
- వేసవి దృష్ట్యా ఉత్పత్తిని పెంచిన కంపెనీలు
- డిమాండ్‌కు తగ్గట్టు సప్లయ్ చేసేందుకు ఏర్పాట్లు
- నాలుగు కంపనీల్లో మూడు షిఫ్టులలో తయారీ
- ఎండాకాలంలో ఎక్సైజ్‌శాఖకు భారీగా ఆదాయం
హైదరాబాద్, వెలుగు: ఎండాకాలం ఎంటరై.. రోజురోజుకు ఎండలు పెరుగుతుండడంతో మద్యంప్రియులు కూల్‌బీర్ల వైపు చూస్తున్నారు. దీంతో గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. అయితే, డిమాండ్‌కు తగ్గట్టుగా సప్లయ్ చేసేందుకు బీర్ల తయారీ కంపనీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
రాష్ట్రంలో ఎక్కువ శాతం బీర్లు తయారు చేసే అతిపెద్ద బీర్ల తయారీ కంపెనీ అయిన యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్(యూబీఎల్) సహా మరో మూడు కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తులను పెంచాయి. రోజుకు సగటున 1.5 లక్షల నుంచి 2 లక్షల కాటన్ల బీర్లను డిపోలకు సప్లయ్ చేసే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
ఇందుకు సంబంధించి మూడు షిఫ్టుల్లో బీర్లను ఉత్పత్తి చేసేందుకు రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ నుంచి అనుమతి తీసుకున్నాయి. సంబంధిత రుసుములు కూడా చెల్లించాయి. సాధారణ రోజుల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో మాత్రమే బీర్లను తయారీ చేస్తుంటారు. ప్రస్తుతం డిమాండ్ పెరగడంలో మూడు షిఫ్టుల్లో ఆపరేషన్స్ నిర్వహించనున్నారు.
13 కంపనీల్లో బీర్ల తయారీ..
రాష్ట్రంలో యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ సహా మొత్తం 13 కంపెనీలు బీర్లను తయారు చేస్తున్నాయి. వీటిలో కింగ్‌ఫిషర్ సహా వివిధ బ్రాండ్లకు చెందిన బీర్లు సప్లయ్ అవుతున్నాయి. ఇలా ఆయా కంపెనీల నుంచి ప్రతి రోజు సగటున లక్ష నుంచి లక్ష న్నర కాటన్ల బీర్లు 19 డిపోలకు చేరుతున్నాయి.
సాధారణ రోజుల్లో కంపెనీలు రెండు షిఫ్టుల్లోనే బీర్లను తయారు చేస్తుంటాయి. ప్రస్తుతం 3 షిఫ్టుల్లో ఉత్పత్తి చేసేందుకు ప్లాన్ చేసుకున్నాయి. సేల్స్ కు తగ్గట్టుగా ఉత్పత్తులు పెంచేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి. ఇలా ఈ వేసవిలో ఒక్కో కంపెనీ ప్రతి రోజు 2 లక్షలకు పైగా బీర్లను తయారు చేసేందుకు సిద్ధమయ్యాయి. దీంతో రాష్ట్ర ఎక్సైజ్‌శాఖకు ఈ సమ్మర్‌లో భారీగా ఆదాయం సమకూరనుంది.