బీఆర్ఎస్ సిట్టింగులకు బీఫామ్‌‌ టెన్షన్!

  • ప్రకటించిన వారిలో కొందరిని తప్పిస్తారని ప్రచారం
  • ఎవరిపై వేటు పడుతుందోనని ఎమ్మెల్యేల హైరానా
  • ఎల్లుండి క్యాండిడేట్లకు బీఫామ్‌‌లు అందజేయనున్న కేసీఆర్
  • మూడు, నాలుగు చోట్ల మార్పు ఉండొచ్చంటున్న నేతలు

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ అభ్యర్థులు, ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బీఫామ్‌‌ టెన్షన్​పట్టుకుంది. ప్రకటించిన వారిలో కొందరిని తప్పిస్తారని ప్రచారం జరుగుతుండటంతో ఎవరిపై వేటు పడుతుందోనని ఎమ్మెల్యేలు హైరానా పడుతున్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌‌లో బీఆర్ఎస్​అధ్యక్షుడు, సీఎం కేసీఆర్​అధ్యక్షత నిర్వహించే సమావేశంలో పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత క్యాండిడేట్లకు బీఫామ్‌‌లు అందజేయనున్నారు. ఎలక్షన్​కమిషన్​ మార్గదర్శకాల మేరకు ఒక్కో అభ్యర్థి ఎన్నికల్లో ఖర్చు చేయాల్సిన మొత్తం రూ.40 లక్షల చొప్పున చెక్కులను కేసీఆర్ ఇవ్వనున్నారు. అయితే ప్రకటించిన అభ్యర్థులందరికీ టికెట్లు ఇవ్వడం లేదని, ఇద్దరు ముగ్గురిని పోటీ నుంచి డ్రాప్​చేయవచ్చని బీఆర్ఎస్‌‌లో జోరుగా చర్చ సాగుతున్నది. 

పది మందిపై తీవ్ర వ్యతిరేకత!

కేసీఆర్ ప్రకటించిన ఎమ్మెల్యేల్లో పది మందిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టుగా ఇటీవలి సర్వేల్లో తేలింది. వారిపై నానాటికి వ్యతిరేకత పెరుగుతుండటంతో అందులో కనీసం ఇద్దరు, ముగ్గురిని తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వొచ్చని చెప్తున్నారు. ఒకవేళ వారిని తప్పించకుంటే పార్టీకి ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయని లీడర్లు చెప్తున్నారు.

ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను తీసుకువచ్చి ఓవర్​కమ్​చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో అభ్యర్థుల మార్పు తప్పదనే అంచనాలో లీడర్లు ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కొక్కరిపై వేటు పడొచ్చని ప్రచారం నడుస్తోంది.

సర్వే రిపోర్టులను ముందు పెట్టి..

పార్టీ అభ్యర్థులను ప్రకటించే సమయంలోనే పని తీరు మార్చుకోని వారిని మార్చేస్తామని కేసీఆర్ ఇండికేషన్​ఇచ్చారు. పని మార్చుకోని ఎమ్మెల్యేలను తప్పించాల్సి వస్తే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. సర్వే రిపోర్టులను వారి ముందు పెట్టి ఎందుకు తప్పించాల్సి వస్తుందో వివరిస్తారని సమాచారం. ఏ కులానికి చెందిన ఎమ్మెల్యేను తప్పిస్తే అదే కులానికి చెందిన నాయకుడితో సీటును రీ ప్లేస్​చేస్తారని తెలుస్తున్నది.

ALSO READ :  కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్​ ప్రకటనపై ఎదురుచూపులు

దీనిపై తప్పించే లీడర్లకు ముందుగా సమాచారం ఇవ్వబోరని, 15వ తేదీన ఉదయం వారిని హైదరాబాద్​కు పిలిపించిన తర్వాతే పరిస్థితిని వివరిస్తారని గులాబీ పార్టీలో చర్చ సాగుతున్నది. ఒకానొక దశలో పది మంది వరకు అభ్యర్థులను తప్పిస్తారని ప్రచారం జరిగినా ముగ్గురు, నలుగురికి మించి ఆ సంఖ్య ఉండదని తెలుస్తున్నది.

మిగతా చోట్ల క్లారిటీ

ఆగస్టు 21న 115 స్థానాలకు అభ్యర్థులను కేసీఆర్​ప్రకటించారు. గజ్వేల్​తో పాటు కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేయబోతున్నారు. మల్కాజ్‌‌గిరి నుంచి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు టికెట్​ఇచ్చినా తన కుమారుడికి మెదక్ ​టికెట్​నిరాకరించడంతో ఆయన పార్టీని వీడి కాంగ్రెస్​లో చేరారు. ఇలా మల్కాజ్‌‌గిరి సీటు ఖాళీ అయ్యింది. అక్కడి నుంచి మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్​రెడ్డిని పోటీకి దించుతున్నారు. లీడర్ల మధ్య గొడవలతో జనగామ, నర్సాపూర్ ​సీట్లను పెండింగ్​లో పెట్టారు. జనగామలో పల్లానే అభ్యర్థి అని కేటీఆర్​ప్రకటించారు. నర్సాపూర్​లోనూ మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి టికెట్​ఖరారు చేశారు. సిట్టింగ్​ఎమ్మెల్యే మదన్​రెడ్డికి ఎమ్మెల్సీ లేదా ఇతర అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వీటితో పాటు గోషామహల్, నాంపల్లి స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులకు కేసీఆర్​ ఆదివారం బీఫామ్స్‌‌ అందజేయనున్నారు.

ముదిరాజ్‌‌లకు ఓ సీటు

ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఒక్కరికీ బీఆర్ఎస్ టికెట్​ఇవ్వలేదు. దీనిపై ఆ వర్గం నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. బీసీల్లో ప్రధాన కులమైన తమను ఎలా విస్మరిస్తారని, తమకు అవకాశం ఇవ్వకుంటే బీఆర్ఎస్​కు వ్యతిరేకంగా పని చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యేను డ్రాప్ చేసి ఆ స్థానం నుంచి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ప్రకటించే అవకాశముందని నేతలు చెప్తున్నారు. లేదంటే ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఒకరిని తప్పించి అవకాశం ఇవ్వొచ్చని సమాచారం.

ముదిరాజ్​నాయకుడికి టికెట్​ఇవ్వాల్సి వస్తే ఆ స్థానంలో డ్రాప్​చేసే ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఎంపీగా చాన్స్ ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది. అయితే ఇప్పటి వరకు ఇలాంటి సంప్రదింపులేమీ జరగలేదని కొందరు లీడర్లు చెప్తున్నారు. శుక్ర, శనివారాల్లో దీనికి సంబంధించిన ప్రాసెస్ జరగొచ్చని చెప్తున్నారు.