చంద్రయాన్​ 2 వెనుక 16,500 మంది సైంటిస్టులు

ఒకరా ఇద్దరా.. పదహారు వేల ఐదు వందల మంది శాస్త్రవేత్తల నిద్రలేని రాత్రులు. ఆడ, మగ తేడా లేకుండా.. సెలవులు తీసుకోకుండా చంద్రయాన్​–2 కల సాకారం కోసం తపించారు. లక్ష్యానికి 2.1 కిలోమీటర్ల దూరంలో ఆ కల నిలిచిపోయినప్పటికీ… వారి శ్రమ ఏ మాత్రం వృథా కాలేదు. ఇప్పుడు కాకపోతే మరో రోజు.. ఎప్పుడైనా కల సాకారం అవుతుందన్న నమ్మకం వారిలో ఉంది.

చంద్రయాన్​–2 ప్రయోగంలో పాలుపంచుకున్న 16,500 మంది సైంటిస్టుల్లో కొందరు సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చినవారూ ఉన్నారు. సాక్షాత్తు ఇస్రో చైర్మన్​ శివన్​ది సాధారణ రైతు కుటుంబం. పొలం పనిలో నాన్నకు సాయం చేస్తూ  ఓ తమిళ్‌‌‌‌ మీడియం స్కూలులో చదివారు శివన్​. కష్టకాలంలోనూ నాన్న తమ తిండికి లోటు రానియ్యలేదని ఆయన చెబుతుంటారు. మెకానికల్​ ఇంజినీర్​ ఎస్​.సోమనాథ్​, క్రయోజెనిక్​ ఇంజిన్​ ఫెసిలిటీ హెడ్​ వి.నారాయణన్​, మిషన్​ డైరెక్టర్​ జె.జయప్రకాశ్​, వెహికిల్​ డైరెక్టర్​ రఘునాథ పిళ్లై, డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్​(రేడియో ఫ్రీక్వెన్సీ సిస్టమ్స్​)  చంద్రకాంత కుమార్,  డిప్యూటీ ప్రాజెక్ట్​ డైరెక్టర్​ (ఆప్టికల్​ పేలోడ్​ డేటా ప్రాసెసింగ్​, ఎస్​ఏసీ) అమితాబ్​ సింగ్​.. ఇలా ఎందరో సైంటిస్టులు చంద్రయాన్​–2లో భాగస్వాములయ్యారు.

మహిళా శక్తి

ఈ ప్రయోగంలో మహిళల భాగస్వామ్యం ఎనలేనిది. ప్రాజెక్టుకు ముత్తయ్య వనిత డైరెక్టర్.  చంద్రయాన్​–2ను ఆమె ముందుండి నడిపిస్తున్నారు.

ఎలక్ట్రానిక్స్​ అండ్​ కమ్యూనికేషన్​ ఇంజనీర్​ అయిన వనిత.. 32 ఏళ్లుగా ఇస్రోలో పనిచేస్తున్నారు.1987లో జూనియర్​ ఇంజనీర్​గా కెరీర్​ మొదలుపెట్టిన ఆమె… హార్డ్​వేర్​ టెస్టింగ్​, డెవలప్​మెంట్​లపై వర్క్​ చేశారు. ఇస్రో శాటిలైట్​ సెంటర్​లోని టెలిమెట్రీ టెలికమాండ్​ డివిజన్​ల​ను లీడ్​ చేశారు. కార్టోశాట్​1, ఓషన్​శాట్​2, మేఘ ట్రాపిక్స్​ వంటి శాటిలైట్లకు డిప్యూటీ ప్రాజెక్ట్​ డైరెక్టర్​గా ఉన్నారు. మార్స్​ ఆర్బిటర్​ మిషన్​ (మామ్​/మంగళ్​యాన్​)లోనూ కీలక పాత్ర పోషించారు.

ప్రస్తుతం చంద్రయాన్​–2 ప్రాజెక్ట్​ డైరెక్టర్​గా పనిచేస్తున్న వనిత.. చంద్రయాన్​–1 ప్రోగ్రాంకూ ప్రాజెక్ట్​ డైరెక్టర్​గానే ఉన్నారు. అంతేకాదు, ఇస్రోలో ఇతర గ్రహాలపై పరిశోధనల్లో పాలుపంచుకున్న మొదటి మహిళా సైంటిస్ట్​ ఆమె కావడం విశేషం. 2006లో ఆస్ట్రానామికల్​ సొసైటీ ఆఫ్​ ఇండియా ఆమెకు బెస్ట్​ విమెన్​ సైంటిస్ట్​ అవార్డును ఇచ్చింది.  మరో మహిళ రీతూ కరిధాల్​ చంద్రయాన్​–2 మిషన్​ డైరెక్టర్​గా సేవలు అందిస్తున్నారు. అంతకుముందు ఆమె మార్స్​ ఆర్బిటర్​ మిషన్​కూ పనిచేశారు. డిప్యూటీ ఆపరేషన్స్​ డైరెక్టర్​గా పనిచేసిన రీతూ.. స్పేస్​క్రాఫ్ట్​ అటానమీ వ్యవస్థలను డీల్​ చేశారు. ఐఐఎస్​సీలో ఏరోస్పేస్​ ఇంజనీరింగ్​ పీజీ చేశారు. 2007లో ఇస్రో యంగ్​ సైంటిస్టు అవార్డును ఏపీజే అబ్దుల్​ కలాం చేతుల మీదుగా అందుకున్నారు. 1997 నుంచి ఇస్రోలో పనిచేస్తున్నారు.