టోల్​ ప్లాజా సిబ్బందిని కొట్టిన బెల్లంపల్లి ఎమ్మెల్యే

టోల్​ ప్లాజా సిబ్బందిని కొట్టిన బెల్లంపల్లి ఎమ్మెల్యే

మందమర్రి, వెలుగు : మంచిర్యాల జిల్లా మందమర్రి టోల్​ప్లాజా వద్ద బెల్లంపల్లి బీఆర్ఎస్​ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వీరంగం సృష్టించారు. తన వాహనానికి రూట్​క్లియర్​ చేయలేదనే కోపంతో అక్కడి సిబ్బందిపై చేయి చేసుకున్నారు. ఈ దృశ్యాలన్ని సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. అయితే, తాను ఎవరిని ఏమీ అనలేదని, కేవలం మందలించానని ఎమ్మెల్యే వివరణన ఇచ్చారు. టోల్ ​సిబ్బంది ఇష్టమున్నట్టు వసూళ్లు చేస్తున్నారని ఆక్రోషం వెళ్లగక్కారు. టోల్​ప్లాజా నిర్వాహకులు పక్క  నియోజకవర్గంలోని ఓ బీఆర్ఎస్ ​ ఎమ్మెల్యేకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, చిన్నయ్యను పట్టించుకోవడం లేదనే ఇలా చేసి ఉండొచ్చని స్థానికులు చర్చించుకుంటున్నారు.  

అసలేం జరిగిందంటే ...

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మంగళవారం తన వెహికల్​లో మంచిర్యాల నుంచి బెల్లంపల్లికి బయలుదేరారు. రాత్రి 11:30 ప్రాంతంలో మంచిర్యాల –--చంద్రాపూర్(మహారాష్ట్ర) నేషనల్​హైవే 363 ఫోర్​లేన్ ​రోడ్డుపై ఉన్న మందమర్రి టోల్​ప్లాజా వద్ద ఆగారు. అప్పుడు ఆయన వెహికల్​ ముందు రెండు వాహనాలు ఆగి ఉన్నాయి. వాటిని క్లియర్​చేసే పనిలో ఉన్న టోల్​ప్లాజా సిబ్బంది తర్వాత ఎమ్మెల్యే వాహనం దగ్గరకు వచ్చారు. ఏదో మాట్లాడిన ఆయన ఒక్కసారిగా సిబ్బందిపై చేయి చేసుకున్నారు. గన్​మెన్లు, అనుచరులు వారిస్తున్నా వినలేదు. దీంతో దెబ్బలు తిన్న వ్యక్తితో పాటు ఇతర సిబ్బంది భయంతో పరుగులు తీశారు. అయినా ఎమ్మెల్యే అక్కడే నిలబడి సిబ్బంది కోసం ఆరా తీయడం కనిపించింది. కొద్దిసేపటి తర్వాత వాహనం ఎక్కి వెళ్లిపోయారు. ఈ దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పాటు బుధవారం సోషల్​మీడియాలో వైరలయ్యాయి. ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసేందుకు టోల్​ప్లాజా నిర్వాహకులు భయపడుతున్నట్టు సమాచారం. కానీ, నేషనల్​హైవే అథారిటీ పీడీకి ఘటనపై రిపోర్టు అందజేసినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే దాడి చేసినట్టు తమకు ఫిర్యాదు అందలేదని మందమర్రి ఎస్ఐ చంద్రకుమార్​ చెప్పారు. 

ఆ ఎమ్మెల్యేకు ప్రాధాన్యత ఇస్తున్నారనేనా..

మొదటి నుంచి తనను పట్టించుకోవడం లేదని హైవే అథారిటీ ఆఫీసర్లపై బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. చెన్నూరు–బెల్లంపల్లి నియోజకవర్గాల మధ్యలో మందమర్రి టోల్​ప్లాజా ఉండగా, దీని నిర్మాణం, రోడ్డు పనుల విషయంలో సదరు ఆఫీసర్లు పక్క నియోజకవర్గంలోని ఎమ్మెల్యేకే ప్రయారిటీ ఇస్తుండడంతో చిన్నయ్య ఆగ్రహంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజుల కింద నిర్వహించిన ప్రారంభోత్సవానికి కూడా పిలవలేదని నొచ్చుకున్నారని సమాచారం. పలుసార్లు సంబంధిత ఆఫీసర్లకు ఫోన్ ​చేసి మాట్లాడేందుకు ప్రయత్నిస్తే స్పందించలేదని కూడా అంటున్నారు. ఈ క్రమంలో ఈ ఘటన జరగడం వివాదానికి 
కారణమైంది. 

ట్విటర్​లో స్పందించిన ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​

 ఘటనపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ ట్విటర్​లో స్పందించారు. ‘ఇంత ఓపెన్​గా గన్​మెన్ల పహారాలో గుండాగిరి జరుగుతుంటే ఎట్లా చూస్తూ ఊర్కోవాలె. కేసీఆర్​కో హఠావో..తెలంగాణ కో బచావో’ అని ట్వీట్​చేశారు.   

సిబ్బంది నిర్లక్ష్యంగా మాట్లాడిన్రు

టోల్​ప్లాజా దగ్గర మేనేజర్​ ఎవరని అడిగితే సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన్రు. నేను మందలించిన అంతే. రోడ్డు నిర్మాణ పనులు పూర్తికాకుండానే టోల్ ​ట్యాక్స్ ​వసూలు చేస్తున్నరు. దీని గురించి హైవే ఆఫీసర్లకు ఫోన్​ చేసి అడిగినా స్పందించలే. అంబులెన్స్​లను కూడా ఆపుతూ ఇబ్బందులు పెడుతున్నరు. ఈ మధ్య రైలు ఢీకొని కాళ్లు కోల్పోయిన వ్యక్తిని అంబులెన్స్​లో తీసుకువెళ్తుంటే ఐదు నిమిషాలు ఆపిన్రు. 20.కి.మీ దూరంలోని జిల్లా కేంద్రానికి పోతే రూ.150 తీసుకుంటున్నరు. 

– దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్యే , బెల్లంపల్లి