బీర్ల లారీని ఢీ కొట్టిన ఉల్లిగడ్డల లారీ .. క్యాబిన్​లో ఇరుక్కుని డ్రైవర్ ​మృతి

  • 40 బీర్ల కాటన్లు, 25 శాతం ఉల్లిగడ్డలను లూటీ చేసిన  వాహనదారులు
  • విజయవాడ జాతీయ రహదారిపై  5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

చౌటుప్పల్, వెలుగు : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ లక్కారం వద్ద  తంగేడువనం ఎదురుగా జాతీయ రహదారిపై బీర్ల లోడ్ తో వెళ్తున్న లారీని వెనక నుంచి ఉల్లిగడ్డ లోడ్ తో వస్తున్న మరో లారీ ఢీకొట్టింది. దీంతో ఉల్లిగడ్డల లారీ డ్రైవర్​క్యాబిన్ లో ఇరుక్కుని చనిపోయాడు. అయితే, ఈ టైంలో అటుగా వెళ్తున్న కొందరు వాహనదారులు సాయం చేయాల్సింది పోయి దొరికినన్ని బీర్ల కాటన్లు, ఉల్లిగడ్డల బస్తాలతో ఉడాయించారు. హైదరాబాద్​నుంచి బడ్ వైజర్ మాగ్నమ్​బీర్ల కాటన్లతో ఖమ్మం గోదాముకు లారీ బయలుదేరింది.

సంగారెడ్డి నుంచి భద్రాచలం ఉల్లిగడ్డ లోడ్ తో మరో లారీ వెనకే వస్తోంది. చౌటుప్పల్ లోని లక్కారం వద్దకు రాగానే నిద్రమత్తులో ఉన్న డ్రైవర్​అతివేగంతో బీర్ల లారీని వెనక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఉల్లిగడ్డ లారీ డ్రైవర్ అయిన మహారాష్ట్రకు చెందిన బొలుసారి అజయ్ (35) క్యాబిన్​లో ఇరుక్కుపోయి చనిపోయాడు. తెల్లవారుజామున 5  గంటలకు ఈ ప్రమాదం జరగ్గా పోలీసులు వచ్చేలోపు జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనదారులు దొరికిన వాళ్లు దొరికినట్టు బీర్ల కాటన్లు, ఉల్లిగడ్డ సంచులను తమ వెహికిల్స్​లో తరలించారు.

సుమారు 70 లక్షల ధర కలిగిన బీర్ల కాటన్లలో 40 కాటన్లను ఎత్తుకుపోయారు. అలాగే ఉల్లిగడ్డల లారీలో 25 శాతం ఖాళీ చేశారు. రెండు పెద్ద వాహనాలు జాతీయ రహదారిపై ఉండడంతో  సుమారు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. క్యాబిన్ లో డ్రైవర్​ఇరుక్కోగా పోలీసులు జేసీబీతో క్యాబిన్ ను ఊడదీసి డెడ్​బాడీని బయటకు తీశారు. లారీలోని ఉల్లిగడ్డలను జేసీబీతో పక్కకు పోయించగా అప్పుడు కూడా జనాలు కావాల్సినన్ని పట్టుకుపోయారు. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి పోలీసులకు మూడున్నర గంటలు పట్టింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.