
- మరో వంద బెడ్ల ప్రపోజల్స్‌ను పట్టని ప్రభుత్వం
- ఏడాదిన్నర నుంచి అదనపు బెడ్ల కోసం ఎదురిచూపులు
హనుమకొండ, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గవర్నమెంట్ ఆస్పత్రుల్లో డెలివరీలు పెంచాలని ప్రచారం చేస్తున్నారు కానీ, ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పించడంపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఉమ్మడి వరంగల్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి హనుమకొండలోని జీఎంహెచ్, వరంగల్ సీకేఎం హాస్పిటల్ కు రోజూ వందల మంది గర్భిణులు వస్తున్నారు. కానీ, అడ్మిట్ అవ్వాలంటే బెడ్లు దొరకడం లేదు.
రెండు ఆస్పత్రుల్లో చాలని బెడ్లు..
ఈ రెండు హాస్పిటల్స్ లో వంద చొప్పున బెడ్లు ఉన్నాయి. రోజుకు సుమారు 25 మంది గర్భిణులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీంతో సరిపడా బెడ్లు లేక తాత్కాలికంగా డాక్టర్లు బెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇబ్బందిగా మారడంతో బెడ్ల సంఖ్య పెంచాలని గత ఏడాది కాలంగా డాక్టర్లు ఉన్నతాధికారులకు ప్రపోజల్స్ పెడుతున్నారు. కానీ ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. దీంతో ప్రసవం కోసం వచ్చిన గర్భిణులు బెడ్ల కోసం తల్లడిల్లాల్సి వస్తోంది.
ఫుల్ రష్
పీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో టార్గెట్ కు మించి సాధారణ ప్రసవాలు చేస్తే.. ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు అందిస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు గతేడాది ప్రకటించారు. మరోవైపు పీహెచ్‌సీల్లో సరిపడా డాక్టర్లు, ఎక్విప్మెంట్ లేకపోవడంతో పాటు అత్యవసరమైతే సిజేరియన్ చేయడానికి వీలు లేకపోవడం వల్ల ఉమ్మడి వరంగల్ తో పాటు, ఇతర జిల్లాల నుంచి నిత్యం గర్భిణులు వరంగల్ కు వస్తున్నారు.
ఉర్సు గుట్ట దవాఖాన ఓపీ సేవలకే..
సీకేఎం ఆసుపత్రిపై భారం తగ్గించేందుకు, దానికి అనుబంధంగా ఉర్సు లో 30 బెడ్ల సామర్థ్యంతో హాస్పిటల్ ఉంది. దానికి ఆరుగురు మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, ఇతర 25 పోస్టుల్లో సిబ్బంది ఉండాలి. కానీ, అందులో ఇద్దరు డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఏఎన్ఎం పోస్టులను మాత్రమే ప్రభుత్వం భర్తీ చేసింది. ప్రసూతి సేవలకు సరిపడా స్టాఫ్ లేక అక్కడ డెలివరీలు ఆగిపోయాయి. అక్కడి స్టాఫ్ కూడా డిప్యూటేషన్ పై సీకేఎంలోనే డ్యూటీ చేస్తున్నారు. ఫలితంగా ఉర్సు దవాఖాన కేవలం ఓపీ సేవలకే పరిమితమైంది. వరంగల్ ఎంజీఎంలో 250 బెడ్ల సామర్థ్యంతో ఎంసీహెచ్ బిల్డింగ్ ఏర్పాటు చేయగా.. కొవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి దానిని కరోనా వార్డుగానే వాడుతున్నారు.
హెల్త్ సిటీ పైనే ఫోకస్
ఇటీవల వరంగల్ సెంట్రల్ జైల్ స్థలంలో 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్(హైల్త్ సిటీ) నిర్మిస్తుండగా.. మంత్రులు, లోకల్ లీడర్లంతా దానిపైనే ఫోకస్ పెట్టారు. ఎంజీఎం సహా, జీఎంహెచ్, సీకేఎం ఆసుపత్రులను పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. అయితే గర్భిణులు, బాలింతల కోసం ఎంజీఎంను పూర్తిస్థాయి ఎంసీహెచ్ వింగ్‌గా డెవలప్ చేస్తారన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ దానిపై ఇంతవరకు అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. స్థానిక లీడర్లైనా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గర్భిణుల, బాలింతల అవస్థలు తీర్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.