ఇతరుల అందానికి మెరుగులుదిద్దే ప్రయత్నంలో లేనిపోని ఇబ్బందుల్లో పడుతున్నారు బ్యూటీషియన్లు. కాస్మొటిక్స్‌లో ఉండే రసాయనాలు వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారు. ముఖ్యంగా పెడిక్యూర్, మెనిక్యూర్, నెయిల్ జెల్స్, యాక్రిలిక్ పాలిష్, ఆర్టిఫిషియల్ నెయిల్స్ లాంటి సర్వీసుల వల్ల వందమందిలో దాదాపు ముగ్గురు సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవి ఆషామాషీగా చెప్తున్న మాటలేం కావు. వేలమంది బ్యూటీషియన్స్ పరీక్షించి మరీ కొలరాడో స్టేట్ యూనివర్సిటీ ఈ విషయాల్ని బయటపెట్టింది...
బ్యూటీ రంగంలో 5 నుంచి 19 ఏళ్ల అనుభవమున్న వాళ్లందరిని ఒకచోట చేర్చి చేసిన ఈ స్టడీలో బ్యూటీషియన్లు కొన్ని సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. ముఖ్యంగా తలనొప్పి, చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయట వీళ్లకి.. ఇందుకు కారణాలు ఏంటంటే.
సమస్యలు తెచ్చిపెడుతున్నాయి.
నెయిల్ పాలిష్ చిక్కగా ఉండేందుకు, త్వరగా గట్టిపడేందుకు పాలిష్ లలో 'ఫార్మాల్డిహైడ్ తప్పనిసరిగా వాడతారు. ఆ వాసనని పీల్చడం వల్ల అలర్జిక్ రియాక్షన్లతో పాటు తలనొప్పి కూడా వస్తుందట. అలాగే నెయిల్ సెలూన్స్ ఉపయోగించే మిథైల్ మిథాక్రిలేటి, బెంజిన్, బ్యుబైల్ ఎసిటేట్, ఇథైల్ ఎసిటేట్, ప్రొఫైల్ ఎసిటేట్ లాంటి కెమికల్స్‌ని ఎక్కువగా పీల్చడం వల్ల బ్యూటీషియన్లు తలనొప్పి, చర్మవ్యాధులతో పాటు క్యాన్సర్ బారిన కూడా పడుతున్నారని ఆ సర్వే తేల్చింది.
గోళ్ల రంగుల వల్ల..
గోళ్ల రంగుల్లో టోలిన్, ఎసిటోన్, పారాబెంజ్ వంటి రసాయనాలు ఉంటాయి. ఈ రసాయనాల వల్ల తలనొప్పి, వాంతులు, వికారం, ఇరిటేషన్, కళ్లు, గొంతు ఇన్ఫెక్షన్లు కలుగుతాయి. అలాగే ట్రైపినైల్ ఫాస్ఫేట్ అనే రసాయనంతో నెయిల్ పాలిష్ తయారుచేస్తారు. ప్లాస్టిక్, ఫామ్ ఫర్నిచర్ కి మంటలు అంటుకోకుండా వాడే ఈ రసాయనాన్ని నెయిల్ పాలిష్ ఎక్కువ రోజులు మన్నేందుకు వాడతారు. ఇవి హార్మోన్స్ పై ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. అలాగే నెయిల్ పాలిష్ రిమూవర్స్ లో రంగును కరిగించే సాల్వెంట్ రసాయనం లో అసిటోన్' ఉంటుంది. దీనివల్ల చర్మసంబంధిత సమస్యలొస్తాయి.
బరువు పెరుగుతారట..
నెయిల్ సెలూన్లో పనిచేసే బ్యూటీషియన్లకే కాదు ఆ రంగులను అలంకరించుకునే వాళ్లకూ సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. తరచూ
గోళ్లకు రంగులు వేసుకుంటే రంగుల్లో ఉండే ట్రై ఫినైల్ ఫాస్పేట్ అనే సిండ్రోమ్ హార్మోన్లపై ప్రభావం చూపి బరువు పెరిగేలా చేస్తుందని డ్యూక్ యూనివర్సిటీ సైంటిస్టులు చెబుతున్నారు. పశువుల మీద చేసిన పరీక్షలలో.. వాటికి సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలు తలెత్తాయి అని తేలింది. అయితే మనుషుల్లో మాత్రం బరువు పెరుగుతున్నట్లు గుర్తించారు.
Also Read : జీతం ఏముందీ.. కెరీర్ కదా ముఖ్యం.. ఈ తరం ఉద్యోగుల అభిప్రాయం ఇదేనా..!
మొత్తం మూడువేల రకాల గోళ్ల రంగులు సేకరించి వాటిని పరీక్షించగా వాటిలో 29 శాతం ఉత్పత్తుల్లో ఈ పదార్థం ఉంది. కొంతమందైతే అసలు అది ఉన్నట్లు చెప్పకుండానే కలిపేస్తున్నారు. గోళ్ల రంగు వేసుకున్న 10 నుంచి 14 గంటల తర్వాత వాళ్ల శరీరంలోని ట్రైఫినైల్ ఫాస్పేట్ మోతాదు దాదాపు ఏడు రెట్లు పెరిగింది. అయితే కృత్రిమ గోళ్లు పెట్టుకుని, వాటికి మాత్రమే రంగులు వేసుకున్నవాళ్లకు మాత్రం అలా పెరగలేదు.అందుకని గోళ్లరంగులు ఎక్కువ వేసుకోవడం అంత మంచిది కాదని, దానివల్ల శరీరంలో పలు రకాల మార్పులు వస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. మరీ తప్పనిసరైతే తప్పు చర్మానికి తగలకుండా చూసుకోవాలి. అలా తగిలితే అది రక్తంలోకి కూడా వెళ్తుందని హెచ్చరిస్తున్నారు.
-–వెలుగు,లైఫ్–