నాగర్‌కర్నూల్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తున్న నాయకుల తీరు వివాదస్పదంగా మారుతోంది. ఆందోళనలు, గొడవలకు దారి తీస్తోంది. పార్టీలు, నాయకుల మీద ఉన్న అభిమానంతో కార్యకర్తలు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఎలక్షన్స్ రాగానే వారికి బైండోవర్లు తప్పడం లేదు. హామీల గురించి అడుగుతున్న వారిని కాంగ్రెస్ కార్యకర్తలని ముద్రేస్తున్న అధికార పార్టీ నేతలు, దాడులకు వెనకాడడం లేదు.
తిట్లు, బెదిరింపులు కామన్‌గా మారాయి. ఎలక్షన్ ప్రచారం, ఖర్చు, గొడవలను వీడియో తీయాల్సిన మొబైల్ టీమ్స్, అబ్జర్వర్లు ఎక్కడ ఉంటున్నారో అర్థం కావడం లేదు. అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య రోజురోజుకు గొడవలు ముదురుతున్నాయి. మాటలు,చేష్టలు హద్దులు మీరుతున్నాయి. ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన అధికార యంత్రాంగం డబ్బు, లిక్కర్ పంపిణీని అడ్డుకోవడంలో సమర్థవంతంగా వ్యవహరించడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
డబ్బులు తరలిస్తున్నారనే అనుమానంతో..
అచ్చంపేట బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు ప్రచార వాహనంలో డబ్బులు తరలిస్తున్నారనే అనుమానంతో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులు లైట్‌గా తీసుకున్నట్లు కనిపించింది. అందరి సమక్షంలో ఆ వెహికల్‌ను పోలీసులు తనిఖీ చేస్తే గొడవ సద్దుమణిగేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వివాదం ముదిరి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్లింది. పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఈ వివాదంలో పొలిటికల్ మైలేజీ ఎవరికి దక్కుతుందన్న విషయం పక్కకు పెడితే గ్రామాల్లో అనవసరమైన ఘర్షణ వాతావరణం ఏర్పడుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
కాక పుట్టించిన కామెంట్స్..
సెప్టెంబర్ నెలలో నాగర్‌కర్నూల్ నియోజకవర్గం తెల్కపల్లి మండలంలో పర్యటించిన ఎమ్మల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మర్రిపల్లి గ్రామంలో చేసిన కామెంట్స్ కాక పుట్టించిన విషయం తెలిసిందే. ఏం చేయకుండా తమ ఊరికి ఎందుకొచ్చావని గ్రామస్తులు నిలదీస్తే.. కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుపడుతున్నారంటూ ఎమ్మెల్యే మర్రి ‘ఒక్కొక్కరిని కాల్చి పండబెడతా’ అని బెదిరించారు.
నాగర్ కర్నూల్, బిజినేపల్లి, తెల్కపల్లి మండలాల్లోని కొన్ని గ్రామాల్లో ఇలాగే నిరసనలు వ్యక్తమయ్యాయి. కాంగ్రెస్ టికెట్ కోసం నాగం, కూచుకుళ్ల మధ్య కోల్డ్‌వార్ నడుస్తుంటే మరోవైపు మర్రి నిలదీతలు, అడ్డగింతలు కొనసాగాయి. అచ్చంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే గువ్వలను రెండు మూడు సందర్బాల్లో యువకులు అడ్డుకోవడం, ‘వాళ్లను ఎత్తి జీపులో పడేయండి చూసుకుందాం’ అంటూ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి.
పార్టీ ఎన్నికల మేనిఫెస్టో, తాము చేసిన అభివృద్ది, చేయాల్సిన పనులను వివరించాల్సిన అధికార పార్టీ నేతల మాటల తీరు వివాదాలకు కారణమవుతోందని అంటున్నారు. కొల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్దన్ రెడ్డి కూడా ఇలాగే డీల్ చేయడం, కామెంట్స్ చేయడం పార్టీకి నష్టం కలిగిస్తోందని ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
మట్టి, ఇసుక దందాలే ప్రధాన అంశాలు..
జిల్లాలోని వాగుల నుంచి ఇసుక కొట్టుకునే చాన్స్ తమ మద్దతుదారులకే ఇచ్చారన్న తీవ్రమైన ఆరోపణలు వచ్చినా పోలీస్, రెవెన్యూ, మైనింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు అటు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. సర్కార్ ఖజానాకు నయాపైసా కట్టకుండా కోట్ల రూపాయల దందా నడిపించారు. కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట వాగులపై పూర్తి స్థాయి హక్కులు తమకే ఉన్నాయన్న ధోరణితో ఇసుక మాఫియా చెలరేగిపోయినా పట్టించుకోలేదు. గ్రామాల్లో ఇప్పడు అదే పెద్ద సమస్యగా మారింది. పర్మిషన్లు లేకుండా చెరువుల నుంచి నల్ల మట్టి, గుట్టలను ఖతం చేసి ఎర్రమట్టి తరలించడం లీడర్ల మెడకు చుట్టుకుంటోంది.
సమస్యగా ‘డబుల్’ ఇండ్లు..
గ్రామాల్లో ప్రచారానికి వెళ్తున్న అధికార పార్టీ లీడర్లను డబుల్ బెడ్రూం ఇండ్లు ఎందుకు ఇవ్వలేదని ఎక్కువగా అడుగుతున్నారు. ఎమ్మెల్యేలు రికమండ్ చేసిన వారికే గృహలక్ష్మి స్కీం కింద ఎంపిక చేశారనే ఆరోపణలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. భారీ వర్షాలకు ఇండ్లు కూలి ఇబ్బందులు పడ్డా పట్టించుకోలేదన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. నాలుగు నియోజకవర్గ కేంద్రాల్లో పనులు మొదలు పెట్టారు. కల్వకుర్తి, అచ్చంపేటలో పూర్తి కాగా, లబ్ధిదారులను ఎంపిక చేసి సర్టిఫికెట్లు ఇచ్చినా గృహ ప్రవేశాలు చేయలేదు. నాగర్‌కర్నూల్, కొల్లాపూర్‌లో ఇప్పట్లో ఇండ్లు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
నిలదీస్తే నీళ్లు నములుతున్రు..
గతంలో ఇచ్చిన హామీలేమయ్యాయని అధికార పార్టీ అభ్యర్థులను నిలదీస్తే ఇబ్బంది పడుతున్నారు. కొత్త రేషన్‌కార్డులు, బీసీ రుణాలు, గృహలక్ష్మి స్కీం అప్లికేషన్లు అధికార పార్టీ అభ్యర్థులకు చిరాకు పుట్టిస్తుంటే, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్సీ లీడర్లకు ఆయుధాలుగా మారుతున్నాయి. సమస్యలు ప్రస్తావించినా, పాత హామీలను గుర్తు చేసినా కాంగ్రెస్ కార్యకర్తలు తమ ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ లీడర్లు చేస్తున్న వాదనను జనాలు పట్టించుకోవడం లేదు. వృద్ధులు, మహిళల నిలదీతలతో లీడర్లు ఖంగుతింటున్నారు.