ప్రిన్సిపాల్ వద్దంటూ .. 20 కిలోమీటర్లు పాదయాత్ర

ప్రిన్సిపాల్ వద్దంటూ .. 20 కిలోమీటర్లు పాదయాత్ర
  • గద్వాల కలెక్టరేట్కు వెళ్లి.. ముట్టడించిన బీచ్ పల్లి గురుకుల స్కూల్ విద్యార్థులు
  • ప్రిన్సిపాల్ పనిష్ మెంట్ భరించలేకపోతున్నామంటూ ఆవేదన
  • స్కూల్లో అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ తీవ్ర ఆరోపణలు

గద్వాల, వెలుగు: వేధింపులకు, అక్రమాలకు పాల్పడుతున్న ప్రిన్సిపాల్ వద్దంటూ.. వెంటనే సస్పెండ్ చేయాలని టెన్త్, ఇంటర్ గురుకుల స్కూల్ విద్యార్థులు రోడ్డెక్కారు. దాదాపు 20 కిలోమీటర్ల పాదయాత్రగా వెళ్లి కలెక్టరేట్ ను ముట్టడించారు. అక్కడ బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు.

జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచుపల్లి గురుకుల స్కూల్ కు చెందిన పలువురు స్టూడెంట్స్ మాట్లాడుతూ.. స్కూల్ లో ప్రతి చిన్న విషయానికి ప్రిన్సిపల్ శ్రీనివాస్ నాయక్ వేధింపులకు గురి చేస్తున్నాడని, పనిష్ మెంట్ కింద చాలామందికి టీసీలు ఇచ్చాడని పంపించాడని,  కొత్త వాళ్ల వద్ద డబ్బులు తీసుకొని అడ్మిషన్ ఇస్తున్నారని ఆరోపించారు. ఇందుకు ఎర్రవల్లికి చెందిన ఒక మాజీ సర్పంచ్ పాత్ర కీలకంగా ఉందని పేర్కొన్నారు. స్కూల్ లో నాణ్యతలేని సామాన్లను అమర్చి అవి విరిగిపోతే స్టూడెంట్లపై మోపి డబ్బులు కట్టించుకుంటున్నాడని వాపోయారు. స్కూల్లోని చెట్లను కూడా నరికి, ఇన్వర్టర్లు, ఇతర సామగ్రి అమ్ముకున్నాడని ఆరోపించారు.

కలెక్టర్ బస చేసినప్పుడు సమస్యలు ఫుడ్ క్వాలిటీ గురించి చెబితే,  ఆ తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ ప్రిన్సిపల్, వార్డెన్ హెచ్చరించారని వాపోయారు. బీచుపల్లి గురుకుల స్కూల్  అంటే స్టేట్ లో నెంబర్ వన్ అని.. ప్రిన్సిపల్ అక్రమాలతో దిగజారిపోయిందని ఆవేదనతో చెప్పారు. ప్రిన్సిపల్ పెట్టే ఇబ్బందులను భరించలేక కలెక్టరేట్ కు రావాల్సి వచ్చిందని తెలిపారు.

ప్రిన్సిపల్ సస్పెండ్ చేసే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. అనంతరం కలెక్టర్ చాంబర్ లో స్టూడెంట్ ప్రతినిధులతో కలెక్టర్ చర్చలు జరిపారు. గద్వాల నుంచి కారులో ఎర్రవల్లి వైపు వెళ్తున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్టూడెంట్లు పాదయాత్రను చూసి దిగివచ్చి మద్దతు తెలిపారు.  స్టూడెంట్లను సమస్యలు అడిగి తెలుసుకుని వెంటనే కలెక్టర్ కు ఫోన్ లో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని సూచించారు.