కర్ణాటకలో బెళగావి మాదేనంటున్నారు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే. అంగుళమైనా వదిలేది లేదంటున్నారు కర్ణాటక సీఎం యెడ్డీ. ఈ వివాదం వెనుక 65 ఏళ్లనాటి స్టేట్ రీఆర్గనైజేషన్ రిపోర్టు ఉంది. అంతకంటే ముందు సాగిన మరాఠా యుద్ధాల పాత్ర ఉంది. ఛత్రపతి శివాజీ తండ్రి కన్నడ ప్రాంతాలను పాలించిన చరిత్ర ఉంది. 12 ఏళ్లుగా సుప్రీం కోర్టులో నలుగుతున్న కేసు ఉంది. కదిపితే కందిరీగలా చికాకు పెట్టే సరిహద్దు తగాదాపై పొలిటికల్ వార్ మళ్లీ రాజుకుంది.
తేనెతుట్టెని కదల్చడం పొలిటీషియన్లకు తెలిసినట్లుగా మరెవరికీ తెలియదు. ఊహించని రీతిలో సీఎం సీటులో కూర్చున్న శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే సరిగ్గా అదే పని చేశారు. కర్ణాటకలోని బెళగావి, నిప్పాణి ప్రాంతాలు మహారాష్ట్రవేనని బాంబు పేల్చారు. ఆయన పదవిలోకి వచ్చాక జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశంలోనే ఈ క్లెయిమ్ చోటు చేసుకుంది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పటి నుంచీ… 65 ఏళ్లుగా సాగుతున్న ఈ వివాదానికి ఇప్పుడు పూర్తిగా పొలిటికల్ కలర్ అద్దారు.
ఉద్ధవ్ థాక్రే డిమాండ్‌ని అర్థం చేసుకోవాలంటే… 1956లో జరిగిన రాష్ట్రాల రీఆర్గనైజేషన్ని, లింగ్విస్టిక్ ఉద్యమాలను పరిశీలించాలి. రాష్ట్రాల రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద కర్ణాటక (మైసూర్ స్టేట్), ఆంధ్రప్రదేశ్, బొంబాయి స్టేట్లను ఏర్పాటు చేసినప్పుడు అంతకు ముందటి సరిహద్దులు చెరిగిపోయాయి. కన్నడ మాట్లాడేవాళ్లు ఎక్కువగా ఉన్న బెల్గాం (బెళగావి), బీజాపూర్, ధార్వాడ్, ఉత్తర కెనరా, బళ్లారి జిల్లాలను కర్ణాటకలో కలిపారు. అలాగే, హైదరాబాద్ స్టేట్‌లోనూ, దక్షిణ మధ్యప్రదేశ్‌లోనూ, సౌరాష్ట్ర, కచ్ ఏరియాల్లోనూ మరాఠీ మాట్లాడేవాళ్లను బొంబాయి స్టేట్‌లో కలిపారు. బొంబాయి స్టేట్ ‘బైలింగ్వల్ స్టేట్ (ద్విభాషా రాష్ట్రం)’గా తయారైంది. దీనిని మరోసారి రీఆర్గనైజింగ్ చేయడంతో బీరారు, విదర్భ, హైదరాబాద్ స్టేట్‌లోని వాయవ్య ప్రాంతాలు కలవగా; గుజరాతీ మాట్లాడే సౌరాష్ట్ర, కచ్లు విడిపోయాయి. ఈ మార్పులతో ప్రస్తుతం మనం చూస్తున్న మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు 1960 మే 1వ తేదీన ఏర్పడ్డాయి.
దీనిపై గతంలోనే ఒకసారి ఉద్ధవ్ థాక్రే చాలా గట్టి పట్టే పట్టారు. బెళగావి ఏరియాని మహారాష్ట్రలో కలపాలని, అలా చేయలేని పక్షంలో యూటీగా గుర్తించాలన్నది ఆయన డిమాండ్. ఆయన ఉద్దేశంలో మరాఠీ మాట్లాడేవాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర భాషీయుల పాలనలో ఉండకూడదు. ఈ డిమాండ్‌ని ఆయన 2014లోనే బీజేపీ మిత్రపక్షంగా ఎన్డీయేలో ఉన్న రోజుల్లో చేశారు. ఆ తర్వాత మళ్లీ పెద్దగా దాని ఊసు లేదు. దాదాపు ఆరేళ్లుగా గమ్మున కూర్చున్న శివసేన పార్టీ బెళగావిపై మాట్లాడడం వెనుక చాలా కారణాలున్నాయి. ఇప్పుడు శివసేన ఎన్డీయే నుంచి విడిపోయి కాంగ్రెస్–ఎన్సీపీలతో కలిసి ‘మహా వికాస్ ఆగాధీ’గా ఏర్పడింది. పక్క రాష్ట్రంలో యెడియూరప్ప సీఎంగా బీజేపీ ప్రభుత్వం ఉంది. కేంద్రం తమ రాష్ట్రాన్ని పట్టించుకోకుండా కర్ణాటకపైనే ఎక్కువ ప్రేమ చూపిస్తోందని ఇప్పటికే ఉద్ధవ్ ఆరోపిస్తున్నారు.
మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి (ఎంఈఎస్) ఎప్పటినుంచో మరాఠీ మాట్లాడే ప్రాంతాలపై పోరాడుతోంది. ఎంఈఎస్ వాదన ప్రకారం… దాదాపు 800 మరాఠీ గ్రామాలను బొంబాయి స్టేట్ నుంచి వేరు చేసి కర్ణాటకలో కలిపేశారు. దీనిని కర్ణాటక నవనిర్మాణ్ సేన తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో శివసేన ఉనికిని బలంగా చెప్పుకోవాలని ఉద్ధవ్ పాత తగాదాని పైకి తెచ్చారని ఎనలిస్టులు అంటున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉద్ధవ్ ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తడంతో రెండు రాష్ట్రాల బోర్డర్‌లోనూ హింసాత్మక ఘటనలు, పొలిటికల్ కామెంట్లు చోటు చేసుకుంటున్నాయి. మహారాష్ట్రలోని కొల్హాపూర్ నుంచి కర్ణాటకకు వెళ్లే బస్సు సర్వీసుల్ని నిలిపేశారు. బోర్డర్ ఏరియాల్లోని థియేటర్లలో కన్నడ సినిమాలు ఆడకుండా అడ్డుకుంటున్నారు. రెండు రాష్ట్రాల సీఎంల దిష్టిబొమ్మల్ని కాల్చడం, బంద్‌లు పాటించడం లాంటివి జరుగుతున్నాయి. కర్ణాటక మంత్రి జగదీశ్ శెట్టర్ (బీజేపీ) మరో అడుగు ముందుకేసి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో ఉద్ధవ్ నోరు మూయించాలని, వినకపోతే మహారాష్ట్ర కూటమి నుంచి తప్పుకోవాలని సవాల్ విసురుతున్నారు. శెట్టర్ పార్టీకే చెందిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మరాఠీ ప్రజల పక్షాన నిలబడ్డారు. ‘మరాఠీ సోదరులకు అన్యాయం జరిగితే సహించేది లేదు’ అంటున్నారు.
ఈ వివాదానికి మహాజన్ కమిటీ ఇచ్చిన రిపోర్టుకూడా కారణమని ఎనలిస్టులు చెబుతున్నారు. ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్టులో… బెల్గాం (ఇప్పటి బెళగావి)ని మహారాష్ట్రలో కలపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలో మొదట్నుంచీ కన్నడ ప్రజలెక్కువగా ఉండేవారని, మరాఠాలు జరిపిన యుద్ధాల కారణంగా జనాభాలో మార్పులు జరిగినట్లుగా చారిత్రక ఆధారాలుకూడా ఉన్నాయని పేర్కొంది. ఈ విషయాన్నే ఉద్ధవ్ థాక్రే అసెంబ్లీలో ప్రస్తావించారు. మహారాష్ట్ర నుంచి 20 ఊళ్లు కర్ణాటకలో కలిపేశారని, వాటికోసం మరాఠీ ప్రజలు చేస్తున్న ఉద్యమాన్ని మహాజన్ కమిషన్ పట్టించుకోలేదని ఆరోపించారు. యూపీయే–1 గవర్నమెంట్ (2004–09) ఉండగా, ఈ వివాదాన్ని సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించాలని ప్రయత్నించినా కుదరలేదు. 2007లో విలాస్‌రావు దేశ్‌ముఖ్ ప్రభుత్వం (కాంగ్రెస్) ఈ ఇష్యూపై కోర్టుకెక్కింది. కర్ణాటకలో ఉన్న గుల్బర్గా, కార్వాడ్, బెళగావి జిల్లాల్లో ఉన్న 800 గ్రామాల్ని మహారాష్ట్రలో కలపాలని సుప్రీం కోర్టులో కేసు వేసింది. ఇది ఇప్పటికీ పెండింగ్ కేసుగానే ఉంది. ఎప్పటికైనా బెళగావి, నిప్పాణి ప్రాంతాలు మహారాష్ట్రకే దక్కాలని థాక్రే గట్టిగా పట్టుదలతో ఉన్నారు.
కర్ణాటక సెకండ్ కేపిటల్ బెళగావి
మహారాష్ట్ర డిమాండ్ ఎలా ఉన్నప్పటికీ… కర్ణాటక ప్రభుత్వం మాత్రం బెళగావిని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. కర్ణాటక రాష్ట్రం ఏర్పడి యాభై ఏళ్లయిన సందర్భంగా 2007లో స్వర్ణోత్సవాలు జరిపారు. అప్పటి ముఖ్యమంత్రి కుమారస్వామి బెళగావిని రెండో కేపిటల్‌గా ప్రకటించి, అక్కడ సువర్ణ విధాన సౌధ (అసెంబ్లీ) నిర్మాణానికి భూమి పూజ కూడా చేశారు. ఆయన తర్వాత వచ్చిన యెడియూరప్ప పనులు చురుగ్గా జరిపించారు. సుమారు 500 కోట్ల రూపాయల ఖర్చుతో బెళగావిలో రెండో అసెంబ్లీ బిల్డింగ్‌ను కట్టారు. దీనిని 2012లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరంభించారు. ప్రారంభోత్సవానికే 15 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. బెల్గాంగా మహారాష్ట్ర పిలుస్తున్నందువల్ల దీని పేరు కూడా మార్చేసింది. ఏడాదికొకసారి జరిపే అసెంబ్లీ సమావేశాలకోసం 500 కోట్లు ఖర్చు చేశారన్న విమర్శల్నికూడా పట్టించుకోవడం లేదు. దీనిని బట్టి బెళగావి విషయంలో కర్ణాటక ఎంత పట్టుదలగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కన్నడకి మరాఠీకి లింకేంటి?
షహజీ భోంస్లే, అతని కొడుకు ఛత్రపతి శివాజీ, మనవడు రాజారాంల హయాంలో మరాఠాలు పుణే నుంచి తంజావూరు, పుదుచ్చేరిల వరకు విస్తరించారు. విజయనగర సామ్రాజ్యం కుప్పకూలాక కన్నడ ప్రాంతాలపై బీజాపూర్, మొఘలు రాజ్యాల పట్టు పెరిగింది. పుణే జాగీర్దార్ షహజీ దాదాపు 20 ఏళ్ల పాటు బీజాపూర్ రాజ్యానికి దక్షిణ ప్రాంతం (కర్ణాటక)లో సేనాపతిగా గడిపాడు. 1638లో బెంగళూరును బీజాపూర్ సైన్యం స్వాధీనం చేసుకుంది. షహజీని ఆ ప్రాంతానికి ఇన్చార్జిగా చేశారు. కోలార్, హోస్కేటే, దొడ్డబల్లాపూర్, సిర ప్రాంతాలుకూడా షహజీ పరిధిలోకే వచ్చాయి. ఆ సమయంలో పుణే తదితర మరాఠా ఏరియాల నుంచి చాలామందిని షహజీ తన కొలువులో నియమించుకున్నాడు. బెంగళూరును మోడర్న్‌గా తీర్చిదిద్దింది షహజీయే అంటారు చరిత్రకారులు. శివాజీ తన రాజ్యాన్ని పుణే నుంచి కర్ణాటక మీదుగా పుదుచ్చేరి దగ్గరున్న జింజీ కోట వరకు విస్తరించాడు. పుణే, బెంగళూరుల మధ్యనగల చాలా కర్ణాటక ఊళ్లలో మరాఠాల ప్రభావం ఉంటుందంటారు హిస్టారియన్లు.