- ధర్నా చౌక్ లో బీఈడీ అభ్యర్థుల ధర్నా
ముషీరాబాద్, వెలుగు: స్కూల్ అసిస్టెంట్పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా బీఈడీ అభ్యర్థులతో భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఎస్జీటీలకు ఇచ్చే 70 శాతం ప్రమోషన్స్ ను పూర్తిగా తొలగించాలని కోరారు. బీఈడీ అభ్యర్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్చేస్తూ తెలంగాణ రాష్ట్ర బీఈడీ నిరుద్యోగ అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో ధర్నా చేపట్టారు. కృష్ణయ్య మాట్లాడుతూ 12 సంవత్సరాలుగా 3 లక్షల మంది టీచర్ ఉద్యోగం కోసం వేచి చూస్తున్నారన్నారు. ఒకరికి ఒకలాగా, మరొకరికి ఇంకోలా న్యాయమంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూక్య కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.