మార్చికి ముందే  ముండుతున్న ఎండలు

నిజామాబాద్, వెలుగు:  మార్చి రాకముందే  జిల్లాలో ఎండలు మండుతున్నాయి.  గత వారం రోజులుగా 36  డిగ్రీల దాకా   ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు అప్రకటిత కరెంటు కోతలూ మొదలయ్యాయి. దీంతో ఉక్కపోత జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కిందటి ఏడాది ఫిబ్రవరి లో సాధారణంగా 26 డిగ్రీల నుంచి 30 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ, ఈసారి ఫిబ్రవరి మధ్య నుంచే రికార్డు స్థాయిలో 36 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో స్థానికులు బయటకు రాలేకపోతున్నారు. ఉదయం 11 గంటలకే రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.  జిల్లాలో   ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో అదేస్థాయిలో కరెంట్​ వినియోగం పెరుగుతోంది. సాధారణంగా ఏప్రిల్​ మొదటివారం వరకు 10 మిలియన్​ యూనిట్ల విద్యుత్​ ను వినియోగిస్తారు. కానీ ఫిబ్రవరి చివరి వారం లోనే 13 మిలియన్​ యూనిట్ల కరెంట్​ ను వినియోగించారు. సాధారణ వినియోగం కంటే 3 మిలియన్​ యూనిట్ల కరెంట్​ వినియోగం పెరిగిందని అధికారులు అంటున్నారు. కరెంట్​ వినియోగం పెరుగుతుండటంతో విద్యుత్​ కోతలు విధిస్తున్నారు. దీంతో మధ్యాహ్నవేళల్లో ప్రజలు   తీవ్ర​అవస్థలుపడుతున్నారు. 

జాగ్రత్తలతో వడదెబ్బ నివారణ 


పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో  జాగ్రత్తలు పాటించాలి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు బయటకు వెళ్లొద్దు. శరీరంలో నీటిశాతం తగ్గితే వడదెబ్బ తగులుతుంది. ప్రయాణాలు ఉంటే  ఉదయం,   సాయంత్రం  చేయాలి. తరచూ నిమ్మరసం, సాల్ట్​, షుగర్​ నీటిని తాగాలి. సాయంత్రం 4  నుంచి నుండి 6 వరకు హీట్​ వేవ్స్​  ఉంటాయి.   జాగ్రత్తలు పాటించకపోతే వడదెబ్బ కు ప్రాణాలు కొల్పోయే ప్రమాదముంది.

- డాక్టర్​ ప్రతిమా రాజ్, సూపరింటెండెంట్, ​జీజీహెచ్​

ఎండ భయపెడుతోంది.. 

పెరిగిన   ఉష్ణోగ్రతలతో వడగాలులు తీవ్రమయ్యాయి. ఉదయం 11 గంటలకే   బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది.  ఫిబ్రవరిలో ఎండలు ఇలా ఉంటే ఏప్రిల్​,  మే నెలలో ఎలా ఉంటాయో!. కరెంట్​ కూడా పోతోంది. ఉక్కపోత కూడా పెరిగింది. 
- రాకేశ్​ స్థానికుడు