తెలంగాణ కోసం జీవితం అర్పించిన సామాజిక విప్లవకారిణి గానకోకిల బెల్లి లలిత. తెలంగాణ అస్థిత్వం కోసం గళమెత్తి గర్జించి, ప్రజల ఆర్తిని, ఆకాంక్షలను గానంగా మలిచి మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదింది లలితక్క. తన చివరి శ్వాస వరకు తెలంగాణ పాట పాడిన ఆమె జీవితం ఎంతో ఆదర్శం. ఉద్యమాల గడ్డ ఉమ్మడి నల్గొండ జిల్లా ఆత్మకూరు మండలం నాంచారిపేటలోని నిరుపేద కుటుంబంలో బెల్లి రామయ్య, వెంకటమ్మ దంపతులకు 1974 ఏప్రిల్29న బెల్లి లలిత జన్మించింది. తండ్రి వ్యవసాయ కూలి. గొర్లు కాయడం, ఒగ్గు కథలు చెప్పడం వారికి వారసత్వంగా వస్తున్న వృత్తి. ఒగ్గుకథ చెప్పేటప్పుడు ఆటకు పాదం కదుపుతూ, పాటకు తాళాలు మోగించి, గొంతుతో గొంతు కలిపి లలిత గాత్రం చేయడం చిన్నప్పుడే నేర్చుకుంది. చిన్నప్పుడే భువనగిరిలోని పత్తి మిల్లులో కార్మికురాలిగా చేరింది. కార్మికురాలిగా పనిచేస్తూనే, అక్కడి సమస్యలపై కొట్లాడి కూలీలకు ప్రేరణనిచ్చింది. సీఐటీయూలో చేరి, తన పంథాకు అది సరైనది కాదని అందులోంచి బైటికివచ్చి, నిజమైన ఉద్యమ కార్యాచరణను ఎన్నుకున్నది. భువనగిరిలో సాహితీ మిత్రమండలి ప్రారంభించి, తన కార్యక్రమాలతో ప్రత్యామ్నాయ సాహిత్య, రాజకీయ కృషిని ప్రారంభించింది.
ఉద్యమ చైతన్యం
ఒక పక్క కూలీ పని చేస్తూ కుటుంబాన్ని సాకుతూమరోపక్క సామాజిక ఉద్యమాల్లో పాటలు పాడేది లలిత. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ద్వారా లలితక్క క్రియాశీల రాజకీయాల్లోకి అడుగు పెట్టింది. 1997 మార్చిలో భువనగిరిలో జరిగిన ‘దగాపడ్డ తెలంగాణ’ సభకు 50 వేలకుపైగా జనం వచ్చారు. అందులో లలితక్క తన పాటలతో సభా ప్రాంగణాన్ని దద్దరిల్లేలా చేసింది. ఆ బహిరంగ సభ ద్వారా ఆమె తెలంగాణ నినాదానికి జీవం పోసి ఉద్యమకారుల్లో ఆశలు చిగురించేలా చేసింది. పాటే జీవితంగా ఎంచుకున్న లలిత తెలంగాణ పాటకు కేరాఫ్ అడ్రస్ అయింది. తన పాటలతో లక్షలాది జనాన్ని ఉత్తేజ పరిచింది. దీంతో తెలంగాణ అంతటా లలితక్క పేరు మారు మోగింది. తెలంగాణ ప్రజలు ఎంతో ప్రేమగా లేడీ గద్దర్, నైటింగేల్ ఆఫ్ తెలంగాణ, గాన కోకిల అని బిరుదునిచ్చారు. పాట పాటతీరుగా ఉన్నన్ని రోజులు ఏంకాలె, ఎప్పుడైతే పాట అస్థిత్వం కోసం ధిక్కార స్వరం వినిపించిందో రాజ్యం వెన్నులో వణుకు పుట్టింది. ప్రత్యేక తెలంగాణ డిమాండ్ ఉవ్వెత్తున ఎగిసిపడుతుండటంతో నాటి ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేదు. అందులోనూ రాష్ట్ర హోం మంత్రి ఇలాఖ భువనగిరి నుంచి లలితకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే ప్రతిపాదనలు రావడం కొందరికి కంటగింపుగా మారింది. పాటకు శాశ్వతంగా పాడే కట్టాలనుకున్న రాజ్యం.. బెల్లి లలితక్కను 26 మే 1999న 17 ముక్కలుగా హత్య చేయించింది. పాటకు మరణం లేదు, పాట నిరంతరం ప్రవహిస్తుంది. లలితక్క ఇచ్చిన ఉద్యమస్ఫూర్తితో ఉరకలెత్తిన పోరాటం ఎట్టకేలకు తెలంగాణ సాధించేలా చేసింది. జోహార్ బెల్లి లలితక్క.
- బద్ది గణేష్