సౌలత్​లు లేకున్నా.. ప్రారంభానికి రెడీ

బెల్లంపల్లి,వెలుగు: బెల్లంపల్లి ప్రజలు చాలారోజులుగా ఎదురుచూస్తున్న 100 బెడ్స్ ​హాస్పిటల్ ప్రారంభానికి రెడీ అయ్యింది. గురువారం మంత్రులు హరీశ్​రావు, ఇంద్రకరణ్​రెడ్డి కొత్త బిల్డింగ్​ను ప్రారంభించనున్నారు. రూ.14 కోట్లతో నిర్మించిన ఈ భవనంలో ఇంకా అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రాలేదు. సరిపడ డాక్టర్లు, సిబ్బంది లేరు. 

సీహెచ్ సీ సిబ్బందితోనే.. 

ప్రస్తుతం ఉన్న 30  బెడ్స్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ( సీహెచ్ సీ ) ను11 మంది డాక్టర్లు, 60 మంది సిబ్బందితోనే వంద పడకల ఆసుపత్రి కొనసాగించాలని వైద్య విధాన పరిషత్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. వాస్తవానికి 100 పడకల ఆస్పత్రి నిర్వహణకు 22 డాక్టర్లు, 150 మంది సిబ్బంది అవసరమని ఉన్నతాధికారులు అంటున్నారని.. అంతేకాదు కొత్త హాస్పిటల్​లో బ్లడ్ బ్యాంక్, సీటీ స్కాన్, ఎంఆర్ఐ సౌకర్యం లేదు. రోగులకు కనీసం నీటి వసతి కల్పించలేదు. ఆర్వో ప్లాంట్, పేషెంట్లు, అటెండెంట్ల వెయిటింగ్​ హాల్​, అప్రోచ్ రోడ్డు, మెయిన్​గేట్​ లేవు. 

రోజుకు 500 మంది...

బెల్లంపల్లి రూరల్, టౌన్, దహెగాం, భీమిని , నెన్నెల, తిర్యాణి, కన్నెపల్లి, వేమనపల్లి, మందమర్రి, కాసిపేట, రెబ్బెన, తాండూర్, పెంచికల్ పేట ప్రాంతాల వారికి  బెల్లంపల్లి గవర్నమెంట్​హాస్పిటల్​దగ్గరవుతుంది. ప్రతీ రోజు 400 నుంచి 500 మంది ఇక్కడికి వైద్యం కోసం వస్తుంటారు. అయినా ఉమెన్​, చైల్డ్​ కేర్​ అందుబాటులో లేదు. ఈ ఏడాది మార్చిలో మంత్రి హరీశ్​రావు డయాలసిస్ సెంటర్​తో పాటు మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు డయాలసిస్ తప్ప.. మిగతావేవీ పూర్తికాలేదు. వసతులు కల్పించకుండా హాస్పిటల్ ​ప్రారంభించడం ఏంటని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

ఇట్లయితే రోగాలు రావా?

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు: రిమ్స్​హాస్పిటల్​ను బుధవారం కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ తనిఖీ చేశారు. ఆవరణ అపరిశుభ్రంగా ఉండడంపై ఫైర్​అయ్యారు. డాక్టర్లతో మాట్లాడి వెంటనే క్లీన్​ చేయాలని ఆదేశించారు. ట్రీట్మెంట్​సరిగా అందడంలేదని ఈ సందర్భంగా కొందరు పేషెంట్లు కలెక్టర్​కు ఫిర్యాదు చేయడం  గమనార్హం.