
- పీఎస్ఆర్ చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితం
- మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్
బెల్లంపల్లి, వెలుగు: కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు ఇవ్వడం పార్టీ అధిష్టాన నిర్ణయమని, తమపై అసత్య ఆరోపణలు చేయడం తగదని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. సోమవారం రాత్రి బెల్లంపల్లి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు ఏమైనా అభ్యంతరాలుంటే వాటిని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ప్రేమ్ సాగర్ 20 ఏండ్లుగా కాంగ్రెస్‌లో ఉంటే.. తమ కుటుంబం 70 ఏండ్లుగా పార్టీకి అంకితమై ఉందన్నారు.
నాడు ప్రధాని ఇందిరా గాంధీని రక్షించిన వ్యక్తి తమ తండ్రి కాకా వెంకటస్వామి అని గుర్తుచేశారు. తాను, తన సోదరుడు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఎప్పుడూ పార్టీకి నష్టం కలిగించలేదని, కాంగ్రెస్ అంటే తమకు మాతృమూర్తిలాంటిదన్నారు. మంత్రి పదవి కోసం తాము డిమాండ్ చేయలేదని చెప్పారు. తమ ఇద్దరితో పాటు ఎంపీ వంశీకృష్ణపై ప్రేమ్‌సాగర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని, తమ కుటుంబం గురించి మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదన్నారు. సమావేశంలో కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎం.సూరిబాబు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సింగతి సత్యనారాయణ, ఎండీ ఈసా, ప్రదీప్, కంకటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.