మోత్కూరు, వెలుగు : వాన దేవుడు కరుణిస్తే తప్ప బిక్కేరు వాగులో నీళ్లు రావని, అలాంటిది ఈ వాగులో గోదావరి జలాలు పారించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. సోమవారం గుండాల మండలం బ్రాహ్మణపల్లి వద్ద బిక్కేరు వాగులో పారుతున్న గోదావరి జలాలకు రైతులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఒప్పించి బిక్కేరు వాగులోకి గోదావరి జలాలు రప్పించానని తెలిపారు. బిక్కేరులో గోదావరి జలాలు పారుతాయని ఎవరూ ఊహించలేదన్నారు. గోదావరి జలాలతో బిక్కేరు ప్రాంత రైతుల కాళ్లు కడిగే అవకాశం తనకు లభించిందన్నారు. ఆత్మకూరు(ఎం), గుండాల మండలాలతోపాటు మోత్కూరు వరకు బిక్కేరు వాగులో గోదావరి జలాలు పారిస్తామని
దీంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. గోదావరి జలాలతో ఇప్పటికే 50 చెరువులను నింపామని, మరో 50 చెరువులు నింపుతామన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాదగిరి, గుండాల అధ్యక్షుడు రాంరెడ్డి, మాజీ జడ్పీటీసీ నరేందర్ గుప్తా, తండ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.