- ఇస్రో చైర్మన్ సోమనాథ్ లీడర్ షిప్లో మిషన్ సక్సెస్
- వెయ్యి మంది ఇంజినీర్లు.. రూ.700 కోట్ల ప్రాజెక్ట్
- కీలకంగా వ్యవహరించిన 54 మంది మహిళలు
న్యూఢిల్లీ: చంద్రయాన్ 3 సక్సెస్ వెనుక సుమారు వెయ్యి మంది ఇంజినీర్ల శ్రమ దాగి ఉంది. కరోనా టైమ్‌లో కూడా చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ కోసం ఎంతో కష్టపడ్డారు. మొత్తం రూ.700 కోట్లు విలువ చేసే ఈ మిషన్ విజయం వెనుక ‘మూన్ స్టార్స్’ కీలకంగా వ్యవహరించారు. ఆయా రంగాల్లో ఎంతో అనుభవం ఉన్న వీళ్లు.. చంద్రయాన్ 3 సక్సెస్‌కు కారణం అయ్యారు. ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ లీడర్‌షిప్‌లో నాలుగేండ్లు కష్టపడి పని చేసి.. మిషన్ సక్సెస్ చేశారు.
54 మంది మహిళా సైంటిస్ట్‌లు, ఇంజినీర్లు చంద్రయాన్3 ప్రాజెక్ట్‌లో పని చేశారు. ఎస్. సోమనాథ్, ఇస్రో చైర్మన్ చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ కోసం పనిచేసిన వారిలో అత్యంత కీలక వ్యక్తి ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్. రాకెట్ రూపకల్పనలో లాంచ్ వెహికల్ మార్క్-3 లేదా చంద్రయాన్- 3ని కక్ష్యలోకి ఎక్కించిన బాహుబలి రాకెట్ రూపకల్పనలో సోమ్ నాథ్ దే కీలక పాత్ర. చంద్రయాన్- 3 శాటిలైట్ ను రాకెట్ లోకి పంపే ముందు పరీక్షించేలా చూసుకున్నారు.
వీరముత్తవేల్, ప్రాజెక్ట్ డైరెక్టర్
చంద్రయాన్- 3 మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వీరముత్తు వేల్ కూడా నాలుగేండ్లుగా ఈ ప్రాజెక్ట్ కోసమే గడిపారు. చెన్నై నుంచి మాస్టర్స్ డిగ్రీ సాధించిన వీరముత్తువేల్.. గతంలో చంద్రయాన్- 2, మంగళయాన్ మిషన్లలో పాల్గొన్నారు. 2019లో విఫలమైన ల్యాండర్ విక్రమ్‌కు సంబంధించిన ఆయన పరిజ్ఞానం, పటిష్టమైన చంద్రయాన్-3 మిషన్‌ను రూపొందించడానికి పనికొచ్చింది.
ఎం.వనిత, డిప్యూటీ డైరెక్టర్
చంద్రయాన్ 3 మిషన్‌లో మరో కీలక వ్యక్తి బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ ఎం వనిత. ఈమె చంద్రయాన్- 2 మిషన్‌కు ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఉన్నారు. చంద్రుని మిషన్‌కు నాయకత్వం వహించిన తొలి ఇండియన్ మహిళ.. కాగా, వీరితో పాటు సైంటిస్టులు కల్పన, ఎం.శంకరన్, వీ నారాయణన్, ఉన్ని కృష్ణన్, బీఎన్ రామకృష్ణ తదితరులు కీలకంగా వ్యవహరించారు.