దుర్గం చిన్నయ్యకు నన్ను విమర్శించే అర్హత లేదు : గడ్డం వినోద్ 

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను ప్రజలు చీదరించుకొని తిరస్కరించారని, ఆయన ఓ కబ్జాదారు, ప్రజావ్యతిరేకి అని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మండిపడ్డారు. ఎమ్మెల్యే వినోద్ శుక్రవారం ‘వెలుగు’తో మాట్లాడారు.  రెండ్రోజుల క్రితం దుర్గం చిన్నయ్య తనపై చేసిన విమర్శలు అర్థరహితమన్నారు. పదేండ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన చిన్నయ్య బెల్లంపల్లి ప్రజలను ఏమాత్రం పట్టించుకోలేదని, ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇప్పించడంలో విఫలమయ్యారన్నారు.

అవినీతి అక్రమాలు, భూకబ్జాలు చేయడమే ఆయన పని అని ఆరోపించారు. పదేండ్లు ఎమ్మెల్యేగా ఉండి బెల్లంపల్లి ప్రజలకు ఏం చేశాడో సమాధానం చెప్పాలన్నారు. ప్రజలు ఆయనను ఈసడించుకొని మొన్నటి ఎన్నికల్లో తరిమి కొట్టారని ఎద్దేవా చేశారు. తన గెలుపుని జీర్ణించుకోలేక ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని అన్నారు. తనపై, కాంగ్రెస్ పార్టీపై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తే ప్రజలే తగిన బుద్ధిచెప్తారని హెచ్చరించారు.