర్ గా చూడాలా లేక సీరియస్ గా పట్టించుకోవాలా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.