
- బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఘటన
- పోలీసుల దెబ్బలకే చనిపోయాడని కుటుంబ సభ్యుల ఆరోపణ
బెల్లంపల్లి, వెలుగు : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఓ యువకుడు పోలీసు కస్టడీలో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. పట్టణంలోని రైల్వేస్టేషన్ పెద్దనపల్లి కాలనీకి చెందిన కీర్తి అంజయ్య (24) గోనె సంచుల గోదాంలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. ఆదివారం ఇంటి వద్ద బాబాయ్ లక్ష్మీనర్సయ్యతో అతడికి గొడవ జరిగింది. ఈ విషయంపై లక్ష్మీనర్సయ్య బెల్లంపల్లి టూ టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అంజయ్యను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు.
మధ్యాహ్నం భోజనానికి వెళ్లి మళ్లీ రావాలని పోలీసులు సూచించడంతో భోజనం చేసి తిరిగి స్టేషన్‌కు వెళ్లాడు. కాగా, సాయంత్రం ఉన్నట్టుండి అంజయ్య తాను కూర్చున్న కుర్చీలోనే కుప్పకూలి మృతి చెందాడని పోలీసులు చెప్తున్నారు. ఈ విషయాన్ని పోలీసులు రాత్రి 8 గంటలకు అంజయ్య కుటుంబీకులకు ఫోన్లో చెప్పారు. అంజయ్యకు ఫిట్స్ వచ్చి చనిపోయాడని, మృతదేహాన్ని బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించామని పేర్కొన్నారు. దీంతో అంజయ్య కుటుంబ సభ్యులు రాత్రి బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఆందోళన చేశారు. పోలీసులు కొట్టిన దెబ్బలకే అతను మృతి చెందాడని ఆరోపించారు. సోమవారం బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి ముఖేశ్.. డీసీపీ సుధీర్ రాంనాథ్, ఏసీపీ సదయ్యతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు.
మంచిర్యాల జిల్లా కేంద్రం ఆసుపత్రిలో ఫోరెన్సిక్డాక్టర్ల సమక్షంలో అంజయ్య డెడ్‌బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించాలని పోలీసులను జడ్జి ఆదేశించారు. దీంతో బాడీని మంచిర్యాల ప్రభుత్వ జనరల్
ఆసుపత్రికి తరలించారు.