Paris Olympics 2024: వినేశ్ ఫోగాట్ అనర్హత పిటిషన్.. ఒలింపిక్స్ ముగిసేలోపు తీర్పు

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగాట్‌పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఫోగాట్‌ 50 కిలోల ప్రీ స్టైల్ విభాగంలో పోటీ పడగా.. ఆమె ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాముల అధిక బరువు ఉందన్న కారణంగా అనర్హత వేటు వేశారు. దీనిని సవాల్ చేస్తూ ఆమె కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ (Court of Arbitration for Sports‌)లో పిటిషన్ దాఖలు చేసింది. 

వినేశ్ ఫోగాట్ అప్పీల్‌ను విచారించిన కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్ (CAS).. పారిస్ ఒలింపిక్స్ ముగిసేలోపు నిర్ణయం వెలువడుతుందని శుక్రవారం(ఆగస్టు 9) తెలిపింది. కాగా, వినేశ్‌ ఫోగాట్ CASకి రెండు విజ్ఞప్తులు చేసింది. మొదటిది ఫైనల్లో పాల్గొనడానికి అనుమతించాలని కోరింది. దీనిని CAS తిరస్కరించింది. ఇక రెండోది.. రజత పతక విజేత హోదాను ఇవ్వాలని కోరడం. అనగా, ఉమ్మడి రజత పతక విజేతగా ప్రకటించాలని కోరింది. దీనిపైనే సస్పెన్స్ కొనసాగుతోంది.

అమెరికా క్రీడాకారిణికి స్వర్ణం

కాగా, మహిళల 50 కిలోల ఫ్రీ స్టైల్ విభాగంలో అమెరికా రెజ్లర్ సారా హిల్డెబ్రాండ్ గోల్డ్ మెడల్ అందుకుంది. ఫైనల్లో క్యూబాకు చెందిన యుస్నీలిస్ గుజ్మాన్ లోపెజ్‌ను ఓడించి స్వర్ణం చేజిక్కించుకుంది. అంతకుముందు సెమీఫైనల్లో యుస్నీలిస్ లోపెజ్‌.. వినేశ్ ఫోగాట్ చేతిలో ఓడిపోయింది. భారత రెజ్లర్‌పై అనర్హత వేటు పడటంతో  క్యూబా క్రీడాకారిణికి ఫైనల్లో తలపడే అవకాశమొచ్చింది.