
- ఖమ్మం కార్పొరేషన్ లో కొందరు ఆఫీసర్ల పెత్తనం
- వాల్ ప్రాజెక్టు పేరుతో రూ.2 కోట్ల పనులు అప్పగింత
- ఒకరికే పనులు, ముక్కలు ముక్కలుగా బిల్లులు
- స్థానికేతరులకు పనులు ఇవ్వడంతో లోకల్ ఆర్టిస్టుల గొడవ
- వాళ్లకి కొన్ని పనులిచ్చి సెట్ రైట్ చేసిన అధికారులు
- మేయర్, పాలకవర్గాన్ని డమ్మీ చేశారని విమర్శలు
ఖమ్మం, వెలుగు: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో కొందరు అధికారుల తీరు వివాదాస్పదంగా మారుతోంది. రూ.5 లక్షలకు మించిన పని ఏదైనా టెండర్లు పిలవాలని రూల్స్ ఉన్నా.. లైట్ తీసుకుంటున్నారు. రూ.కోట్ల విలువైన పనులను ఇష్టారీతిన నచ్చినోళ్లకు అప్పగిస్తున్నారు. మేయర్, పాలకవర్గానికి కనీస సమాచారం లేకుండా ఒకరిద్దరు ఆఫీసర్లు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అటు ఐఏఎస్ అధికారైన మున్సిపల్ కమిషనర్ ను, ఇటు మేయర్ ను డమ్మీలుగా మార్చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కింది స్థాయి అధికారుల అభ్యంతరాలను కూడా పట్టించుకోకుండా ఒత్తిడి చేసి వారితోనే పనులు చేయిస్తున్నట్టు తెలుస్తోంది.
ఖమ్మం సిటీలో కొద్ది నెలలుగా వాల్ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ భవనాల గోడలపై, వీధుల్లో అందమైన పెయింటింగ్స్ వేయిస్తున్నారు. ఖమ్మం కార్పొరేషన్ ఏర్పాటైన కొత్తలో దాదాపు పదేళ్ల కింద రూ.80 లక్షలతో వాల్ పెయింటింగ్స్ చేయించారు. నగర సుందరీకరణలో భాగంగా తిరిగి ఆర్నెళ్ల కిందట వాల్ పెయింటింగ్స్ చేయించాలని నిర్ణయించారు. దాదాపు రూ 2 కోట్లతో ఈ పనులు చేపట్టినా టెండర్లు పిలవలేదు. టెండర్ఉల నిర్వహిస్తే తక్కువ రేట్ కోట్ చేసిన వారికి అప్పగించవచ్చు. కానీ అవేమీ లేకుండా నచ్చిన వాళ్ల కు నామినేషన్ పద్దతిపైనే పనులు అప్పగించారు.
ఇతర ప్రాంతానికి చెందిన ఒక కాంట్రాక్టర్ కు దాదాపు రూ.కోటి పనులను నామినేషన్ బేసిస్ మీద ఇవ్వడం, ఆయన ఇతర రాష్ట్రాల నుంచి ఆర్టిస్టులను రప్పించిపనులు చేయించడం గొడవకు కారణమైంది. ఈ విషయంలో నగరానికి చెందిన ఆర్టిస్టులు, అధికారులతో వాగ్వాదానికి దిగారు. లోకల్ ఆర్టిస్టులకు పని దొరక్క హైదరాబాద్, అనంతపురం వెళ్లి కూలీ చేసుకుంటుంటే ఇక్కడి పనులను వేరేవాళ్లకు అప్పగిస్తారా అని నిలదీశారు. దాంతో వారికి నచ్చజెప్పి ఎన్టీఆర్ సర్కిల్, పీజీ కాలేజీ, బస్ డిపో రోడ్డు, డీఆర్డీఏ ఆఫీస్ తదితర చోట్ల పనులను స్థానిక ఆర్టిస్టులకు ఇచ్చారు. రూ.25 లక్షల కన్నా తక్కువ పనులను మాత్రమే లోకల్ ఆర్టిస్టులకు ఇచ్చినట్టు సమాచారం.
ఈ వ్యవహారంపై కార్పొరేషన్ లోని కింది స్థాయి అధికారులు టెన్షన్ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన రూ.కోట్ల విలువైన పనులపై విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుండడం, మరికొన్ని పనులపై ఇంకా ఎంక్వైరీ కొనసాగుతుండడంతో వాల్ ప్రాజెక్ట్‌పై కూడా ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఇబ్బంది అవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఎంక్వైరీ జరిగితే తాము ఇరుక్కుంటామంటూ ఎంబీ రికార్డు చేసేందుకు ఇంజినీరింగ్ అధికారులు వెనుకంజ వేస్తున్నారు.
ఈ నెలాఖరు నాటికి స్వచ్ఛ్ సర్వేక్షన్ ఫండ్స్ గడువు ముగుస్తున్నందున వెంటనే బిల్లులు రెడీ చేయాలని పై అధికారులు వారిపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. బిల్లులు ఫార్మాట్ లో లేవని అకౌంట్స్ అధికారులు తిప్పిపంపగా.. మళ్లీ ఫార్మాట్ లో బిల్స్ పెట్టేలా ఇంజినీరింగ్ సెక్షన్ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. దాదాపు రూ.2 కోట్ల పనులకు రూ. 5 లక్షలలోపు అమౌంట్‌తో మొత్తం 40 వరకు ఎస్టిమేట్లు సిద్ధం చేసి బిల్స్ పెడుతున్నారని, అక్రమంగా చేసిన పనులను లీగల్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
అన్ని పనులకు ఒకేసారి టెండర్ నిర్వహిస్తే కాంట్రాక్టర్లు తక్కువ రేటుకే ముందుకు వచ్చేవారు. దాంతో కార్పొరేషన్ కు నిధులు మిగిలేవి. మామూళ్లు, కమిషన్ల కోసం కొందరు అధికారులు అక్రమమార్గాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు రూ.2 కోట్లతో జరిగిన ఈ పనుల వివరాల గురించి అడిగితే కార్పొరేషన్ అధికారులు దాటవేత ధోరణిలో వ్యవహరిస్తున్నారు. ఈ పనులకు నోడల్ ఆఫీసర్ గా హరితహారం స్పెషలాఫీసర్ రాధిక వ్యవహరిస్తుండగా, తనకు అప్పగించిన డిజైన్ల ప్రకారం వర్క్ జరుగుతుందా లేదా అని చూడడమే తన బాధ్యత అని, ఎవరికి ఏ పద్దతిలో పనులు ఇచ్చారో తనకు తెలియదని ఆమె చెప్తున్నారు.
స్క్వేర్ ఫీట్ కు రూ.80 ధర నిర్ణయించినట్టు మాత్రమే తనకు తెలుసన్నారు. ఈ పనులను ఉన్నతాధికారులే నేరుగా చూస్తున్నారని, తనకు సంబంధం లేదని ఈఈ కృష్ణలాల్ చెప్పారు. అసిస్టెంట్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ ను సంప్రదించే ప్రయత్నం చేసినా వారు అందుబాటులేకి రాలేదు.