భళా.. బొజ్జిగుప్ప అందాలు.. ఏరు టూరిజంలో అలరించనున్న అడవి పల్లె

భళా.. బొజ్జిగుప్ప అందాలు.. ఏరు టూరిజంలో అలరించనున్న అడవి పల్లె

భద్రాచలం, వెలుగు : సీక్రేట్ విలేజ్​ మీ కోసం ఎదురుచూస్తోంది’ అంటూ ఏరు టూరిజం పేరిట భద్రాద్రికొత్తగూడెం జిల్లా ప్రచారం చేస్తున్న బొజ్జిగుప్ప అందాలు భళా అనిపిస్తున్నాయి. భద్రాచలం మన్యానికి గుండెకాయ లాంటి ఈ గ్రామాన్ని సందర్శించి చక్కని అనుభూతులు తమ వెంట తీసుకెళ్లండంటూ ఆదివాసీ సమాజం ఆహ్వానిస్తోంది. భద్రాచలం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఈ అందాల అడివి పల్లె ఉంది.

ఈనెల 6 నుంచి భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఏరు పేరిట టూరిజం ప్రోగ్రాం ప్రారంభిస్తోంది. ఇందులో ప్రధానమైన టూరిజం స్పాట్​ దుమ్ముగూడెం మండలంలోని బొజ్జిగుప్ప ఆదివాసీ గ్రామం. ఈ గ్రామ అందచందాలు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకోనున్నాయి.

ఆప్యాయంగా పలకరింపులు

బొజ్జిగుప్పను సందర్శించే పర్యాటకులను ఆదివాసీలు రేలా నృత్యాలతో స్వాగతిస్తూ ఆప్యాయంగా పలకరించి తీసుకెళ్తారు. గ్రామంలోని తమ పూరి గుడిసె అందాలను వారికి చూపిస్తారు.  ఇంటికి వచ్చిన అతిథికి తమ వంటకాలతో మర్యాదలు  చేస్తారు. అడవిలో దొరికే ఆకుకూరలు, కూరగాయలతో వండి ప్రేమతో అన్నం వడ్డిస్తారు. ఫలాలను పంచుతారు. 

పర్యాటకులకు మరిచిపోని అనుభూతి.. 

పర్యాటకులు ఊరి చెరువుకు వెళ్లి అక్కడ పడవలో తిరుగుతూ కలువ పూలను చూస్తూ ఆనందిస్తారు.  

గ్రామంలోని మేకపిల్లలు, ఆవు దూడలతో టూరిస్టులు ఆడి సేదతీరనున్నారు. 

పొలాల్లో ఉండే మంచెలపైకి ఎక్కి ఆనంద పరవశులవుతారు. 

గ్రామంలో ఏర్పాటు చేసిన ఆర్చరీ పాయింట్​కు చేరుకుని విల్లంబులతో గురిచూసి కొడతారు. 

గ్రామంలోని ఆదివాసీ పిల్లలు, పెద్దలతో వారి సంప్రదాయ దుస్తులు, అలంకరణలతో మమేకమవుతారు. 

సాయంసంధ్య వేళ ఆదివాసీ పల్లె ప్రకృతి సోయగాలు ఆస్వాదిస్తూ రీఫ్రెష్​ అవుతారు. 

పట్నంలో నిత్యం అనేక ఒత్తిళ్లతో సతమతమయ్యే టూరిస్టులు ఆదివాసీ పల్లెను విజిట్​ చేసి ఆనందాలను తమ వెంట మూటగట్టుకుని పోతారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ఆత్మబంధువులకు సంప్రదాయ సపర్యలు

గ్రామానికి వచ్చే టూరిస్టులకు ఆత్మబంధువులుగా సంప్రదాయ సపర్యలు ఉంటాయి. గ్రామస్తులే గైడ్​గా వ్యవహరిస్తారు. ఆచార, వ్యవహారాలు వివరిస్తారు. పంట పొలాలు, అడవుల్లో దొరికే ఆకు కూరలు, కూరగాయలు, పండించే పంటల గురించి తెలియజేస్తారు.  ఔషధ గుణాలతో కూడిన వంటకాలను వారికి వడ్డిస్తారు. పశుసంపద వాటితో తమకు ఉండే అనుబంధం గురించి టూరిస్టులకు చక్కగా చెప్పి వారిని మెప్పిస్తారు. బి.రాహుల్, ఐటీడీఏ పీవో