ఎవరైనా ప్రాబ్లెమ్లో ఉన్నప్పుడు ఏదైనా సలహా ఇస్తే.. 'నీదేంపోయింది! సలహానేగా ఇచ్చేస్తావ్' అంటుంటారు, పోనీ ఎమీ మాట్లాడకపోతే.. 'ఏదైనా సలహా ఇవ్వొచ్చుగా' అని అడుగుతారు. అందుకే సలహాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రపంచంలో సులువుగా లభించేది ఏదైనా ఉందంటే అది సలహానే! కొంతమంది అవసరం ఉన్నా లేకపోయినా ఉచిత సలహాలు పడేస్తూ ఉంటారు. మరికొంత మంది మాత్రం ఆచితూచి ఉపయోగపడే సలహాలిస్తుంటారు. ఇచ్చే సలహా సరైనది అయితే.. అది మరొకరి జీవితాన్ని కాపాడుతుంది. సమస్యను ధైర్యంగా ఎదుర్కొనేలా చేస్తుంది. అందుకే సలహా ఇచ్చేముందు కొన్ని విషయాలు ఆలోచించాలి.
అవతలివారి సమస్య మనకు మామూలుగా అనిపించినా, దానికి సొల్యూషన్ మన దగ్గర ఉందనిపించినా.. అడగకుండా ఇచ్చే సలహాకి వాల్యూ ఉండదు కాబట్టి.. అడిగే దాకా సలహాలు ఇవ్వకూడదు. ముఖ్యంగా అవతలి వ్యక్తితో అంత చనువు లేనప్పుడూ, నలుగురిలో ఉన్నప్పుడు అస్సలు ఇవ్వకూడదు. తొందరపడి ఇచ్చే సలహా వాళ్లని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అందుకే ఒకవేళ ఆ సమస్యకు మీ దగ్గరే సొల్యూషన్ ఉందనిపిస్తే ఆ వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు అవసరాన్ని బట్టి సలహాను వివరించి చెప్పాలి. కొంతమంది వచ్చిన ప్రాబ్లెమ్ గురించి పదేపదే, ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటారు. పక్కవారికి చెప్పుకుని కాస్త రిలాక్స్ అవడం కోసం అలా చేస్తుంటారు. అలాంటప్పుడు ఆ మాటలు ఓపిగ్గా వినాలి. మనకి విసుగు అనిపించినా, వారిని అడ్డుకోకుండా డిస్కషన్ కొనసాగించాలి. వీలైతే ఇంకా ప్రశ్నలు అడిగి, సమస్యలోని అన్ని కోణాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాలి.
సమస్య మనది కాకపోయినా.. సలహా ఇచ్చేది మనమైనప్పుడు.. ఆ సమస్యను మనదిలానే చూడాలి. సమస్యని కాసేపు మనదిగా భావిస్తేనే.. అందులోని లోటుపాట్లు తెలుస్తాయి. అలా కాకుండా జస్ట్ ఒక మూడో వ్యక్తిగా
చూస్తే మాత్రం సమస్య చాలా తేలికగా కనిపిస్తుంది. పరిష్కారం కూడా అలాగే ఉంటుంది. సలహా కోసం వచ్చారు కదా అని చాలా మంది అవతలి వారిని చులకనగా చూస్తుంటారు. అవతలి వారు తమ మీద నమ్మకంతో వచ్చారన్న సంగతి గుర్తుంచుకోరు. అందుకే ఎవరైనా సలహా అడిగినప్పుడడు, సమస్యను విని, నిజాయితీగా తోచిన సలహాను ఇవ్వాలి.
సలహా అడిగారు కదా అని అవతలివారిని తక్కువ చేసి ‘అంతా నాకే తెలుసు’ అన్నట్టు వ్వవహరించకూడదు. సమస్య గురించి మనకు తోచిన అభిప్రాయాలు, పరిష్కారాలు.. అన్నీ అవతలివారితో చర్చించి నిర్మొహమాటంగా తేల్చేయాలి. అప్పుడే సలహా ఇవ్వడం ఒక కాలక్షేపంగా కాకుండాఉపయోగకరంగా ఉంటుంది.