నల్గొండ, వెలుగు: రాష్ట్రంలో కొందరు కింది స్థాయి పోలీస్ ఆఫీసర్ల తీరు వివాదాస్పదమవుతోంది. ఎన్నికలు వస్తున్న క్రమంలో ఎమ్మెల్యేల పైరవీలతో వచ్చిన కొందరు ఎస్ఐ, సీఐలు పై ఆఫీసర్ల మాట వినడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు చెబితే తప్పా వేరెవ్వరినీ లెక్క చేయట్లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏది చెప్తే అదే చేస్తున్నారు. ముఖ్యంగా అసమ్మతి నేతలను దారికి తెచ్చుకునేందుకు ప్రజాప్రతినిధులు వీరిని ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న కొన్ని వరుస సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారాయి. బీసీ లీడర్వట్టె జానయ్య యాదవ్ విషయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశాలను పోలీసులు తూచా తప్పకుండా పాటించారని, అక్రమ కేసులు పెట్టి వేధించారని ప్రతిపక్ష పార్టీలు, బీసీ, యాదవ సంఘాలు దుమ్మెత్తిపోసిన సంగతి తెలిసిందే. మంత్రితో కలిసి ఉన్నప్పుడు ఒక్క కేసు కూడా నమోదు చేయకుండా ఆయనతో విభేదాలు రాగానే పదుల సంఖ్యలో కేసులు పెట్టడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. జానయ్యకు ప్రాణహాని ఉందని గన్మెన్లను కేటాయించిన సర్కారు మంత్రితో గొడవలు మొదలవ్వగానే తొలగించడం కూడా దీనికి బలాన్ని చేకూర్చింది.
తనిఖీకి రావొద్దని ఎమ్మెల్యేతో ఫోన్ ..
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొందరు ఎస్ఐలు, సీఐలు ఉన్నతాధికారులనే బెదిరిస్తున్నారు. ఎన్నికల బదిలీలకు కొద్దిరోజుల ముందు నల్గొండ జిల్లా కనగల్ మండలానికి చెందిన ఓ ఎస్ఐ అధికార పార్టీ నేత బలం ఉందని తన పై ఆఫీసర్ డ్యూటీకే అడ్డు తగిలాడు. ఆరోపణలు రావడం, క్రైం రికార్డులు సరిగ్గా లేవన్న కారణంతో ఉన్నతాధికారి స్టేషన్ తనిఖీకి రావడానికి సిద్ధమయ్యారు. ఇది తెలుసుకున్న సదరు ఎస్ఐ ఏకంగా ఆ ఆఫీసర్కే ఫోన్ చేశాడు. తనిఖీకి వస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.దీంతో సదరు ఉన్నతాధికారి ఎస్ఐపై ఫైర్ అయ్యారు.
ఎస్ఐ ఆగమేఘాల మీద ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు. తనిఖీకి రాకుండా చేయాలని ఎమ్మెల్యేకు విన్నవించుకున్నాడు. ఎమ్మెల్యే డైరెక్ట్‌గా ఆ అధికారికి ఫోన్ చేసి తనిఖీకి రావొద్దంటూ హుకుం జారీ చేశాడు. విస్తుపోయిన ఆ ఆఫీసర్ జిల్లాలోని ముఖ్య ప్రజాప్రతినిధికి విషయం చెప్పారు. ఇలాగైతే జిల్లాలో డ్యూటీ చేయడమా..వెళ్లిపోవడమా అని ప్రశ్నించడంతో ఆ ముఖ్య ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేకు ఫోన్ చేసి క్లాస్ పీకినట్టు సమాచారం. ఇది జరిగిన కొద్దిరోజులకే ఎస్ఐ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ కావడం, తర్వాత జిల్లా నుంచి వెళ్లిపోవడం జరిగింది.
అసమ్మతి నేతల పైన కన్నెర్ర...
ఎన్నికల వేళ అసమ్మతి నేతల తిరుగుబాటు..ఎమ్మెల్యేలను ఇరకాటంలో నెట్టేసింది. దీంతో వారు పోలీస్బలాన్ని అడ్డం పెట్టుకుని ఛాన్స్ దొరికితే వారిని లోపలెయ్యాలని చూస్తున్నారన్న విమర్శలున్నాయి. మండలి చైర్మన్ గుత్తా సుఖేంద ర్ రెడ్డి ప్రధాన అనుచరుడు, తిప్పర్తి జడ్పీటీసీ పాశం రాంరెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టాలంటూ అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధి ఆదేశాలిచ్చినట్టు సమాచారం. మండలంలో తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని రాంరెడ్డిపై కేసు పెట్టాలని పోలీసులపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది.
ఇక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తనపై కక్ష కట్టాడని పిల్లి రామరాజు యాదవ్ ఇటీవలే డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేశాడు. నల్గొండ నియోజకవర్గంలో తాను గణేశ్ విగ్రహాలు దానం చేసిన చోట ఫ్లెక్సీలు లేకుండా, మైక్‌లు పెట్టకుండా పోలీస్ బలాన్ని ప్రయోగిస్తున్నారని ఆరోపించాడు. కనగల్‌లో కొద్దిరోజుల క్రితం రామరాజు నిర్వహిస్తున్న వినాయక ర్యాలీని అడ్డుకున్న ఎస్ఐ అంతిరెడ్డి.. డీజే వాహనం వినియోగించినందుకు కేసు పెట్టారు.
ప్రతిపక్ష నేతలపైనా అదే దూకుడు...
నల్గొండ రూరల్ ఎస్ఐ చర్యలకు వ్యతిరేకంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొద్ది రోజుల క్రితం స్టేషన్‌కు వచ్చి ఆందోళన చేశారు. రైతులపై అక్రమ కేసులు పెడ్తున్నారని, తెల్లవారుజామున రైతుల ఇండ్లపై దాడి చేసి.. పోలీస్ వాహనాల్లో ఎత్తు కెళ్లి చితకబాదుతున్నారని పై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదిలాఉంటే నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం తన అనుచరులపై పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయంటున్నారు. బీఆర్ఎస్కు రాజీనామా చేసిన వీరేశం తన కేడర్‌ను బెదిరిస్తే ఊకునేది లేదని పోలీసులకు వార్నింగ్ఇచ్చారు.
ఇదే పరిస్థితి నాగార్జునసాగర్, కోదాడ, హుజూర్ నగర్లోనూ నెలకొంది. దీంతో ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి పోలీసుల వైఖరిని ఎప్పటికప్పుడు తప్పుపడుతున్నా ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో ఆందోళనకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. అవసరమైతే ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి పర్యటనను అడ్డుకుంటున్నారని...
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పోలీస్‌స్టేషన్‌కు మంత్రి కేటీఆర్ పైరవీతో వచ్చాడని చెబుతున్న సీఐ పనితీరు వివాదాస్పదంగా మారింది. టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు దగ్గరగా ఉండే ఎస్ఐని ఖానాపూర్ పీఎస్ నుంచి తప్పించి నిర్మల్ పోలీస్ స్టేషన్ కు అటాచ్ చేశారని ఇక్కడ గుసగుసలు వినిపిసస్తున్నాయి. దీంతో ఆమెను పట్టించుకోవడం లేదు. రెండు రోజుల క్రితం రాజురా గ్రామంలో బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ పర్యటనను అడ్డుకున్నారని సీఐ రాత్రి పూట పార్టీ నేతలను స్టేషన్లో నిర్బంధించాడు. పోలీస్ స్టేషన్ అద్దాలు పగులగొట్టారని, దాడికి ప్రయత్నించారని కేసులు పెట్టారు.
జగిత్యాల జిల్లాలోనూ ఇదే సీన్
జగిత్యాల జిల్లాలోని ఓ ఎస్ఐ వ్యవహార తీరు పోలీస్ ఆఫీసర్లకు తలనొప్పి తెచ్చిపెడుతోంది. సర్పంచులను స్టేషన్లకు పిలిపించి వేధించడాన్ని భరించలేక వారు పై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. దీంతో ఎస్ఐ మినిస్టర్ దగ్గరకు వెళ్లి శరణు వేడుకున్నట్టు సమా చారం. మంత్రి ఆయనకు మళ్లీ పోస్టింగ్ఇవ్వాలని ఆదేశించడమేగాక, తన ప్రాంతంలోనే తెచ్చి పెట్టుకున్నాడని అంటున్నారు. దీంతో ఇప్పుడు ఏ సమస్య వచ్చినా తనకు మినిస్టరే బాస్ అంటూ సదరు ఎస్ఐ పై అధికారులను సైతం బెదిరిస్తున్నాడని సమాచారం.