ప్రధాని రాకముందే బెంగళూరుకు సీఎం

ప్రధాని రాకముందే బెంగళూరుకు సీఎం
  • మోడీ ఢిల్లీ వెళ్లాకే హైదరాబాద్‌కు వచ్చేలా షెడ్యూల్
  • రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వాగతం పలకనున్న మంత్రి తలసాని
  • ఐఎస్‌బీలో 75 నిమిషాలు గడపనున్న మోడీ

ప్రధాని షెడ్యూల్: 
మధ్యాహ్నం 1.25 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు
మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.15 దాకా ఐఎస్బీ కాన్వొకేషన్లో
3.55గంటలకు ప్రత్యేక విమానంలో చెన్నైకి

ఇది మూడోసారి
కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న టైంలో వ్యాక్సిన్‌ తయారీ కోసం శ్రమిస్తున్న సైంటిస్టులను అభినందిం చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ.. హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీకి వచ్చారు. నాడు హకీంపేట ఎయిర్‌ పోర్టులో ల్యాండ్‌ అయిన మోడీకి కేసీఆర్‌ స్వాగతం పలకలేదు. ఇటీవల ముచ్చింతల్‌లోని చినజీయర్‌ ఆశ్రమంలో సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణకు ప్రధాని మోడీ వచ్చినప్పుడూ కేసీఆర్ వెళ్లకుండా మంత్రి తలసానిని పంపారు. సమతామూర్తి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకంపై తన పేరు లేదని ఆగ్రహించిన కేసీఆర్‌.. అప్పటి నుంచి చినజీయర్‌ ఆశ్రమానికే దూరంగా ఉంటున్నారు. జీయర్‌ ఆధ్వర్యంలో పునర్నిర్మించిన యాదాద్రి ఆలయ ఉద్ఘాటనకు ఆయనను పిలువలేదు. నిజానికి ప్రధాని మోడీ ఐఎస్‌బీ పర్యటన షెడ్యూల్‌ను ముందే రూపొందించారు. కేసీఆర్‌ను ఈ కార్యక్రమానికి నిర్వాహకులు ఆహ్వానించారు. అయితే ప్రధాని మోడీకి దూరంగా ఉంటూ వస్తున్న కేసీఆర్‌ ఈసారి కూడా ఆయనతో కలిసి వేదిక పంచుకోవడానికి ముందుకు రాలేదు. అందుకే ఢిల్లీ, బెంగళూరు పర్యటనలను ఆయన పెట్టుకున్నారనే విమర్శలు ఉన్నాయి.

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న టైమ్‌లోనే సీఎం కేసీఆర్‌ బెంగళూరుకు వెళ్తున్నారు. ప్రధాని హైదరాబాద్‌కు రావడానికి ముందే వెళ్లి, ఆయన ఢిల్లీకి బయల్దేరిన తర్వాత తిరిగి హైదరాబాద్‌కు చేరుకునేలా సీఎం తన టూర్‌ షెడ్యూల్‌ రూపొందించుకున్నారు. మోడీ రాష్ట్ర టూర్‌‌కు కేసీఆర్‌‌ దూరంగా ఉండటం ఇది మూడోసారి. దీనిపై బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. ప్రధాని మోడీకి స్వాగతం పలకాల్సి వస్తుందనే కేసీఆర్‌ రాష్ట్రంలో ఉండటం లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రానికి మోడీ ఏం చేశారని స్వాగతం పలకాలని మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.  
మధ్యాహ్నం రానున్న మోడీ..
ఇండియన్ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) 20వ వార్షికోత్సవంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రానున్నారు. మధ్యాహ్నం 1.25కు బేగంపేట ఎయిర్‌ పోర్టుకు చేరుకోనున్నారు. గవర్నర్‌ తమిళిసై సహా పలువురు ప్రధానికి స్వాగతం పలుకుతారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో గచ్చిబౌలిలోని ఐఎస్‌బీకి మోడీ చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.15 దాకా ఐఎస్‌బీ కాన్వొకేషన్‌లో పాల్గొని సందేశమివ్వడంతోపాటు గ్రాడ్యుయేట్లకు గోల్డ్‌ మెడల్స్​, సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమంలో 35 నిమిషాలు ప్రధాని ప్రసంగిస్తారు. 
మధ్యాహ్నం 3.20 గంటలకు ఐఎస్‌‌‌‌బీ నుంచి బయల్దేరి 3.25కి హెలిప్యాడ్‌‌‌‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 3.50 బేగంపేట ఎయిర్‌‌‌‌పోర్టుకు చేరుకుని, 3.55కు ప్రత్యేక విమానంలో చెన్నైకి బయల్దేరుతారు. 5.30 గంటలకు చెన్నైకి చేరుకొని అక్కడ 11 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని టూర్‌‌‌‌ నేపథ్యంలో హైదరాబాద్‌‌‌‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఐఎస్‌‌‌‌బీ ప్రాంగణాన్ని స్పెషల్‌‌‌‌ ప్రొటెక్షన్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ (ఎస్‌‌‌‌పీజీ) ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకుంది. ఐఎస్‌‌‌‌బీ పరిసరాల్లోని 5 కి.మీ. మేర బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు నో ఫ్లై జోన్‌‌‌‌గా ప్రకటించారు. డ్రోన్లు, ప్యారా గ్లైడర్లు, రిమోట్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌తో ఆపరేట్‌‌‌‌ చేసే మైక్రోలైట్‌‌‌‌ ఎయిర్‌‌‌‌ క్రాఫ్ట్‌‌‌‌లను నిషేధించారు. ట్రాఫిక్‌‌‌‌ సమస్య ఉత్పన్నం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాట్లు చేశారు.
ఉదయమే బెంగళూరుకు కేసీఆర్
మాజీ ప్రధాని దేవెగౌడ, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామితో సమావేశం కావడానికి సీఎం కేసీఆర్ గురువారం ఉదయం వెళ్లనున్నారు. బేగంపేట ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టు నుంచి 10 గంటలకు ప్రత్యేక విమానంలో బయల్దేరి 11 గంటలకు బెంగళూరుకు చేరుకుంటారు. అక్కడి నుంచి లీలా ప్యాలెస్‌‌‌‌ హోటల్‌‌‌‌కు వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 12.30కు బెంగళూరులోని పద్మనాభ నగర్‌‌‌‌లో మాజీ ప్రధాని దేవెగౌడ నివాసానికి చేరుకుంటారు. దేవెగౌడ, కుమారస్వామితో కలిసి లంచ్‌‌‌‌ చేస్తారు. ఈ సందర్భంగా దేశంలో రాజకీయ పరిస్థితులు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల పట్ల అనుసరిస్తున్న విధానాలు, ఇతర అంశాలపై చర్చిస్తారు.

మధ్యాహ్నం 3 గంటలకు దేవెగౌడ నివాసం నుంచి బయల్దేరి 3.45కు బెంగళూరు ఎయిర్‌‌‌‌పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్‌‌‌‌ పోర్టుకు చేరుకుంటారు. కేసీఆర్‌‌‌‌ బెంగళూరు పర్యటన నేపథ్యంలో ఆయన అభిమానులు దేవెగౌడ నివాసం వద్ద పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కేసీఆర్‌‌‌‌ గురువారం రాత్రి బెంగళూరులో బస చేసి శుక్రవారం మహారాష్ట్రలోని రాలేగావ్‌‌‌‌ సిద్ధికి వెళ్లి అన్నాహజారేతో భేటీ కావాల్సి ఉంది. కానీ గురువారమే ఆయన హైదరాబాద్‌‌‌‌కు తిరిగి వస్తుండటంతో రాలేగావ్‌‌‌‌ సిద్ధి పర్యటనపై సీఎంవో వర్గాలు క్లారిటీ ఇవ్వలేదు.

మోడీకి భారీ స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు

 ప్రధాని నరేంద్ర మోడీ గురువారం హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సందర్భంగా గ్రాండ్ గా వెల్ కం చెప్పేందుకు బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. బేగంపేట ఎయిర్ పోర్టు పార్కింగ్ ప్లేస్​లో స్వాగత సభ నిర్వహించేందుకు సభా వేదికను, బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఈ సభకు భారీగా పార్టీ కార్యకర్తలను జనాన్ని తరలించేందుకు చర్యలు చేపట్టారు. సభ ఏర్పాట్లను బుధవారం బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ పరిశీలించారు.

గురువారం మధ్యాహ్నం 1.25 గంట‌‌‌‌ల‌‌‌‌కు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న మోడీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ సీనియర్ నేతలు లక్ష్మణ్, డీకే అరుణ, మురళీధర్ రావు, ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఇతర సీనియర్ నేతలు స్వాగతం పలుకనున్నారు. ఆ తర్వాత ఎయిర్ పోర్టు బయట స్వాగత సభ వేదిక వద్దకు మోడీ చేరుకుని పార్టీ కార్యకర్తలకు అభివాదం చేయనున్నారు. సభలో మోడీ ప్రసంగించే అవకాశంలేదని, ఆయనకు సన్మాన కార్యక్రమం మాత్రమే ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.  

 


 

 

ఇవి కూడా చదవండి

అప్పుల కోసం ఢిల్లీలో అధికారుల చక్కర్లు

బీటెక్ వాళ్లు కూడా సోషల్ సైన్స్ చదవొచ్చు

 

 

ఇవి కూడా చదవండి

కేటీఆర్ ​ఆర్డరేసినా నెమ్మదిగానే అభివృద్ధి పనులు

ప్లంబర్​ శైలజ ఇన్​స్పిరేషనల్​ జర్నీ..

తరగని ఆస్తినంతా దానం చేసి ఏం చేస్తున్నారంటే..