కేటీఆర్​వి మతిలేని మాటలు

కేటీఆర్​వి మతిలేని మాటలు
  • సీఎంని విమర్శిస్తే ఊరుకోం: బీర్ల అయిలయ్య

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను కేటీఆర్ విమర్శించడం సిగ్గు చేటని విప్ బీర్ల అయిలయ్య మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీలోని సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని సార్లయినా ఢిల్లీకి వెళ్తారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి హోం మంత్రుల సమావేశం కోసం, వరద సాయం విడుదల చేయాలని కేంద్రాన్ని కోరడానికి ఢిల్లీకి వెళ్లారని చెప్పారు.  కానీ, సీఎం రేవంత్ పై కేటీఆర్ మతిలేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిని ఇంకోసారి విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ ప్రజల సొమ్మును జీతంగా తీసుకుంటూ ఫామ్ హౌస్ లో పండుకున్నారని ఆరోపించారు. 

సీఎం రేవంత్ అందిస్తున్న ప్రజాపాలనను చూసి ఓర్వలేకనే కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందని.. ఆ పార్టీ సచ్చిపోయిందని పేర్కొన్నారు. తమ పార్టీ బతికి ఉందని చెప్పడం కోసమే ఈ విమర్శలని అన్నారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనపై తమ ప్రభుత్వ పది నెలల పాలనపై సిద్దిపేటలో హరీశ్ రావుతో చర్చకు సిద్ధమన్నారు. కేసీఆర్ మరో 25 ఏండ్ల పాటు సీఎం రేవంత్ రెడ్డి పాలనను చూడాలని కోరుకుంటున్నామని వివరించారు. రాహుల్ గాంధీని దేశ ప్రధాని చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ పని చేస్తున్నారని వెల్లడించారు. 2029లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమన్నారు.