చిన్నపాటి వర్షం కురిస్తే... నగరంలోని ప్రాంతాల వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కొన్ని రోజులుగా నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా బేగంపేట బ్రాహ్మణ వాడి మేజర్ నాలా ప్రాంతాల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురికి నీటిలోనే కాలం వెల్లడిస్తున్నారు. మేజర్ నాలా నుండి వచ్చే వరద ఇండ్లల్లోకి చేరుతుండడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. గత కొంత కాలంగా నాలా అభివృద్ధి పనులు మందకొడిగా కొనసాగుతున్నాయని, కొద్దిపాటి వర్షాలకు వరద నీళ్లలోకి వచ్చి ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు వెల్లడిస్తున్నారు. గత వారం రోజుల నుండి ఇదే పరిస్థితి ఉందని వాపోయారు.
ఇళ్ల మధ్యలో నుంచే డ్రైనేజీ నీళ్లు పోతుండడంతో దుర్ఘందం భరించలేకపోతున్నామన్నారు. మురికి నీటితో సావాసం చేస్తున్నామని ఈ కారణంగా చిన్నలు, పెద్దలు విష జ్వరాలతో ఆస్పత్రి పాలు అవుతున్నట్లు బ్రాహ్మణవాడి బస్తిల వాసులు పేర్కొంటున్నారు. డ్రైనేజీలు, నాలాలు పొంగిపొర్లు్తుండడంతో ఇళ్లలోకి మురికి నీళ్లు చేరుతున్నాయన్నారు. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు.. ప్రజా ప్రతినిధులు తగిన చర్యలు తీసుకొని శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.