బెల్లి లలిత సోదరుడు కృష్ణయాదవ్ ను పరామర్శించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణ ఉద్యమకారిణి, స్వర్గీయ బెల్లి లలిత సోదరుడు బెల్లి కృష్ణయాదవ్ ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. స్వయంగా కృష్ణయాదవ్ ఇంటికి వెళ్లిన ఆర్ఎస్ ప్రవీణ్.. ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని సాయినగర్ కాలనీలో బెల్లి కృష్ణయాదవ్ నివాసం ఉంటున్నాడు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రజల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వానికి ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. బడుగు, బలహీనర్గాలకు, నిరుపేద కుటుంబాలకు బీఎస్పీ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వస్తే భువనగిరి జిల్లాకు బెల్లి లలిత జిల్లాగా పేరు పెడుతామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఉందన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంట మేడ్చల్ జిల్లా బీఎస్పీ అధ్యక్షులు రవీందర్ నాయక్, జిల్లా ఇన్ చార్జ్ గౌడ సుదర్శన్, ప్రధాన కార్యదర్శి ఇటుకల అంబేడ్కర్, నియోజికవర్గ, మండల స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.