కొండంపేటలో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగల దాడి..ఏడుగురికి గాయాలు

కొండంపేటలో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగల దాడి..ఏడుగురికి గాయాలు

కోటపల్లి, వెలుగు: ఉపాధి హామీ పనుల కోసం వెళ్లిన కూలీలపై తేనెటీగలు దాడిచేసిన ఘటన కోటపల్లి మండలంలో జరిగింది. కొండంపేట గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల కోసం బుధవారం ఉదయం కూలీలు బయల్దేరారు. పని జరిగే ప్రదేశానికి సమీపంలో తేనెటీగలు ఒక్కసారి లేచి కూలీలపై దాడి చేశారు. దీంతో వారు భయంతో పరుగులు తీశారు.

తేనెటీగల దాడిలో గ్రామానికి చెందిన లింగయ్య, బానయ్య, స్వరూప, సమ్మక్క, రాజు, అంకమ్మ, బాపుకు గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో బాధితులను చెన్నూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి బాధితులతో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ సత్యనారాయణకు సూచించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్ తెలిపారు.