దేశాల తగాదాలతో ఆయిల్​ తిప్పలు

సౌదీ అరేబియాలో ఒక రిఫైనరీ మీద దాడి జరిగి పెట్రోల్ ఉత్పత్తి ఆగిపోవడంతో  పెట్రోల్ ధరలు పెరిగాయన్నది ఒక పాయింటైతే, అసలు ఈ దాడి చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది ? దీని వెనుక ఉన్న వారెవరు అనే దానిపై ఇప్పుడు  ప్రపంచమంతా చర్చ నడుస్తోంది. ఇరాన్, సౌదీ అరేబియా మధ్య గొడవలే ఈ దాడికి కారణమన్నది ఇప్పటికి ఉన్న ఒక అవగాహన.

పెట్రోల్​, డీజిల్​ వంటి ఇంధనాలను ఎక్కువ దేశాలకు ఎగుమతి చేసే దేశం సౌదీ అరేబియా. ఇది రోజూ 70 లక్షల​ బ్యారెళ్ల ఆయిల్​ను ఆయా దేశాల్లోని వివిధ ప్రాంతాలకు ఎక్స్​పోర్ట్​ చేస్తుంది. ఇలా కొన్నేళ్లుగా ప్రపంచ చమురు మార్కెట్​ అవసరాలను తీరుస్తున్న సౌదీ అరేబియా కంపెనీ ఆరామ్​కోకు చెందిన  అబ్​క్వైక్, రాస్ తనురా, జ్యుయామా, ఘవర్  ప్లాంట్ లపై ఈ మధ్య ఎటాక్​ జరిగింది. అది తమ పనేనని యెమెన్ దేశం​లోని హౌతీ రెబల్స్ అంటున్నారు. ఈ దాడి కారణంగా సౌదీ కింగ్​డమ్​లో పెట్రోల్​, డీజిల్​ ఔట్​పుట్​పై తీవ్ర ప్రభావం పడనుంది. రోజువారీ ఇంధన ఉత్పత్తి 57 లక్షల బ్యారెళ్లు తగ్గనుంది. 57 లక్షల బ్యారెళ్ల చమురంటే డైలీ ప్రొడక్షన్​లో సగానికన్నా ఎక్కువే.  గ్లోబల్​ ఆయిల్​ సప్లై 5 శాతానికిపైగా దెబ్బతింటుంది. ఇంత నష్టం జరిగితే పెట్రో ప్రొడక్ట్​లకు విపరీతంగా డిమాండ్​ పెరుగుతుందని, ఫలితంగా రేట్లు మరింతగా చుక్కలనంటుతాయని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గల్ఫ్ దేశాల్లో టెన్షన్లు మితిమీరతాయనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.

దాడి చేసిందెవరు ?

సౌదీ అరేబియా ఆయిల్​ ఇండస్ట్రీకి గుండెకాయల్లా భావించే ప్లాంట్లను తామే టార్గెట్ చేశామని హౌతీలు అంటున్నా అగ్రరాజ్యం మాత్రం నమ్మట్లేదు. వాళ్ల వెనక ఇరాన్ ఉన్నట్లు అనుమానిస్తోంది. ఈ ఎటాక్​లు యెమెన్​ నుంచి జరిగాయనటానికి ఎవిడెన్స్​ లేవని అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో చెప్పారు. ఇలాంటి దాడులు మంచిది కాదని ఎన్నో దేశాలు మొత్తుకుంటున్నా ఇరాన్​ లెక్కచేయట్లేదని, ప్రపంచానికి ఎనర్జీని సప్లై చేస్తున్న దేశాన్ని లక్ష్యంగా పెట్టుకుందని పాంపియో అన్నారు.

గతంలోనూ రెండు సార్లు

హౌతీలు ఈ ఏడాది ఆగస్టులో సౌదీలోని షేబా ఆయిల్​ ఫీల్డ్​పై దాడులు చేశారు. అంతకుముందు మే నెలలో ఆయిల్​ పంపింగ్​ స్టేషన్లపై ఎటాక్​లకు పాల్పడ్డారు. ఈ రెండు ఇన్సిడెంట్లలోనూ పెద్దఎత్తున మంటలు చెలరేగాయి తప్ప​ ఎనర్జీ ప్రొడక్షన్​ ఏమాత్రం ఆగలేదు. సౌదీకి ఇలాంటి అనుభవం గతంలో ఎప్పుడూ ఎదురుకాలేదు. అక్కడి ఆయిల్​ ట్యాంకులపై  దాడులు జరగడం ఇదే కొత్త. అయినా  పరిస్థితి అదుపులోనే ఉందని ఆరామ్​కో సీఈఓ చెప్పటం కాస్త ఊరట కలిగించే విషయం.

ప్రాంతాల మధ్య పెరుగుతున్న గొడవలు

ఇంటర్నేషనల్​ న్యూక్లియర్​ డీల్​ నుంచి అమెరికా తప్పుకోవటం, ఇరాన్​పై ఆంక్షలు పొడిగించటంతో వివిధ దేశాల మధ్య గొడవలు పెరిగి పెద్దవుతున్నాయి. యెమెన్​లో అంతర్యుద్ధం వల్ల జనం వేల సంఖ్యలో చనిపోతున్నారు. లక్షల సంఖ్యలో గాయాల పాలవుతున్నారు. యుద్ధానికి ముగింపు పలకటం కోసం సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న శాంతి ప్రయత్నాలకు ఈ  హింస భంగం కలిగిస్తోంది. పైకి యెమెన్​ అంతర్యుద్ధంగా కనిపిస్తున్నా సౌదీ అరేబియా, ఇరాన్​ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ.

హార్ట్​ ఆఫ్​ ఆయిల్​ మార్కెట్​

సౌదీ అరేబియాలోని అబ్​క్వైక్​ ప్రాంతం పలు దేశాలకు చమురు సరఫరాకి సంబంధించిన కీలక ప్రదేశం. ఇది దహ్రాన్​లోని ఆరామ్​కో హెడ్​ క్వార్టర్స్​కి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రపంచంలోనే పెద్ద కన్వెన్షనల్​ ఆయిల్​ ఫీల్డ్​ అయిన ఘవర్​ నుంచి వచ్చే క్రూడాయిల్​ను ప్రాసెస్​ చేసే​ ప్లాంట్​ అబ్​క్వైక్​లోనే ఉంది. ఇక్కడ శుద్ధి చేసిన ఇంధనాన్ని రాస్​ తనురా, జుయామా అనే ఏరియాలకు తరలించి అక్కడి నుంచి ఎర్ర సముద్రంలోని వివిధ టెర్మినల్స్​కి చేరవేస్తారు.

ఐదేళ్లుగా యుద్ధమే

యెమెన్​లోని గిరిజన జాతికి చెందిన హౌతీ గ్రూపులకు, ప్రభుత్వానికి మధ్య 2004 నుంచి యుద్ధం జరుగుతోంది. వాళ్లు ప్రభుత్వాన్ని కూల్చి రాజధాని సనాను స్వాధీనం చేసుకోవటం వల్ల యుద్ధం తీవ్రమైంది. అవినీతిని అంతమొందించేందుకే తాము తాపత్రయపడుతున్నామని హౌతీలు చెబుతున్నారు. యెమెన్‌తో బోర్డర్​ కలిగిన సౌదీ అరేబియా ఆ దేశంలో ఇరాన్‌ మద్దతున్న రెబల్స్​ సంఖ్య పెరుగుతోందని హెచ్చరించింది.

సున్నీ ముస్లింల నాయకత్వంలోని సౌదీ అరేబియా ప్రభుత్వం  2015లో యెమెన్​లోని హౌతీ రెబల్స్​కి వ్యతిరేకంగా జోక్యం చేసుకుంది. అప్పటినుంచి హౌతీలు ఆ సంకీర్ణంపైనా పోరాటం చేస్తున్నారు. యెమెన్​ ప్రభుత్వానికి సౌదీ అరేబియా, హౌతీ రెబల్స్​కి ఇరాన్​ అండగా ఉంటున్నాయి. ఈ యుద్ధం ఇప్పటికే సరిహద్దులు దాటి సౌదీ టౌన్ల వైపు వ్యాపించింది. హౌతీ లక్ష్యాలపై సౌదీ కొయిలేషన్​ రోజూ వైమానిక దాడులు చేసేది. హౌతీలు సౌదీపై మిసైళ్లు, డ్రోన్లు పేల్చేవారు.

మానవత్వానికే మచ్చ

అంతర్యుద్ధం వల్ల యెమెన్​ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. పశ్చిమాసియాలోని అరబ్ దేశాల్లో ఇదీ ఒకటి. దీనికి ఉత్తరంగా సౌదీ అరేబియా, పడమర దిక్కున ఎర్ర సముద్రం, దక్షిణ దిశలో గల్ఫ్ ఆఫ్ అడెన్, అరేబియన్ సముద్రం;  తూర్పు, ఈశాన్యం వైపు ఒమన్ దేశం ఉన్నాయి. యెమెన్​కి రాజ్యాంగబద్ధంగా సనా సిటీని రాజధానిగా నిర్ణయించినా అది 2015 ఫిబ్రవరి దాకా హౌతీ రెబల్స్​ చేతిలోనే ఉంది. దీంతో క్యాపిటల్​ను టెంపరరీగా అడెన్ నగరానికి మార్చారు.

1990లో సౌత్​, నార్త్​ యెమెన్లను కలిపి యెమెన్‌గా మార్చినా సౌత్​ యెమెన్ స్వతంత్ర దేశంగానే ఉండాలనే వాదన మాత్రం పోలేదు. హౌతీ రెబల్స్​ని​ ఎదుర్కోవటం కోసం ఇన్నాళ్లూ సెపరేటిస్టులు యెమెన్​ సర్కార్​కి సపోర్ట్​ ఇచ్చారు. ఇటీవల ఆ పరిస్థితి మారింది. ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, పక్షపాతం చూపుతోందని వేర్పాటువాదులు ఆరోపిస్తున్నారు. దేశంలో శాంతి కోసం రెండేళ్ల కిందట జరిగిన ప్రయత్నాలు ఫలించలేదు. ఫలితంగా అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. యెమెన్​ని నిలువునా కాల్చేస్తున్న ఈ మంటలు చల్లారేదెప్పుడో?!.

‘యెమెన్​లో గడచిన ఐదేళ్లుగా ఒక కొలిక్కి రాలేకపోతున్న ఈ సంక్షోభం ప్రపంచ మానత్వానికే పెద్ద మచ్చ’ అని ఎనలిస్టులు  విమర్శిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ దేశంలో వేల సంఖ్యలో ప్రజలు తినటానికి తిండి లేక, రోగాలకు మందులు అందక చనిపోనున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్య సమస్యలు..

పేదరికం, ప్రజాస్వామ్యం లేకపోవటం, దేశవ్యాప్తంగా చెలరేగుతున్న గొడవలు, పక్క దేశాల జోక్యానికి అడ్డే లేకపోవటం,

ఏ దేశంలోనూ లేనంత ఆకలి సమస్య. కోరలు చాస్తున్న కలరా మహమ్మారి, ఎమర్జెన్సీ రిలీఫ్​కి పేలుళ్లతో ఆటంకం

బోర్డర్ల మూసివేతతో తప్పని చావులు, యూఎన్​ సెక్యూరిటీ కౌన్సిల్ మౌనం, ఫలించని సమితి శాంతి యత్నాలు