బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత బీఆర్ఎస్ను వీడారు. 50 మంది నేతలతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. గురువారం హైదరాబాద్‌లోని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ నివాసానికి వెళ్లిన జక్కుల శ్వేత, ఆమె భర్త శ్రీధర్‌తో పాటు 11వ వార్డు ప్రెసిడెంట్ బోగ కృష్ణ,సెక్రెటరీ శివ సహా 50 మందితో కలిసి కాంగ్రెస్‌లో చేరారు.
ఈ పరిణామాలతో బెల్లంపల్లి బీఆర్ఎస్ లీడర్లు అవాక్కయ్యారు. ఎన్నికల ముందు ఐదురుగు మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరగా.. తాజాగా చైర్ పర్సన్ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. మరికొంతమంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా ఆ పార్టీని వీడేందుకు సిద్ధమౌతున్నట్లు సమాచారం. అయితే, తనపై అవిశ్వాసం ప్రవేశపెట్టే పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుసుకున్న చైర్పర్సన్ తన పదవిని కాపాడుకునేందుకే కాంగ్రెస్‌లో చేరినట్లు తెలుస్తోంది.
మున్సిపల్ చైర్ పర్సన్,వైస్ చైర్మన్‌పై అవిశ్వాసం
బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్‌పై అవిశ్వాసాన్ని కోరుతూ 19 మంది మున్సిపల్ కౌన్సిలర్లు గురువారం సాయంత్రం కలెక్టర్ బదావత్ సంతోష్‌కు లేఖ అందజేశారు.19 మంది కౌన్సిలర్లు ఓ సమావేశం ఏర్పాటు చేసుకొని సంయుక్తంగా తీర్మానం చేశారు. సంతకాలు చేసిన లేఖను కలెక్టర్‌కు అందజేశారు.
ఒకటో వార్డు కౌన్సిలర్ సూరం సంగీత, 2వ వార్డు ఎస్కే అప్సర్, 3వ వార్డు పత్తిపాక రేణుక, 5వ వార్డు బొడ్డు విజయ తిరుమల, 6వ వార్డు మాటూరి మధు, 9వ వార్డు భూక్య రాము నాయక్, 10వ వార్డు కొక్కెర చంద్రశేఖర్, 12వ వార్డు నెల్లి శ్రీలత, 16వ వార్డు ఎలిగేటి సుజాత, 18వ వార్డు గురుండ్ల లక్ష్మి, 19వ వార్డు కొమ్ముల సురేశ్, 21వ వార్డు రాజనాల కమల, 24వ వార్డు దామెర శ్రీనివాస్, 25వ వార్డు తుంగపెళ్లి సుజాత, 26వ వార్డు పోతరాజుల లీల, 28వ వార్డు కెంశెట్టి సరిత, 30వ వార్డు సుకేసిని భరద్వాజ్, 33వ వార్డు కౌన్సిలర్ పోలు ఉమాదేవి ఇందులో ఉన్నారు.
నాలుగేండ్లుగా చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఇద్దరూ కలిసి వార్డుల అభివృద్ధికి సరిపడా నిధులు ఇప్పించకుండా పక్షపాతం వహించారని మండిపడ్డారు.