ఆగుతూ.. సాగుతూ

ఆగుతూ.. సాగుతూ
  • కొనసాగుతున్న హల్ది వాగు సుందరీకరణ పనులు
  • ఆరేండ్లలో యాభై శాతం పనులు మాత్రమే పూర్తి
  • పనుల నిర్వహణపై అఫీసర్ల తీవ్ర నిర్లక్ష్యం
  • ఇప్పటికైనా పూర్తి చేయాలని కోరుతున్న ప్రజలు

సిద్దిపేట/గజ్వేల్, వెలుగు: గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్ మండలం నాచారం వద్ద హల్దీ మూల వాగు సుందరీకరణ పనులు ఆరేండ్లుగా కొనసాగుతున్నాయి. 2018 లో అప్పటి సీఎం కేసీఆర్ హల్దీ వాగును పరిశీలించి సుందరీకరణ కోసం రూ.7.48 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో హల్దీ వాగుపై  చెక్ డ్యామ్, కరకట్ట, స్నానపు ఘాట్లను నిర్మించాలని ఆదేశించారు. కానీ పనులు  ప్రారంభించినప్పటి నుంచి అవాంతరాలే ఎదురవుతున్నాయి. నిధులు మంజూరు కాగానే అధికారులు టెండర్ల ప్రక్రియను ప్రారంభించినా కేటాయింపు విషయంలో చాలా ఆలస్యం జరిగింది.

మొదట పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ అగ్రిమెంట్ చేసుకోకపోవడంతో రెండోసారి టెండర్లు నిర్వహించారు. రెండో కాంట్రాక్టర్ నిర్ణీత గడువులోగా డాక్యుమెంట్లు సమర్పించక పోవడంతో దాన్ని రద్దు చేసి మూడోసారి టెండర్ ను నిర్వహించి 2019 చివరి నాటికి కాంట్రాక్టర్ కు పనులు అప్పగించారు. దీంతో ఏడాదంతా టెండర్లకే సరిపోగా నిధులు విడుదలైన రెండేళ్ల తర్వాత పనులు ప్రారంభమయ్యాయి. మూడోసారి టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్  పనులు ప్రారంభించారో లేదో కరోనా కారణంగా పనులు నిలచిపోయాయి. ఏడాదిలో పూర్తి కావాల్సిన పనులు ఆరేండ్లయినా ఇంకా సాగుతూనే ఉన్నాయి.

ఆరేండ్ల లో 50 శాతం పనులే..

హల్దీ వాగు సుందరీకరణ పనులు ఆరేండ్ల లో కేవలం 50 శాతం మాత్రమే జరిగాయి. కరోనా వల్ల  కొంత కాలం, కాళేశ్వరం జలాలను హల్దీ వాగులోకి వదలడం వల్ల మరి కొంత కాలం పనులు నిలిచిపోయాయి. మెల్లిగా చెక్ డ్యామ్ పనులను పూర్తి చేసినా ఇప్పటికీ ఘాట్లు, కరకట్ట నిర్మాణ  పనులు కొంత మేర మాత్రమే జరిగాయి. హల్ది వాగు నుంచి నాచారం లక్ష్మి నరసింహ స్వామి ఆలయం వరకు నిర్మించాల్సిన సీసీ రోడ్డు, వాగు వద్ద ఘాట్ల పనులు, స్నాన ఘట్టాల పనులు, డ్రైనేజీల నిర్మాణం ఇంకా మిగిలి ఉన్నాయి.

పిచ్చి మొక్కల తొలగింపు పనులు ఇప్పటికీ   ప్రారంభం కాలేదు. మరోవైపు హల్దీ వాగు పనులు సకాలంలో పూర్తి చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కానీ నాచారం ఆలయ అధికారుల నుంచి తమకు సహకారం లభించకపోవడం వల్ల పనులు ఆలస్యమవుతున్నాయని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. 

ఏడాది ఆఖరు నాటికి 

పనులు పూర్తి చేస్తాంహల్ది మూల వాగు సుందరీకరణ పనులను ఈ ఏడాది ఆఖరు నాటికి  పూర్తి చేస్తాం.  పలు కారణాల వల్ల పనులకు ఆటంకం కలిగిన విషయం వాస్తవమే. గడువు లోపు  పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించి పనుల వేగాన్ని పెంచాం. ఆలయ అధికారుల నుంచి సరైన సహకారం అందక పోవడం వల్ల సీసీ రోడ్డు, గోడ నిర్మాణ పనుల విషయంలో జాప్యం జరిగింది.  - పవన్ కుమార్, డీఈ ఇరిగేషన్ శాఖ, గజ్వేల్