యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి జిల్లాలో గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చెప్పారు. ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా రిజర్వాయర్ నిర్మిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో కలిసి సోమవారం గంధమల్ల చెరువును సందర్శించారు.అనంతరం ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ 1.4 టీఎంసీల నీటి సామర్థ్యంతో గంధమల్ల రిజర్వాయర్ నిర్మించేందుకు రూ. 522 కోట్లు ఖర్చు అవుతందన్నారు. రిజర్వాయర్ నిర్మాణానికి వెయ్యి ఎకరాలు సేకరిస్తామని, ఏ ఒక్క గ్రామం కూడా ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ రిజర్వాయర్ పూర్తయితే 50 వేల ఎకరాల సాగు నీరు అందుతుందన్నారు.
భూమి కోల్పోయే రైతులకు తగిన పరిహారం గానీ, భూమికి భూమిగానీ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. గంధమల్ల, తపాస్‌పల్లి, నవాబ్‌పేట రిజర్వాయర్ల నీటితో ఆలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గంధమల్లలో తట్టెడు మట్టి కూడా తీయలేదని మండిపడ్డారు. రివ్యూలో అడిషనల్ కలెక్టర్ పీబెన్ షాలోమ్, ఆర్డీవో అమరేందర్ పాల్గొన్నారు.