బీర్లకు మస్త్ డిమాండ్.. రోజుకు 3 లక్షల కేస్‎లు తాగేస్తుర్రు

 బీర్లకు మస్త్ డిమాండ్.. రోజుకు 3 లక్షల కేస్‎లు తాగేస్తుర్రు

హైదరాబాద్, వెలుగు: ఎండకాలం, పెండ్లిళ్ల సీజన్, ఐపీఎల్ మ్యాచ్‌‌‌‌ల ప్రభావంతో రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి.  రాష్ట్రవ్యాప్తంగా రోజుకు దాదాపు 3 లక్షల బీర్ కేస్‌‌‌‌లు అమ్ముడవుతున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే ఇది రెట్టింపు స్థాయిలో ఉందని వ్యాపార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. 

ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతుండటంతో చల్లని పానీయాలకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా యువత బీర్లు ఎక్కువగా సేవిస్తున్నారు.  ఇక, ప్రస్తుతం రాష్ట్రంలో పెండిండ్ల సీజన్ జోరుగా సాగుతోంది. వివాహ వేడుకలు, రిసెప్షన్ల తో బీర్ల వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ కారణంగా బీర్ సరఫరా సంస్థలు డిమాండ్‌‌‌‌ను తీర్చడానికి ఉత్పత్తిని పెంచినట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌‌‌‌లు కూడా బీర్ అమ్మకాలకు ఊతమిస్తున్నాయి. బార్లు, పబ్‌‌‌‌లు, రెస్టారెంట్లలో గతంలో కంటే ఎక్కువ జనసమూహం కనిపిస్తోంది. బీర్ అమ్మకాల పెరుగుదలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ రూపంలో ఆదాయం కూడా పెరుగుతోంది. ఈ సీజన్‌‌‌‌లో ఎక్సైజ్ శాఖ ఆదాయ లక్ష్యాలను సులభంగా చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ రెండు నెలల్లో కోటిన్నర కేస్​ల బీర్ల అమ్మకమే టార్గెట్

ఈ ఏడాది లిక్కర్‎తో పాటు బీర్ కేస్‎లను మరింతగా పెంచాలని ఎక్సైజ్ శాఖ టార్గెట్‎గా పెట్టుకున్నది. గతేడాది కంటే కోటిన్నర కేసుల బీర్లు ఎక్కువగా అమ్మాలని అనుకుంటున్నది. పోయిన ఆర్థిక సంవత్సరంలో దాదాపు 5.48 కోట్ల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. ఈసారి ఐఎంఎల్ లిక్కర్ కేస్​లు కూడా 4 కోట్ల కేస్​లకు పెంచాలని ప్లాన్ చేశారు. 

కానీ, బీర్ల సేల్స్​కు ఏప్రిల్, మే నెలలే కీలకం కావడంతో వాటి అమ్మకంపైనే ఎక్సైజ్ శాఖ ప్రధానంగా దృష్టి పెట్టింది. రోజుకు యావరేజ్‎గా 3 లక్షలకు పైగా కేసుల బీర్లు అమ్మాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఐపీఎల్ మొదలైన మార్చి 22వ  రోజు ఏకంగా దాదాపు నాలుగు లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. 

ఆ తరువాత  కూడా ప్రతి రోజు యావరేజ్‎గా మూడు లక్షల కేస్ లకు దగ్గరలో బీర్లు అమ్మినట్లు ఎక్సైజ్ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఏదైనా సెలవు కారణంగా మద్యం డిపోల నుంచి లిక్కర్, బీర్ లిఫ్ట్ చేయకపోతే.. ఆ తరువాతి రోజు రెట్టింపు స్థాయిలో కేస్​లు లిఫ్ట్ చేయాలని ఆదేశాలు ఉన్నాయి. ఇలా ఈ రెండు నెలల్లో కోటిన్నర కేస్​ల బీర్లు అమ్ముడుపోయేలా చేయాలని చూస్తున్నారు.