
- పట్టాలు రాకున్నా ఫర్వాలేదు
- కబ్జాలను ప్రోత్సహించేలా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కామెంట్స్
- మున్సిపల్, రెవెన్యూ ఆఫీసర్లు అడ్డు చెప్పొద్దని సూచన
- సింగరేణి, ప్రభుత్వ భూముల్లో ఇండ్లకు పట్టాలివ్వడంలో సర్కారు విఫలం
- ఇప్పటికే బెల్లంపల్లిలో యథేచ్ఛగా భూ ఆక్రమణలు
ప్రభుత్వ, సింగరేణి భూముల్లో నివాసం ఉంటున్నవాళ్లు బాజాప్తాగా బిల్డింగులు కట్టుకోవాలని, ఎవరు అడ్డొస్తరో నేను చూస్తానని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. రెవెన్యూ, మున్సిపల్ఆఫీసర్లు ఎటువంటి ఆబ్జెక్షన్చెప్పొద్దని సూచించారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో గురువారం పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అక్కడ జరిగిన బహిరంగ సమావేశాల్లో మాట్లాడారు. ఇప్పటికే బెల్లంపల్లిలో కొంతమంది లీడర్లు యథేచ్ఛగా భూములను ఆక్రమించుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వ్యాఖ్యలు ప్రభుత్వ, సింగరేణి భూముల కబ్జాలను మరింతగా ప్రోత్సహించేలా ఉన్నాయని పలువురు విమర్శిస్తున్నారు.
మంచిర్యాల, వెలుగు: బెల్లంపల్లిలోని సర్వే నంబరు 170 పీపీతో పాటు మరికొన్ని సర్వే నంబర్లలో దాదాపు మూడువేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. గతంలో బెల్లంపల్లి చుట్టుపక్కల సింగరేణి కోల్మైన్స్ఉండడంతో చాలామంది ప్రభుత్వ, సింగరేణి లీజు భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. నేటికీ పేదలు రేకులషెడ్లలో నివాసం ఉంటుండగా, ఆర్థికంగా ఉన్నవారు బిల్డింగులు కట్టుకున్నారు. వీరికి యాజమాన్యపు హక్కులు లేకపోవడంతో దశాబ్దాల కాలంగా భూముల క్రయవిక్రయాలు జరగడం లేదు. దీంతో సింగరేణి, ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్నవారు తమకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2006లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల పట్టాలు జారీ చేశారు. కానీ ప్రస్తుత మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్, మందమర్రి, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి ఏరియాల్లో ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో, రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పట్టాలు ఇస్తామని పలుసార్లు హామీలు ఇచ్చినా నెరవేరలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఎమ్మెల్యేలు పట్టాలు ఇప్పిస్తామని హడావుడి చేసి గెలిచిన తర్వాత మర్చిపోయారు. ఒక్క బెల్లంపల్లిలోనే సుమారు 8వేల మంది కుటుంబాలు పట్టాల కోసం ఎదురుచూస్తున్నాయి.
ఎమ్మెల్యే ఏమన్నారంటే..
‘సింగరేణి, ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్నవాళ్లకు రెండు మూడు నెలల్లో పట్టాలు ఇస్తం. పట్టాలు ఇయ్యకున్నా పర్వాలేదు. రేకులషెడ్లతోని, తడకలతోని ఎన్ని రోజులు ఉంటం. ఈ వేదిక ద్వారా నేను బెల్లంపల్లి ప్రజలకు పిలుపునిస్తున్నా.. ప్రభుత్వ, సింగరేణి భూముల్లో పది పన్నెండు సంవత్సరాలుగా ఉంటున్నవాళ్లు ఎక్కడికక్కడ బిల్డింగులు కట్టుకోండి. ఎవ్వడు ఆపుతడో నేను చూస్త. ఆర్డీవో, కమిషనర్ ఇక్కడే ఉన్నరు. వాళ్లను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎవరు బిల్డింగులు కట్టినా మీరు ఆబ్జెక్షన్ చేయొద్దు. చైర్మన్, కౌన్సిలర్లకు చెప్తున్నా.. వార్డుల్లో మీరు బాజాప్తా నిలబడి ఇండ్లు కట్టియ్యండి. ఎవరైనా ఆబ్జెక్షన్ చేస్తే నేను నిలబడి కట్టిస్తా. బెల్లంపల్లి ఎటుచూసినా నాలుగు కిలోమీటర్లు పెరగాలె.’ అని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బెల్లంపల్లి బహిరంగ సభలో అన్నారు. పట్టాలు ఇయ్యకున్నా ఫర్వాలేదు… బిల్డింగులు కట్టుకోండి అని ఎమ్మెల్యే అనడంతో పట్టాలు వస్తాయో.. రావోనని ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. అప్పులు చేసి ఇండ్లు కట్టుకున్న తర్వాత పట్టాలు ఇయ్యకపోతే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.
యథేచ్ఛగా భూకబ్జాలు
బెల్లంపల్లిలోని 170 పీపీతో పాటు మరికొన్ని సర్వే నంబర్లలో కొంతమంది లీడర్లు యథేచ్ఛగా భూకబ్జాలకు పాల్పడుతున్నారు. సింగరేణి హాస్పిటల్ఎదురుగా ఉన్న ఐదెకరాల భూమిని ఆక్రమించుకున్న టీఆర్ఎస్ కౌన్సిలర్ ఒకరు ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారు. అతడు ఫేక్ డాక్యుమెంట్లతో కోర్టుకు వెళ్లినట్టు రెవెన్యూ ఆఫీసర్లు నిర్ధారించినా పొలిటికల్ప్రెజర్ వల్ల ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు. అలాగే షంషీర్‌నగర్‌లో ఇరవై ఏళ్ల క్రితం షాదీఖానాకు కేటాయించిన రెండెకరాల్లో ఎకరంన్నర కబ్జాకు గురైంది. ఇటీవల అక్కడే మరికొంత స్థలాన్ని చదును చేసి ఏకంగా ‘దుర్గం చినన్న నగర్’ అని ఫ్లెక్సీ పెట్టారు. గతంలో పేదలకు కేటాయించిన ఇందిరమ్మ ఇంటి స్థలాలను ఒక మండల ప్రజాప్రతినిధి అమ్ముకుంటున్నాడు. మరో కౌన్సిలర్ శ్మశానవాటికలో ఉన్న సమాధులను తొలగించి ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఇలా అంబేద్కర్‌నగర్, షంషీర్‌నగర్, కన్నాలబస్తీ, మార్కెట్ ఏరియాతో పాటు టౌన్‌లోని పలు కాలనీల్లో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ భూముల్లో బిల్డింగులు కట్టుకోవాలని ఎమ్మెల్యే పిలుపునివ్వడంతో పేదల పేరుతో లీడర్లు మరింత విజృంభించే అవకాశం లేకపోలేదని పలువురు విమర్శిస్తున్నారు.
For More News..