సూర్యాపేట టౌన్​లో ఎలుగుబంటి..8 గంటలు రెస్క్యూ ఆపరేషన్

  •     శ్రీనివాసకాలనీలో కడుతున్న ఇంట్లోకి చొరబడిన భల్లూకం 
  •     జనాల అలికిడితో మరో ఇంట్లోని బాత్​రూంలోకి...    8 గంటల పాటు శ్రమించి 

సూర్యాపేట వెలుగు: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనావాసాల్లోకి ఎలుగుబంటి రావడంతో కలకలం రేగింది. సూర్యాపేటలోని శ్రీనివాస కాలనీలోని తండు వెంకన్న కొత్తగా కడుతున్న ఇంట్లోకి శనివారం రాత్రి ఓ ఎలుగుబంటి చొరబడింది. ఆదివారం ఉదయం ఇంటికి నీళ్లు కొట్టడానికి యజమాని వెళ్లగా ఎలుగుబంటి కనిపించడంతో భయపడి పరుగులు తీశాడు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వాళ్లు  గుమిగూడడంతో కంగారు పడ్డ ఎలుగుబంటి పక్క గల్లీలో గుండగాని రాములు కడుతున్న ఇంట్లోని బాత్​రూంలోకి దూరింది. స్థానికులు పోలీస్, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు.  

8 గంటల పాటు కొనసాగిన రెస్క్యూ

ఎలుగుబంటిని పట్టుకునేందుకు అధికారులు 8 గంటల పాటు కష్టపడ్డారు. ఎలుగుబంటి దూరిన ఇంటి చుట్టుపక్కల పెద్ద సంఖ్యలో ఇండ్లు ఉండడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, ఫారెస్ట్​ సిబ్బంది ఎలుగుబంటి బయటకు రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. వరంగల్ కాకతీయ జువాలాజికల్ పార్క్ అధికారులకు సమాచారమివ్వగా 8మందితో కూడిన రెస్క్యూ టీమ్ సూర్యాపేటకు వచ్చింది. 

బాత్​రూంలో ఉన్న ఎలుగుబంటికి మొదట మూడు రౌండ్లు మత్తు మందు ఇచ్చినా స్పృహ తప్పలేదు.  చివరకు నాలుగో రౌండ్ మత్తు మందుతో మత్తులోకి జారుకుంది. దీంతో దాన్ని బంధించి వరంగల్ కాకతీయ జువాలాజికల్ పార్క్ కు తరలించారు. ఆత్మకూరు (ఎస్) మండలం కందగట్ల గుట్టల నుంచి గాని..ఉండ్రుగొండ నుంచి గాని వచ్చి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

ఆపరేషన్ ను పర్యవేక్షించిన మంత్రి జగదీశ్​రెడ్డి 

రెస్క్యూ ఆపరేషన్ ను మంత్రి జగదీశ్​రెడ్డి స్వయంగా పరిశీలించారు. అక్కడికి వచ్చిన ఫారెస్ట్ అధికారులతో మాట్లాడారు. తొమ్మిది నెలల క్రితం తిరుమలగిరిలో కనిపించిన ఎలుగు బంటి..ఇప్పటి ఎలుగు ఒక్కటేనని వివరించారు. నెల కింద అర్వపల్లి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు స్థానికులు సమాచారం ఇచ్చారని, తాము అక్కడికి వెళ్లేలోపే పారిపోయిందని చెప్పారు. మొత్తం మీద ఎవరికీ ఏం జరగకుండా సురక్షితంగా ఎలుగుబంటిని బంధించడంతో ఫారెస్ట్ అధికారులను మంత్రి అభినందించారు.