తెలంగాణలో భారీగా పెరిగిన బీర్ల ధరలు

తెలంగాణలో భారీగా పెరిగిన బీర్ల ధరలు
  • లైట్ బీరు రూ.150 నుంచి రూ.180కి
  • పెరిగిన రేట్లు నేటి నుంచే అమల్లోకి 
  • ఉత్తర్వులు జారీ

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో  బీర్ల ధరలను ప్రభుత్వం 15 శాతం పెంచింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. రిటైర్డ్  జడ్జి జైస్వాల్  నేతృత్వంలోని లిక్కర్​  ధరల నిర్ణయ త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా ఎక్సైజ్  శాఖ ధరల పెంపు ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు ఇచ్చింది. పాత స్టాక్​ ఉంటే.. వాటిపై ఎమ్మార్పీ లేబుల్స్​ను కూడా మార్చాలని ఉత్తర్వుల్లో  పేర్కొన్నారు. 

15 శాతంగా లెక్కిస్తే  ఒక్క బీరు ధర రూ.150 ఉంటే  వ్యాట్​, ఎక్సైజ్​ సుంకంతో కలిపి రూ.180 దాకా పెరగనుంది. ఎక్కువ రేట్లు ఉన్న బీర్లు.. మరింత పెరగనున్నాయి. ఇప్పుడు రానున్నది వేసవికాలం కావడంతో బీర్ల సేల్స్  మరింత పెరగనున్నాయి. దీనికి తోడు ఐపీఎల్​ కూడా రానుంది. దీంతో ఖజానాకు మరింత ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. వాస్తవానికి రాష్ట్రంలో మద్యం ధరలు పెంచొద్దని ముందుగా నిర్ణయం తీసుకున్నప్పటికీ.. పక్క రాష్ట్రాల్లో ధరలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. 

రాష్ట్రంలో మద్యం ధరలను  ప్రధానంగా బీర్ల ధరలు పెంచాలని లిక్కర్  కంపెనీలు గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్​  చేస్తున్నాయి. రాష్ట్ర మద్యం మార్కెట్‌‌లో దాదాపు 60 శాతం వాటా ఉన్న మల్టీనేషనల్‌‌  బీర్ల కంపెనీ తమకు ప్రస్తుతం చెల్లిస్తున్న బేసిక్‌‌  ధర మీద కనీసం 30.1 శాతం అదనపు ధర చెల్లించాలని కోట్‌‌  చేసింది. ఈ కంపెనీ డిమాండ్‌‌నే మిగితా  కంపెనీలూ అనుసరించాయి. ఈ నేపథ్యంలోనే త్రిసభ్య కమిటీ కూడా ధరలను  15 నుంచి 19 శాతం పెంచేందుకు నివేదిక ఇవ్వగా.. 

15 శాతం బీర్‌‌  బేసిక్‌‌  ధర పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఒక్క బీర్ల కేస్  మీద 15 శాతం బేసిక్‌‌  ధర పెంచితే, దానికి కనీసం రూ. 250 నుంచి రూ. 280 వరకు వ్యాట్‌‌, ఎక్సైజ్‌‌  సుంకంతో పాటు వివిధ రకాల పన్నులు జత కలుస్తాయి. దీంతో రూ.150 ఉన్న లైట్‌‌ బీరు రూ.180 వరకు, రూ.160 ధర ఉన్న స్ట్రాంగ్‌‌ బీరు ధర రూ.200 వరకు పెరుగుతుంది.  

ఇక ప్రతినెలా రూ.300 కోట్ల వరకు అదనంగా ఆదాయం

ఈ ఆర్థిక సంవత్సరం (2024–25) లో మద్యం అమ్మకాల వ్యాట్, ఎక్సైజ్  డ్యూటీల రూపంలో రూ.36 వేల కోట్ల ఆదాయం వస్తుందని రేవంత్  సర్కారు అంచనా వేసింది. ఏప్రిల్‌‌,‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ -సెప్టెంబర్ వరకు ఎక్సైజ్ శాఖకు ఎక్సైజ్‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్యూటీ ద్వారా రూ.9,493 కోట్లు, వ్యాట్‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా రూ.8,040 కోట్ల ఆదాయం సమకూరిందని అధికారులు వెల్లడించారు. అంటే తొలి 6 నెలల్లో రూ.17,533 కోట్ల రాబడి మాత్రమే వచ్చింది. అయితే, ఆ తర్వాత పండుగలు, డిసెంబరులో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో ఆదాయం పెరిగింది. ప్రస్తుతం మద్యంపై కొంత ఆదాయం తగ్గిన నేపథ్యంలో పెరిగిన ధరలతో కొంత ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని సర్కారు భావిస్తోంది. 

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు, బార్లు‌‌‌‌‌‌, క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, పబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ద్వారా ద్వారా రోజుకు సరాసరిగా రూ.90 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. నెలకు సగటున రూ.2,700 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల  వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు ఎక్సైజ్  అధికారులు వెల్లడించారు. ఇక బీర్ల రేట్లు పెరగడంతో ప్రతినెలా దాదాపు రూ.300 కోట్ల వరకు అదనంగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.