నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

స్వర్ణ తాపడానికి రూ.1.11 లక్షల విరాళం

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి గర్భగుడి విమాన గోపుర బంగారు తాపడానికి భక్తుల నుంచి విరాళాలు భారీగా వస్తున్నాయి. ఆదివారం యాదగిరిగుట్టకు చెందిన నామని బాలరాజు–నాగలక్ష్మీ దంపతులు స్వర్ణతాపడానికి రూ.1,11,111 విరాళంగా ఇచ్చారు. నగదును ఆలయ ఏఈవో భాస్కర్ కు అందజేశారు. యాదగిరిగుట్ట నరసింహుడి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు రెండో రోజు వైభవంగా జరిగాయి. ప్రధానాలయ ముఖ మంటపంలో శ్రీకృష్ణ అలంకారంలో స్వామివారిని ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో నిత్య పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆలయానికి ఆదివారం రూ.47,19,965 ఇన్ కమ్ వచ్చింది. అత్యధికంగా ప్రసాద విక్రయాల ద్వారా రూ.17,71,550 వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు తెలిపారు.

నేటి నుంచి సీపీఐ జిల్లా మహాసభలు

యాదాద్రి, వెలుగు: భువనగిరిలో సీపీఐ జిల్లా మహాసభలు సోమవారం ప్రారంభం కానున్నాయి. రెండ్రోజుల పాటు జరిగే ఈ సభలకు పార్టీ స్టేట్​సెక్రటరీ చాడా వెంకటరెడ్డి, జాతీయ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్​రెడ్డి హాజరుకానున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు తెలిపారు. మహాసభల ప్రారంభం సందర్భంగా 22న భువనగిరి టౌన్​లో కళాకారులతో భారీ ర్యాలీ నిర్వహించి, బహిరంగసభ నిర్వహించనున్నారు. 23న జిల్లా ప్రతినిధులతో నిర్వహించే పార్టీ ప్రతినిధుల సమావేశం జరగనుంది.

గిరిజన సంక్షేమాన్ని మరిచిన కేసీఆర్​ సర్కార్

సూర్యాపేట వెలుగు: రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం గిరిజన సంక్షేమాన్ని విస్మరించిందని తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామవత్ అంజయ్య నాయక్ పేర్కొన్నారు. ఆదివారం సూర్యాపేటలోని స్థానిక బొమ్మగాని ధర్మభిక్షం భవనంలో నిర్వహించిన తెలంగాణా గిరిజన సమాఖ్య రెండో మహాసభలో  ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్​ఎన్నికల్లో టైంలో గిరిజనులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఆరోపించారు. పోడు సాగుచేసుకుంటున్న గిరిజన బిడ్డలపై దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా గిరిజన పోడు రైతులకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర 2వ మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, బి.అమృతనాయక్, గుగులోతు రాజారాం, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

తాళం పగలగొట్టి నగదు, నగలు చోరీ 

మిర్యాలగూడ, వెలుగు: తాళాలు పగలగొట్టి ఇంట్లోని నగదు, నగలు అపహరించిన సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆదివారం జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. స్థానిక రవీందర్ నగర్​కు చెందిన అజ్గర్​20 రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్​ హాస్పిటల్​లో అడ్మిటయ్యాడు.  తండ్రిని చూసేందుకు అజ్గర్​కుమారుడు అన్వర్ మూడు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా హైదరాబాద్ వెళ్లాడు. ఆదివారం ఉదయం ఇంటికి రాగా తాళాలు పగలగొట్టి ఉన్నాయి. గుర్తుతెలియని దుండగులు ఇంట్లో దాచిన నగదు, 18 తులాల బంగారు నగలు చోరీ చేసినట్లు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్​పోలీసులు తెలిపారు. 

పార్కుల సుందరీకరణకు ప్రాధాన్యం

సూర్యాపేట వెలుగు: జిల్లాను ఆకుపచ్చగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి  జగదీశ్​రెడ్డి అన్నారు. ఆదివారం  స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా చివ్వెంల మండలం ఉండుగొండలో వనమహోత్సవం నిర్వహించారు. ఉండుగొండలో అటవీ శాఖ అర్బన్ పార్కును మంత్రి జగదీశ్ రెడ్డి, కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్, మున్సిపల్ చైర్ పర్సన్ పి.అన్నపూర్ణ లతో కలసి ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో పట్టణ ప్రగతి కింద 144 పార్కులు, పల్లె ప్రగతి కింద 679 పార్కులను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ కుమారి, జడ్పీటీసీ సంజీవ్ నాయక్, ఆర్డీవో రాజేంద్రకుమార్, డీఎఫ్​వో ముకుంద రెడ్డి, సీఈవో సురేశ్, పీడీ కిరణ్ కుమార్, డీపీవో యాదయ్య, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 

నల్గొండ అర్బన్​, వెలుగు: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. వన మహోత్సవంలో భాగంగా నల్గొండ పట్టణం నీలగిరి అర్బన్ పార్క్ లో ఆదివారం మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎం.సైది రెడ్డి, వైస్ చైర్మన్ రమేశ్, జిల్లా ఫారెస్ట్​ఆఫీసర్​రాంబాబు, అటవీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కోదాడ, మునగాల(మోతే), వెలుగు: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారంతో పర్యావరణ పరిరక్షణ జరుగుతోందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు.  స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఆదివారం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో హరితహారం నిర్వహించారు. కోదాడ ఆర్టీసీ బస్టాండ్ లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు.  మోతే మండలం సర్వారం, మావిళ్లగూడెం గ్రామాల్లో మొక్కలు నాటారు. సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నరసింహారావు, ఎల్లయ్య, టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ సైదులు, యూత్ అధ్యక్షులు పాషా పాల్గొన్నారు.
మునగాల, వెలుగు: పర్యావరణ పరిరక్షణకు చెట్లే మూలాధారం అని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ కోరారు. ఆదివారం మునగాలలో మొక్కలు నాటారు. జిల్లాలో 7.5 లక్షల మొక్కలు నాటాలని టార్గెట్ గా పెట్టుకున్నామని చెప్పారు. 

విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి

నేరేడుచర్ల, వెలుగు: విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా సంక్షేమ హాస్టళ్ల అధికారులు పనిచేయాలని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల లోని బీసీ,ఎస్టీ సంక్షేమశాఖ హాస్టళ్లను ఎమ్మెల్యే ఆదివారం రాత్రి తనిఖీ చేసి మాట్లాడారు. సంక్షేమ హాస్టళ్ల లో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. ప్రభుత్వం హాస్టళ్ల అభివృద్ధికి మంజూరు చేసే బడ్జెట్ సద్వినియోగం చేయాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. హాస్టల్ లోని వంట సామగ్రిని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు చల్లా శ్రీలత రెడ్డి, సురేశ్​బాబు, హాస్టల్ వార్డెన్స్ సైదులు, చందునాయక్ పాల్గొన్నారు.

హుజూర్​నగర్​లో ముత్యాలమ్మకు బోనాలు

హుజూర్నగర్ , వెలుగు: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ముత్యాలమ్మ  బోనాల జాతర ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ దేవత పోచమ్మ, ముత్యాలమ్మ అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు. సాయంత్రం రైతులు ట్రాక్టర్, ఎడ్ల బండ్లకు రంగురంగు కాగితాలతో అందంగా అలంకరించి ప్రభలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఎమ్మెల్యే సైదిరెడ్డి , మాజీ ఎమ్మెల్యే పద్మావతి, బీజేపీ లీడర్​శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ అర్చన బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. 

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత అలవర్చుకోవాలి

దేవరకొండ, వెలుగు: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్​ కోరారు. ఆదివారం దేవరకొండ మండలం ముదిగొండ గ్రామంలోని కనకదుర్గమ్మ తల్లికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దైవ చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. అనంతరం వనమహోత్సవంలో భాగంగా దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్​ కాలేజీలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్​ చైర్మన్​నర్సింహ్మ, ఎంపీపీ జాన్​యాదవ్​, జడ్పీటీసీ అరుణ, హన్మంతు వెంకటేశ్​గౌడ్​, వెంకట్​రెడ్డి, తిరుపతయ్య పాల్గొన్నారు.

మునుగోడుకు తరలిన ‘ఆలేరు’ శ్రేణులు

200 కార్లలో వెయ్యి మందితో మునుగోడుకు పడాల శ్రీనివాస్

యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గం నుంచి బీజేపీ శ్రేణులు మునుగోడు బహిరంగ సభకు భారీగా తరలివెళ్లారు. ఆదివారం యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మలరామారం, మోటకొండూర్ మండలాల నుంచి కార్యకర్తలు, జనాలు పెద్దసంఖ్యలో వెళ్లారు. తుర్కపల్లి మండలం నుంచి ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 200 వాహనాల్లో దాదాపు వెయ్యి మంది కార్యకర్తలు మునుగోడు బాటపట్టారు. తుర్కపల్లి మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వాహనాల శ్రేణిని పడాల శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు.

ఫారెస్ట్, ఎక్సైజ్​ శాఖలు సమన్వయంతో పని చేయాలి

యాదాద్రి, వెలుగు: ఈత, తాటి వనాలను పెంచడానికి అటవీ, ఎక్సైజ్​ డిపార్ట్​మెంట్లు సమన్వయంతో పనిచేయాలని పీసీసీఎఫ్​​మోహన్​చంద్ర వర్గేయన్​(ఐఎఫ్​ఎస్​) సూచించారు. ఆదివారం భువనగిరిలో ఎర్రంబెల్లి కాలువ గట్టుపై ఈత మొక్కలను నాటారు. ఈ సందర్బంగా ఈత, తాటి వనాలకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై అడిషనల్​కలెక్టర్​ దీపక్​ తివారి, ఎక్సైజ్​ఎస్పీ నవీన్​కుమార్​ను ఆయన ఆరా తీశారు. అనంతరం ఈత ప్లాంటేషన్​ను మోహన్​చంద్ర సందర్శించారు. వారి వెంట సర్పంచ్​గాదె యశోద, జడ్పీటీసీ బీరు మల్లయ్య, ఎంపీడీవో నరేందర్​రెడ్డి, ఎఫ్ఆర్​వో కిరణ్​కుమార్, ఇరిగేషన్​ఏఈ అంబిక ఉన్నారు.