కాంగ్రెస్​తోనే అన్ని వర్గాలకు న్యాయం : గడ్డం వినోద్​

బెల్లంపల్లి, బెల్లంపల్లి రూరల్, వెలుగు: రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్​పార్టీతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని మాజీ మంత్రి, బెల్లంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వినోద్ పేర్కొన్నారు. గురువారం కాసిపేట‌‌-2 గనిపై ఏర్పాటు చేసిన గేట్​మీటింగ్​లో ఏఐటీయూసీ నాయకులతో కలిసి మాట్లాడారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత కుటుంబ పాలనతో రాష్ట్రానికి కేసీఆర్​కుటుంబం అన్యాయం చేస్తోందన్నారు. 

తుపాకి రాముడి మాటలతో కాలం గడిపే కేసీఆర్​కు బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్​పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ఐఎన్టీయూసీ నాయకులు రాజమొగిళి, కాంపెల్లి సమ్మయ్య, దేవి భూమయ్య, మాజీ జడ్పీటీసీ రౌతు సత్తయ్య, పెద్దనపల్లి సర్పంచ్​వేముల కృష్ణ, కాంగ్రెస్ నాయకులు రాంచందర్, ప్రదీప్, సిద్ధం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ లోకి ముగ్గురు బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు

బీఆర్​ఎస్​కు చెందిన పలువురు మున్సిపల్​కౌన్సిలర్లు గడ్డం వినోద్ నివాసంలో ఆయన​ఆధ్వర్యంలో కాంగ్రెస్​లో చేరారు. 1, 3, 19వ వార్డు కౌన్సిలర్లు సూరం సంగీత, పత్తిపాక రేణుక, కొమ్ముల సురేశ్ కాంగ్రెస్​లో చేరగా వారికి వినోద్​కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనుసరిస్తున్న విధానాల వల్ల కౌన్సిలర్లకు మర్యాద లేకుండా పోయిందని, అందుకే బీఆర్​ఎస్​ను వీడినట్లు చెప్పారు. చిన్నయ్యకు ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు రాములు నాయక్, మాటూరి మధు, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య, టీపీసీసీ ఉపాధ్యక్షుడు కేవీ ప్రతాప్, లీడర్లు బండి ప్రభాకర్ యాదవ్, నాతరి స్వామి తదితరులు పాల్గొన్నారు.

ప్రజల కోసమే పని చేస్తాం: గడ్డం వర్ష

ప్రజల కోసమే పనిచేస్తున్న తన తండ్రికి ఓట్లేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గడ్డం వినోద్ కూతురు గడ్డం వర్ష ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పట్టణంలోని కాంట్రాక్టర్ బస్తీ, బజార్ ఏరియా, హనుమాన్ బస్తీల్లో కార్యకర్తలు, లీడర్లతో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పదేండ్ల పాలనతో కేసీఆర్​కుటుంబం వేల కోట్లు మింగిందని అలాంటి పార్టీకి మళ్లీ అవకాశం ఇవ్వొద్దని కోరారు.  

బీఆర్ఎస్ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు రావన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని మాట ఇచ్చారు. మెయిన్ బజార్​లో నవమ్ షాపింగ్ మాల్ లైన్ తో పాటు టైలర్ వీధులు, గోల్డ్ స్మిత్ షాపులు, మటన్ మార్కెట్ లో ప్రచారం చేశారు. దర్జీల వద్దకు వెళ్ల మెషీన్ కుట్టి వాళ్లను ఆశ్చర్యపరిచారు. ప్రచారంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మునిమంద స్వరూప, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు రామగిరి లావణ్య, సంజీవ రెడ్డి, బైరి శ్రీనివాస్, మహిళా నాయకురాలు రొడ్డ శారద,  సబ్బని రాజనర్సు, మల్లేశ్, రొడ్డ శారద తదితరులు పాల్గొన్నారు.