కామారెడ్డిలో మాస్టర్​ ప్లాన్​కు వ్యతిరేకంగా జోలె పట్టి రైతుల భిక్షాటన

  • ఆఫీసర్లు పట్టించుకోవట్లేదంటూ దున్నపోతుపై నీళ్లు పోస్తూ ర్యాలీ
  • అడుక్కున్న పైసలు తెచ్చి మున్సిపల్ ​ఆఫీసు ముందు పోసిన్రు  
  • కామారెడ్డిలో అన్నదాతల వినూత్న నిరసన 

కామారెడ్డి , వెలుగు: తమ భూములను ఇండస్ర్టియల్ ​జోన్, గ్రీన్​జోన్, 100 ఫీట్ల రోడ్ల పేరుతో గుంజుకునే ఆలోచనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ.. అధికారులు స్పందించడం లేదని రైతులు గురువారం వినూత్న నిరసన తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జోలె పట్టి భిక్షాటన చేశారు. రైతు ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్​సమీపంలోని సీఎస్ఐ గ్రౌండ్ నుంచి వివిధ గ్రామాల రైతులు ర్యాలీగా బయలుదేరారు. మెయిన్​రోడ్డు, నిజాంసాగర్​ చౌరస్తా,  స్టేషన్​రోడ్డు, సుభాష్​రోడ్డు, గంజ్​ఏరియా,  సిరిసిల్ల రోడ్డు, పాత బస్టాండ్, అడ్లూర్​రోడ్డు, రైల్వే గేట్, ఆశోక్​నగర్​కాలనీల మీదుగా మెయిన్​రోడ్డు నుంచి మున్సిపల్​ఆఫీసు వరకు చేరుకున్నారు. దారి వెంట రైతులు జోలె పట్టుకొని పైసలు, కూరగాయలు అడుక్కున్నారు. మాస్టర్​ప్లాన్​తో తమకు కలిగే నష్టాన్ని వివరించారు. కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ఆఫీసర్లు స్పందించడం లేదంటూ దున్నపోతును ఊరేగిస్తూ పలుచోట్ల దానిపై నీళ్లు పోస్తూ నిరసన తెలిపారు. 

అడుక్కోగా వచ్చిన డబ్బులు, కూరగాయలను తీసుకొచ్చి మున్సిపల్​ఆఫీసు ముందు పోశారు. ‘ఈ పైసలు తీస్కొనైనా మా భూములను ఇండస్ర్టియల్​జోన్​, గ్రీన్​ జోన్,​100 ఫీట్ల రోడ్ల నుంచి విముక్తి కల్పించండి’ అని నినాదాలు చేశారు. మున్సిపల్​ఆఫీసు ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. కమిషనర్​ వచ్చి సమాధానం చెప్పాలంటూ నినదించారు. ఆయన అందుబాటులో లేరని చెప్పడంతో ఆఫీసర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి మాస్టర్​ ప్లాన్​పై పునరాలోచన చేయాలని కోరారు. కుప్పగా పోసిన పైసలు అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోయారు. అడ్లూర్, అడ్లూర్​ఎల్లారెడ్డి,  టెకిర్యాల్​, లింగాపూర్​, ఇల్చిపూర్​ రైతులతో పాటు బీజేపీ కామారెడ్డి నియోజక వర్గ ఇన్​చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి, బీజేపీ కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.