మద్యం మత్తులో బెజ్జంకి ఎస్సై వీరంగం

మద్యం మత్తులో బెజ్జంకి ఎస్సై వీరంగం

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల ఐబీ చౌరస్తా సమీపంలో మంగళవారం అర్ధరాత్రి సిద్దిపేట జిల్లా బెజ్జంకి ఎస్సై ఆవుల తిరుపతి, అతడి ఫ్రెండ్స్​ వీరంగం సృష్టించారు. హాజీపూర్​ మండలం వేంపల్లికి చెందిన తిరుపతి దీపావళి పండుగ సందర్భంగా స్వగ్రామానికి వచ్చాడు. ఏడుగురు ఫ్రెండ్స్​తో కలిసి ఐబీ చౌరస్తా సమీపంలోని ఓ బార్​ పక్కన రోడ్డుపై మద్యం తాగారు. గవర్నమెంట్​హాస్పిటల్​లో డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్న ఓ మహిళా వైద్య సిబ్బందిని ఈలలు వేస్తూ టీజింగ్ ​చేశారు. ఆమె తన భర్తకు ఫోన్​ చేసి విషయం చెప్పగా అతడు డయల్​ 100కు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న బ్లూకోల్ట్స్​కానిస్టేబుళ్లు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఎస్సై తిరుపతి గ్యాంగ్​ను అక్కడి నుంచి పంపించే క్రమంలో బ్లూకోల్ట్స్​​ సిబ్బందిపైనే దాడికి దిగారు. వాళ్ల దగ్గరున్న ట్యాబ్​లు పగలగొట్టి సెల్​ఫోన్లు గుంజుకున్నారు. స్థానికులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించడంతో కారు వదిలేసి అక్కడినుంచి పారిపోయారు. ఈ ఘటనలో బ్లూకోల్ట్​కానిస్టేబుళ్లు ఉస్మాన్, సంపత్​కు గాయాలయ్యాయి. పోలీసుల డ్యూటీకి ఆటంకం కలిగించి దాడి చేశారని ఆవుల తిరుపతి, అతని ఏడుగురు ఫ్రెండ్స్ పై ఐపీసీ 333తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బుధవారం సాయంత్రం తిరుపతి, అనురాగ్, వినయ్ కుమార్, నవీన్​ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. వారికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మిగతా నలుగురు పరారీలో ఉన్నారు. సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించి తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారులకు రిపోర్టు చేస్తామని ఏసీపీ తిరుపతిరెడ్డి చెప్పారు.