దుర్గం చిన్నయ్య దోచుకున్నదంతా బయటకు లాగుతం : గడ్డం వినోద్ 

బెల్లంపల్లి, వెలుగు :  తానూ, తన కుటుంబం కష్టపడి సంపాదించిన డబ్బుల విషయం గురించి మాట్లాడే నైతిక హక్కు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు లేదని బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి గడ్డం వినోద్ అన్నారు. మంగళవారం సాయంత్రం బెల్లంపల్లి పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దుర్గం చిన్నయ్య ఇక్కడ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎలాంటి అభివృద్ధి చేయలేదని, చిన్నయ్యతోపాటు ఆయన అనుచరులు చేసినవన్నీ భూ కబ్జాలు, అఘాయిత్యాలేనని ఫైర్​అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక చిన్నయ్య చేసిన భూ కబ్జాలపై ఓ కమిటీ ఏర్పాటు చేసి ఆయన దురాఘతాలను బహిర్గతం చేస్తానని వెల్లడించారు.

తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బెల్లంపల్లికి మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్, పీజీ కాలేజీల ఏర్పాటుతో పాటు ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు సొంతంగా పరిశ్రమలు కూడా ఏర్పాటు చేస్తానన్నారు. ఈ సమావేశంలో సీపీఐ నియోజకవర్గ సెక్రటరీ రేగుంట చంద్రశేఖర్, ఏఐసీసీ సెక్రటరీ మోహన్ జోషి, టీపీసీసీ ఆర్గ నైజింగ్ సెక్రటరీ బండి ప్రభాకర్ యాదవ్, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు కొమ్ముల సురేశ్, భూక్య రాములు నాయక్, మాటూరి మధు, మాజీ కౌన్సిలర్ పత్తిపాక రాజుకుమార్, కాంగ్రెస్ లీడర్లు కొండగుర్ల వేద ప్రకాశ్, నాతరి స్వామి, మునిమంద రమేశ్, బానేశ్, రాజేశ్, యాదగిరి పాల్గొన్నారు. 

అవినీతి, అక్రమాల చిన్నయ్యను ఓడించండి 

అవినీతి అక్రమాలకు పాల్పడే బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిన్నయ్యను చిత్తుగా ఓడించాలని టీపీసీసీ వైస్ ప్రెపిడెంట్, ఏఐసీసీ మెంబర్ టి.నాగయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. బెల్లంపల్లి పట్టణంలోని కాల్ టెక్స్​లో నిర్వహించిన కార్నర్ మీటింగ్​లో గడ్డం వినోద్​తో కలిసి ఆయన ప్రసంగించారు. దేశంలో ఎంతో చరిత్రగల బెల్లంపల్లి పట్టణాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.

రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చిన్నయ్య ఏనాడూ ప్రజా సమస్యలు పట్టించుకోలేదన్నారు. ఏ పనీ చేయని చిన్నయ్యను మూడోసారి ఎమ్మె
ల్యేగా ఎందుకు గెలిపించాలని ఆయన ప్రశ్నించారు. పేద ప్రజల కలల సాకారం కావాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు చిలుముల శంకర్, ఓబీసీసెల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బండి ప్రభాకర్ యాదవ్, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ కాంపెల్లి ఉదయ్ కాంత్ ఇతర నేతలు పాల్గొన్నారు.

జోరుగా ప్రచారం

బెల్లంపల్లి రూరల్ :  రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కేసీఆర్​ కుటుంబం చేసిందేమీ లేదని, కాంగ్రెస్​ హయాంలోనే అభివృద్ధి జరిగిందని గడ్డం వినోద్​ అన్నారు. కాసిపేట మండలంలోని ట్యాంకుబస్తీలో ఆయన ప్రచారంలో పాల్గొనగా జనం ఆయన ఘన స్వాగతం పలికారు. బెల్లంపల్లి పట్టణంలోనూ వినోద్​ ప్రచారం నిర్వహించారు.