బచ్చన్నపేట, వెలుగు : తమ కులమేదో చెప్పాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం వీఎస్‌ఆర్ నగర్‌కు చెందిన బెల్దారీలు మంగళవారం తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. తమకు ఏ కులం సర్టిఫికెట్ ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగాలకు, ఉన్నత చదువులకు దూరం అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2017 వరకు ఎస్టీ సర్టిఫికెట్ ఇచ్చిన ఆఫీసర్లు ఆ తర్వాత ఏ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు.
ఎక్కడికి వెళ్లినా సమస్య పరిష్కారం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని తహసీల్దార్ విశాలాక్షి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.