మూసీ నదీతీర అభివృద్ధి ప్రాజెక్టు కూడా హైడ్రాలాంటి పరిస్థితిని ఎదుర్కోకూడదని, దాని పటిష్టతలను కోల్పోకూడదని ఆశిద్దాం. మూసీ అభివృద్ధి ప్రాజెక్టు హైదరాబాద్‌కు నిజంగా మంచిది. ఈ ప్రాజెక్టు భాగ్యనగర ప్రతిష్టను దేశవ్యాప్తంగా పెంచడంతోపాటు అంతర్జాతీయంగానూ ప్రత్యేక గుర్తింపును సాధిస్తుందనడంలో సందేహం లేదు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ పునరుజ్జీవంపై ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.
అయితే, మూసీ ప్రక్షాళనను మానవీయ కోణంలో అమలుచేసి బాధితులకు సత్వర న్యాయం చేసేవిధంగా చర్యలు చేపట్టాలి. తుది ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేయడం, ఆమోదించడం లేదా ప్రాజెక్టు వ్యయ అంచనాను ఖరారు చేయడానికి ముందుగానే మూసీ నదీతీర వెంబడి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల గురించి ప్రకటించి వాటిని ప్రారంభించడం సరికాదు. అదేవిధంగా ఇండ్లు, నిర్మాణాలను ఆ ప్రాజెక్టుల పేరిట కూల్చివేయడంపై పునరాలోచించాలి. కూల్చివేతల అనంతరం ఎదురయ్యే పరిణామాలను ముందుగానే అంచనావేసి తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలి.
హైదరాబాద్ నగర దిగువన ఉన్న మూసీ నది ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ రెండింటి నియంత్రణలో ఉంది. మూసీ నదిని ఒక వరద ప్రదాయనిలా కాకుండా ఒక నదిలా పరిగణించాలి. వాస్తవానికి చెరువులకు తప్ప ఏ నదికి ప్రత్యేకంగా బఫర్ జోన్ ఉండదు. కోర్ సిటీలోని వరద ప్రాంతం పూర్తిగా మానవ నివాసాలు, ఆక్రమణల ద్వారా విస్తృతం చెందింది. గతంలోని అన్ని ప్రభుత్వాలు మూసీ నదీతీర ప్రాంతంలో నిర్మాణాలకు ఎటువంటి అభ్యంతరాలు, నిబంధనలు తెలపకుండా అనుమతి ఇచ్చాయనేది గమనార్హం.
అక్రమ నిర్మాణాల వల్ల ఎదురయ్యే పరిణామాలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. పర్యావరణ సమతుల్యతను విస్మరించి అడ్డుకోలుగా నిర్మాణాలతో జరిగిన అస్తవ్యస్త అభివృద్ధికి గత ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పుడు పునరుజ్జీవంపై దురుద్దేశంతో కూడిన ఆందోళనలు నిర్వహించడం వల్ల మంచి కంటే హాని ఎక్కువగా జరుగుతుంది.
మూసీ నదీతీరం అభివృద్ధి కోసం కొన్ని సూచనలు
నదీ ప్రవాహ ప్రాంతాన్ని, ప్రస్తుతం ముంపునకు గురవుతున్న వరద ప్రాంతాన్ని గుర్తిం
చాలి. అందుకు తగినవిధంగా పటిష్ట సర్వేను చేపట్టాలి. నది కాలువ వెంబడి రెండు వైపులా బలమైన రిటైనింగ్ వాల్‌తోపాటు పటిష్ట కట్టను నిర్మించాలి.
మూసీ నది వెంబడి ఉన్న అన్ని నిర్మాణాలను తొలగించాలి.
అవసరమైన చోట రిటైనింగ్ వాల్, గ్రౌండ్ లెవల్ మధ్య ఉన్న ఖాళీలను పూరించాలి. నది వెంబడి ఉన్న అన్ని బహిరంగ ప్రదేశాల్లో ఉద్యానవనాలు, తోటలు, వినోద ప్రదేశాలు మొదలైన వాటితో నదికి రెండు వైపులా ఉన్న ప్రాంతాలను గ్రీనరీ జోన్లుగా అభివృద్ధి చేసి వీటిని రోడ్లతో అనుసంధానించాలి.
నదికి రెండు వైపులా ఉన్న రహదారులను అభివృద్ధి చేయాలి. ఆక్రమణలతోపాటు తాత్కాలిక నిర్మాణాలను కూడా పూర్తిగా తొలగించాలి. పైన పేర్కొన్న అభివృద్ధి కార్యక్రమాలు భారీ కూల్చివేతలకు దారితీయవు . ఈ పనులకు కొన్ని సంవత్సరాలు సమయం పడుతుంది. చట్టపరమైన సమస్యలు లేకుండా అభివృద్ధి పనులను చేపట్టవచ్చు.
నదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాలను కొత్త రహదారుల కోసం గుర్తించవచ్చు, అలాగే ప్రస్తుత రోడ్లను అనుసంధానించడానికి, సుందరీకరించడానికి, ఇప్పటికే ఉన్న నిర్మాణాలను కూల్చివేయడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం ద్వారా లేదా పరిహారం చెల్లించడం ద్వారా ఆటంకాలు రాకుండా నోటీసులు జారీ చేయవచ్చు.
నది వెంబడి ఉన్న ప్రాంతాలలో పెద్ద ఎత్తున కూల్చివేతలు జరగాల్సి ఉన్న ప్రాంతాల్లో, అటువంటి ప్రాంతాలలో ప్రజలుకు పునరా
వాసం కల్పించడంతోపాటు, సురక్షిత ప్రాంతాల్లో తమ ఇండ్లను నిర్మించేందుకు ఆర్థిక సహకారం అందించి ప్రోత్సహించాలి. స్వచ్ఛందంగా వారు సుందరీకరణలో భాగస్వాములయ్యేలా ప్రభుత్వం తగిన ప్రణాళికలు రూపొందించి అమలుచేయాలి. దీనికి కొన్ని సబ్సిడీలను సైతం అందించేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- కిషన్ బీఆర్,
డిప్యూటీ డైరెక్టర్ (రి) గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్