హైదరాబాద్ రోడ్లను.. ఎవరికి కావాలంటే వాళ్లు తవ్వేసుకుంటున్నారు

హైదరాబాద్ రోడ్లను.. ఎవరికి కావాలంటే వాళ్లు తవ్వేసుకుంటున్నారు
  • ఏజెన్సీ రోడ్లపై పనులా..అయితే వద్దులే..!
  • ఫండ్స్ లేక బల్దియా, వాటర్ బోర్డు పనులు పెండింగ్
  • రోడ్ల తవ్వకాలపై పర్మిషన్లకు ఏజెన్సీల  షరతులు
  • కొత్తగా రోడ్లను వేయాలంటే ఎక్కువ ఖర్చు 
  • అధికారులకు తెలియకుండానే కాంట్రాక్టర్లు  వర్క్స్  
  • తవ్విన రోడ్లతో స్థానికులకు తప్పని ఇబ్బందులు

 

హైదరాబాద్​, వెలుగు: 
సిటీలో  కాంప్రెహెన్సీవ్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం(సీఆర్ఎంపీ) కింద ఏజెన్సీలకు అప్పగించిన 709 కిలోమీటర్ల మెయిన్ రోడ్లపై అధికారులు ఇతర పనులు చేయలేకపోతున్నారు. వాటర్, డ్రైనేజీ పనుల కోసం రోడ్లు తవ్వితే తిరిగి వాటిపై కొత్తగా వేసేందుకు ఖర్చు ఎక్కువ అవుతుండగా వాటర్ బోర్డు, బల్దియా అధికారులు వెనక్కి తగ్గుతున్నారు. ఇప్పటికే ఫండ్స్ లేక బల్దియా, వాటర్ బోర్డు కొట్టుమిట్టాడుతున్నాయి. ఇక రోడ్లపై ఎక్కువ ఖర్చు చేయడమెందుకని అధికారులు పదుల సంఖ్యలో పనులను నిలిపివేశారు. తవ్విన రోడ్లను తిరిగి నిర్మిస్తామని అగ్రిమెంట్ చేసుకునే రోడ్లకే ఏజెన్సీలు అనుమతులు ఇస్తున్నాయి. దీంతో ప్రధానంగా వాటర్ బోర్డుతో పాటు పలు కేబుళ్ల వర్క్స్ చేసేందుకు ముందుకు రావడంలేదు. కొన్నిచోట్ల ఏజెన్సీలకే తెలియకుండా రాత్రికిరాత్రే పనులు చేస్తున్నప్పటికీ పెద్ద పనులకు మాత్రం అగ్రిమెంట్ అయ్యేవరకు ఏజెన్సీలు రోడ్లపై పనులు చేయనివ్వడంలేదు. కోర్ సిటీలో జలమండలికి సంబంధించి వాటర్, డ్రైనేజీ లైన్ల కోసం రోడ్లను తవ్వేందుకు ఇటీవల ఏజెన్సీలను సంప్రదిస్తే పలు షరతులు పెడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఖర్చు ఎక్కువవుతుందని కూడా పనులు చేయడంలేదని పేర్కొంటున్నారు. 

ఏజెన్సీలు షరతులు పెడుతుండగా..

గ్రేటర్ లోని ఆరుజోన్లలో సీఆర్ఎంసీ ఏజెన్సీలకు రోడ్లను మెయింటెనెన్స్ కోసం అప్పగించారు. ఇందులో ఎల్​బీనగర్ జోన్ లోని కాప్రా,ఉప్పల్, హయత్​ నగర్, ఎల్​బీనగర్, సరూర్ నగర్ సర్కిళ్లలో బీఎస్ పీఎల్​ ఇన్​ఫ్రాస్ర్టక్చర్ లిమిటెడ్, చార్మినార్ జోన్ లోని మలక్​పేట్, సంతోశ్ నగర్​, చాంద్రాయణగుట్ట,చార్మినార్, ఫలక్​నుమా, రాజేంద్రనగర్ సర్కిళ్లలో  ఎం. వెంకటరావు ఇన్ ​ప్రాజెక్ట్స్  ప్రైవేట్​ లిమిటెడ్, సికింద్రాబాద్​ జోన్​లోని బేగంపేట్, ముషీరాబాద్, అంబర్​పేట్, సికింద్రాబాద్,​ మల్కాజిగిరి సర్కిళ్లలతో పాటు ఖైరతాబాద్​ జోన్ లోని మెహిదీపట్నం, కార్వాన్,​ గోషామహల్​ సర్కిళ్లలో  కేఎన్ఆర్ కన్ స్ర్టక్షన్స్​లిమిటెడ్, ఇదే జోన్​లోని ఖైరతాబాద్​, జూబ్లీహిల్స్ సర్కిళ్లలతో పాటు కూకట్​పల్లి జోన్ లోని గాజులరామారం, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, అల్వాల్, మూసాపేట్ సర్కిళ్లలో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్​ఫ్రాస్ర్టక్చర్ లిమిటెడ్, శేరిలింగంపల్లి జోన్ లోని యూసుఫ్ గూడ, శేరిలింగంపల్లి, చందానగర్, ఆర్సీపురం, పఠాన్​ చెరువు సర్కిళ్లలో ఎన్​సీసీ లిమిటెడ్​ కంపెనీలు సీఆర్ఎంపీ రోడ్ల నిర్వహణ బాధ్యతలను 2020లో  చేపట్టాయి.  మొదట్లో సీఆర్ఎంపీ రోడ్లపై గుంత బాగానే పడేవి. తీవ్ర విమర్శలు రావడంతో అధికారులు సీరియస్ అయ్యారు. రోడ్లపై పడిన గుంతలకు మూడు రోజుల్లోగా మరమ్మతులు చేయకుండా ఉంటే సిబ్బంది జీతాల్లో కోత విధిస్తామని గతంలోనే కమిషనర్ హెచ్చరించారు. అంతేకాకుండా మరమ్మతులు చూడాల్సిన బాధ్యత ఈఈ, ఎస్ఈ, జడ్సీ లదే నని, బాధ్యతలను విస్మరిస్తే పెనాల్టీ విధిస్తామని స్పష్టంచేశారు. ఏజెన్సీలు కూడా వార్నింగ్ ఇవ్వడంతో అప్పటి నుంచి రోడ్లపై గుంతలు లేకుండా మెయింటెన్ చేస్తున్నాయి. ఎవరైనా తవ్వాలన్న కూడా తిరిగి రోడ్లు నిర్మించాలనే కండీషన్స్ పెడుతున్నాయి. 

  అధికారులు మారాలే..

 ఏవైనా పనులకు రోడ్లను తవ్వాలనుకుంటే ముందుగా అన్ని డిపార్టుమెంట్ల నుంచి ఎన్​వోసీలు తీసుకోవాల్సి ఉంది. ఆ తర్వాత తిరిగి రోడ్లను వేసే బాధ్యత కూడా సంబంధిత కాంట్రాక్టర్ దే.  ఒకవేళ రోడ్లు వేయకపోతే బిల్లులను ఆపేసే అధికారం కూడా డిపార్ట్ మెంట్ కు ఉంది. అయితే.. దీనిపై అధికారులు నిర్లక్ష్యంగా ఉంటుండగా కాంట్రాక్టర్లు చివరలో రోడ్లు వేయడంలేదు.  కొన్నిచోట్ల రాత్రికి రాత్రే పనులు పూర్తి చేసి అలాగే వదిలేస్తున్నారు. ఇలా సగానికిపైగా పనులకు ఎన్​వోసీలు తీసుకోవడంలేదు. దీంతో గుంతలు పడిన రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల నెలలు గడుస్తున్నా కూడా ఎవరు పట్టించుకోవడంలేదు. కనీసం తమ పరిధిలో రోడ్లను తవ్వుతున్నారనేది కూడా సంబంధిత బల్దియా ఏఈలకు తెలియడంలేదు. వీరిపై చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు కూడా పెద్దగా పట్టించుకోకపోతుండటంతో రోడ్ల సమస్యలు కామన్ గా మారాయి. ఏజెన్సీలను చూసైనా అధికారులు మారితే అంతర్గత రోడ్లపై కూడా గుంతలు లేకుండా ఉండే అవకాశం ఉంది.