- రూ.లక్ష మాఫీ కావాల్సిన రైతులు 20 లక్షలున్నరు
- రుణమాఫీకి మొత్తం రూ.19 వేల కోట్లు కావాలె
- ఇప్పటివరకు రూ.7,753 కోట్లు రిలీజ్.. ఇంకా రూ.12 వేల కోట్లు అవసరం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 20 లక్షల మంది రైతులు రుణమాఫీకి ఒక్క రూపాయి దూరంలో ఉన్నారు. రూ.లక్ష వరకు పంటరుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటివరకూ రూ. 99,999 వరకు ఉన్న రుణాల మాఫీకి నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 36.68 లక్షల మంది రైతులకు చెందిన రూ.19,198.38 కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకూ16.66 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.7,753.43 కోట్ల రుణాల మాఫీ కోసం నిధులు విడుదలయ్యాయి. లక్ష వరకూ రుణమాఫీ కావాల్సిన వాళ్లే 20.02 లక్షల మంది ఉన్నారు. ఇప్పటిదాకా రూ. 99,999 వరకు ఉన్న రుణాల మాఫీకే నిధులు విడుదల కావడంతో వీరంతా ఇప్పుడు రుణమాఫీకి ఒక్క రూపాయి దూరంలో నిలిచారు. ఈ 20 లక్షల మందికి రుణమాఫీ కోసం రూ.11,445.95 కోట్లు అంటే.. దాదాపుగా రూ.12 వేల కోట్లను ప్రభుత్వం ఇంకా రిలీజ్ చేయాల్సి ఉంది.
36.68 లక్షల మంది అర్హులు
రూ.లక్ష రుణమాఫీకి 2018 డిసెంబర్ 11ను కటాఫ్ తేదీగా సర్కారు నిర్ణయించింది. ఆ తేదీ నాటికి రాష్ట్రంలో 40.66 లక్షల మంది రైతులకు చెందిన లోన్లు మొత్తం రూ.25,936 కోట్లు ఉన్నట్లు బ్యాంకులు తేల్చాయి. రైతులు, వారి కుటుంబసభ్యులకు కలిపి రూ.లక్ష వరకు మాఫీ చేస్తామని ప్రభుత్వం రెండేండ్ల కింద నిబంధన తెచ్చింది. టర్మ్ రుణాలు, ఇతరాత్ర 3.98 లక్షల మంది రైతులు అనర్హులుగా తేలారు. దీంతో రాష్ట్రంలో మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు చెందిన రూ.19,198.38 కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉందని వ్యవసాయ శాఖ తేల్చింది. వీరిలో ఇప్పటివరకు 16.66 లక్షల మందికి మాఫీ కాగా, ఇంకా 20.02 లక్షల మందికి మాఫీ జరగాల్సి ఉంది. ఎన్‌ఐసీ పోర్టల్ ద్వారా నేరుగా రైతుల అకౌంట్‌లో వేసిన డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్‌ఫర్(డీబీటీ) డెబిట్ కాకుండా వేసినవి వేసినట్లే రిటర్న్ అవుతున్నాయి. దీనిపై రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించి అకౌంట్ల సమస్యను పరిష్కరించాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు.