బాపట్లలో కట్ట తెగిన కృష్ణా నది.. బెజవాడ గజగజ

  • రివర్స్ తన్నిన బుడమేరు.. 
  • ప్రకాశం బ్యారేజీ నుంచి వరద 
  • లంక గ్రామాల ప్రజల తరలింపు

హైదరాబాద్, వెలుగు:  ఏపీలోని బెజవాడ నగరం గజగజ వణికింది. 30 ఏండ్లలో కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలం అయింది. కాలనీలన్నీ నీట మునిగాయి. ఆటోనగర్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. పాతబస్తీ, బందరు రోడ్డు, సింగ్​నగర్, ఏలూరు రోడ్డు సహా విజయవాడ సిటీలోని అన్ని ప్రాంతాలూ జలమయమయ్యాయి. శుక్రవారం రాత్రి మొదలైన వర్షం.. శనివారం నాటికి ఉగ్రరూపం దాల్చింది. దీంతో సిటీ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా 29 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. 

వీధుల్లో దాదాపు నాలుగడుగుల మేర వరద నీరు నిలిచింది. మధురానగర్ బ్రిడ్జి, కృష్ణలంక అండర్ గ్రౌండ్ బ్రిడ్జి దగ్గర 5 అడుగుల మేర వరద చేరింది. మోటార్లు పనిచేయక వరద నీటిని ఎత్తిపోయలేకపోయామని అధికారులు తెలిపారు. మంగళగిరిలోనూ ఒక్కరోజులోనే 28 సెంటమీటర్ల వర్షం కురిసింది. మంగళగిరి–తాడేపల్లి మధ్య మెయిన్​ రోడ్లన్నీ మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోయాయి. వరద ప్రవాహంలో చాలా చోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. వాటిని కాపాడుకునేందుకు యజమానులు తిప్పలు పడ్డారు. రాష్ట్రంలో కురిసిన వర్షాలకు 9 మంది మృతి చెందారు. విజయవాడ మొగల్​రాజపురంలోని కొండప్రాంతాల్లో ఉన్న ఇండ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. 

దీంతో ఐదుగురు మరణించారు. రాష్ట్రంలోని 294 గ్రామాలకు చెందిన 13 వేల మందికిపైగా ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలించారు. 7 జిల్లాల్లో 9 ఎస్డీఆర్​ఎఫ్​, 8 ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. మరోవైపు ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణమ్మ ఉగ్రరూపంతో సముద్రంవైపు ఉరకలెత్తుతున్నది. దీంతో లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని లంక గ్రామాలు ఇప్పటికే నీట మునిగాయి. పులిగడ్డ, చిరువోల్లంక, కె. కొత్తపాలెం, బొబ్బర్లంక, ఆముదార్లంక, ఎడ్లంక తదితర లంక గ్రామాల ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలించారు.

సీఎం చంద్రబాబు రివ్యూ..

ఏపీలో వరదల పరిస్థితిపై ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు అధికారులతో రివ్యూ చేశారు. వరదలు తగ్గుముఖం పట్టే వరకు విజయవాడ కలెక్టరేట్​లోనే ఉంటూ రివ్యూ చేస్తానని తెలిపారు. బుడమేరు వరద బాధితుల కష్టాలు తీరుస్తామన్నారు. క్షేత్రస్థాయిలో వరదల తీవ్రతను వివరించడంలో అధికారులు విఫలమయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష మందికి సరిపోయేలా ఆహారం, పాలు, ఇతర నిత్యావసరాలను సిద్ధం చేయాలన్నారు. అందుబాటులో ఉన్న ప్యాకేజ్డ్ ఫుడ్​ను బాధితులకు అందించాలని ఆదేశించారు. 

వృద్ధులు, చిన్నారులను వరద ప్రభావిత ప్రాంతాల నుంచి వెంటనే తరలించాలని, సిటీలోని అన్ని షాపుల నుంచి వాటర్ బాటిల్స్ తెప్పించి బాధితులకు అందజేయాలన్నారు. కాగా, కలెక్టరేట్​లోనే సీఎం చంద్రబాబు ఉండేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే సీఎం బస్సులో బస చేసేలా సిద్ధం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. సింగ్​నగర్​కు బోటులో వెళ్లి బాధితులను పరామర్శించారు.