ఎమ్మెల్యే బేషరతుగా క్షమాపణలు చెప్పాలె : దూలం శ్రీనివాస్​

కోల్​బెల్ట్, వెలుగు : తమ సమస్యలను చెప్పుకునేందుకు వెళ్లిన అంగన్వాడీలను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా వారిపై దాడి చేయించే ప్రయత్నం చేశాడని సింగరేణి కాంట్రాక్ట్​ కార్మిక సంఘం(సీఐటీయూ) స్టేట్​ప్రెసిడెంట్ దూలం శ్రీనివాస్​మండిపడ్డారు. మంగళవారం మందమర్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంగన్వాడీ ఉద్యోగుల నిరవధిక సమ్మె ప్రచార పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు.

Also Read : రసాభాసగా PACS సమావేశం.. నేతలు, రైతుల మధ్య వాగ్వాదం

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పకుంటే అన్ని రంగాల కార్మికులను ఏకం చేసి ఈనెల 23న ఎమ్మెల్యే క్యాంప్​ఆఫీస్​ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో లీడర్లు అత్తె కళావతి, రాజేశ్వరి, కవిత, అనసూయ తదితరులు పాల్గొన్నారు. 

సమ్మెలో పాల్గొనేందుకు వెళ్తూ తీవ్ర గాయాలు

బెల్లంపల్లి రూరల్:నెన్నెల మండలంలోని ఖర్జీ గ్రామానికి చెందిన అంగన్​వాడీ టీచర్​ కోట శకుంతలకు సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. మండల కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న నిరవధిక సమ్మెలో పాల్గొనడానికి ఖర్జీ నుంచి నెన్నెలకు ఆటోలో వస్తుండగా మన్నెగూడం సమీపంలో కుక్క అడ్డు రావడంతో ఆటో డ్రైవర్​సడన్​బ్రేక్​ వేశాడు. దీంతో ముందు సీటులో కూర్చున్న శకుంతల జారి కిందపడిపోయింది. దీంతో ముఖానికి బలమైన గాయాలయ్యాయి. వెంటనే ఆమెను నెన్నెల పీహెచ్​సీకి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబీకులు తెలిపారు.